గవర్నర్ అపాయింట్ మెంట్.. ఎవరి చేతులు కలుపుతాడు విజయ్? తమిళనాడులో ఉత్కంఠ రాజకీయాలు
ఎన్నికల ఫలితాల అనంతరం ఇప్పుడు తమిళనాడులో ‘కింగ్ మేకర్’ పాత్ర ఎవరిది అనే చర్చ జోరందుకుంది.
By: A.N.Kumar | 5 May 2026 11:06 AM ISTతమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది. సినీ నటుడు విజయ్ రాజకీయ అరంగేట్రం చేస్తూ స్థాపించిన 'తమిళగ వెట్రి కజగం' (టీవీకే) తొలి ప్రయత్నంలోనే అనూహ్యమైన విజయాలను నమోదు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. రాష్ట్రంలోని 234 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో 108 స్థానాలను కైవసం చేసుకున్న విజయ్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 ‘మ్యాజిక్ ఫిగర్’కు కేవలం 10 స్థానాల దూరంలో టీవీకే నిలిచిపోవడంతో ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠభరితమైన పరిస్థితులు నెలకొన్నాయి. విజయ్ గవర్నర్ అపాయింట్ మెంట్ కోరడం.. గవర్నర్ టైం ఇవ్వడం ఆసక్తి రేపుతోంది. దీంతో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు కోసం విజయ్ ఏ పార్టీతో పొత్తు పెడుతారన్నది ఉత్కంఠ రేపుతోంది.
అస్పష్ట తీర్పు.. మారుతున్న సమీకరణాలు
ఎన్నికల ఫలితాల అనంతరం ఇప్పుడు తమిళనాడులో ‘కింగ్ మేకర్’ పాత్ర ఎవరిది అనే చర్చ జోరందుకుంది. మెజారిటీకి కావాల్సిన 10 మంది ఎమ్మెల్యేల మద్దతు కోసం విజయ్ వేస్తున్న అడుగులు రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేస్తున్నాయి. గత ఎన్నికల ప్రచారంలో విజయ్, ప్రధానంగా ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే , నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీలను తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ నేపథ్యంలో తన సిద్ధాంతాలకు కట్టుబడి ఎవరితో చేతులు కలుపుతారు? లేక తన విమర్శలను పక్కనపెట్టి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రాధాన్యతనిస్తారా? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
కాంగ్రెస్ తో పొత్తు దిశగా అడుగులు?
రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన చర్చ కాంగ్రెస్ పార్టీ పాత్ర గురించే. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే రాహుల్ గాంధీ స్వయంగా విజయ్‌కు ఫోన్ చేసి అభినందనలు తెలియజేయడం, రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించడం చర్చనీయాంశమైంది. ఇది టీవీకే-కాంగ్రెస్ మధ్య లోపాయికారీ ఒప్పందానికి లేదా భవిష్యత్తు పొత్తుకు బాటలు వేస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ తన మద్దతును ప్రకటిస్తే అది టీవీకేకు ప్రభుత్వం ఏర్పాటులో అతిపెద్ద అండగా నిలుస్తుంది.
చిన్న పార్టీల పాత్ర.. మంత్రి పదవుల ఆశలు
సంఖ్యాబలం కోసం చిన్న పార్టీల మద్దతు ఇప్పుడు విజయ్‌కు అనివార్యం. డీఎంకే కూటమిలోని వీసీకే, కమ్యూనిస్టు పార్టీలు (సీపీఐ, సీపీఎం), డీఎండీకే వంటి పార్టీల బలం, అలాగే ఎన్డీయే కూటమిలోని పీఎంకే, ఏఎంఎంకేల పాత్ర ఇక్కడ కీలకంగా మారాయి. ఈ పార్టీలు ఇప్పటికే టీవీకేతో చర్చలు జరుపుతున్నట్లు, తమకు దక్కాల్సిన మంత్రి పదవులపై డిమాండ్లు పెడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటులో భాగంగా విజయ్ ఏయే పార్టీలకు చోటు కల్పిస్తారనేది వేచి చూడాలి.
గవర్నర్‌కు లేఖ.. వ్యూహరచన
విజయ్ రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ఆయన గవర్నర్‌ను కలిసి అపాయింట్‌మెంట్ కోరారు. రెండు వారాల్లోగా శాసనసభలో బలపరీక్ష ద్వారా తన మెజారిటీని నిరూపించుకుంటామని ఆయన లేఖ రాసినట్లు తెలుస్తోంది. పార్టీ కార్యాలయంలో తన గెలిచిన ఎమ్మెల్యేలతో విజయ్ నిరంతరం సమావేశమవుతూ, మద్దతు ఇచ్చే పార్టీల విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా విజయ్ విజయాన్ని అభినందిస్తూ తమిళనాడు అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇవ్వడం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. తమిళనాడు బీజేపీ నేతలు విజయ్‌ను ఎన్డీయేలోకి ఆహ్వానించే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
మొత్తానికి తమిళనాడులో తదుపరి ప్రభుత్వం ఎలా ఉంటుంది, విజయ్ ఏ వ్యూహంతో ముందుకు వెళ్తారు అనేది రాబోయే కొద్ది రోజుల్లో తేలనుంది. రాష్ట్ర రాజకీయ గమనాన్ని మార్చబోయే ఈ కీలక నిర్ణయం ఇప్పుడు విజయ్ చేతుల్లోనే ఉంది.
