Begin typing your search above and press return to search.

తాజా టూర్ లో పొలిటికల్ సెంటిమెంట్ రివీల్ చేసిన విజయ్

సినీ పరిశ్రమకు సెంటిమెంట్ కు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

By:  Garuda Media   |   14 Sept 2025 9:15 AM IST
తాజా టూర్ లో పొలిటికల్ సెంటిమెంట్ రివీల్ చేసిన విజయ్
X

సినీ పరిశ్రమకు సెంటిమెంట్ కు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లోనూ అలాంటి సీనే కనిపిస్తుంది. ఆ మాటకు వస్తే.. సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా సెంటిమెంట్ కు అమితమైన ప్రాధాన్యతను ఇస్తుంటారు. సినీ నటుడిగా తమిళనాడులో తిరుగులేని ఇమేజ్ ను సొంతం చేసుకున్న విజయ్.. ఈ మధ్యన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వటమే కాదు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కీలకభూమిక పోషించాలని తపిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన తన రాజకీయ పర్యటనల్ని ముమ్మరం చేస్తుతున్నారు. తమిళనాడు రాజకీయాల్లో కీ రోల్ పోషిస్తారన్న ప్రచారం జరుగుతున్న విజయ్ ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేయటం తెలిసిందే.

తాజాగా ఆయన తిరుచ్చిరాపల్లిలో తన ఎన్నికల ప్రచారాన్ని షురూ చేశారు. ఈ సందర్భంగా తాను ఇక్కడి నుంచే తన ఎన్నికల ప్రచారాన్ని షురూ చేశానో చెప్పుకొచ్చారు. తిరుచ్చిరాపల్లి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఏ రాజకీయ కార్యక్రమమైనా చివరకు కీలక మలుపు తిరుగుతుందని చెప్పిన ఆయన మాటలు ఆసక్తికరంగా మారాయి. ‘‘పూర్వం రాజులు యుద్ధాలకు వెళ్లే మేందు కులదేవతలకు ప్రార్థనలు చేసేవారు. అదే రీతిలో నేను తిరుచ్చిరాపల్లిని సందర్శిస్తున్నా. ఇక్కడి నుంచి మొదలయ్యే ఏ రాజకీయ కార్యక్రమమైనా కీలక మలుపు తిరుగుతుంది’’ అంటూ తన పర్యటనలోని అసలు విషయాన్ని రివీల్ చేశారు.

అధికార డీఎంకేతో పాటు కేంద్రంలో పవర్ లో ఉన్న బీజేపీపై ఒంటికాలి మీద విరుచుకుపడుతున్న విజయ్.. మరోసారి ఈ రెండు పార్టీల మీద చెలరేగిపోయారు. అటు కేంద్రంలోనూ.. ఇటు రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న పార్టీలు వివిధ హామీలతో తమిళ ప్రజల్ని మోసం చేస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. ప్రజలను హింసించే ఎవరినీ తాను విడిచి పెట్టనని చెప్పిన ఆయన.. కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకు వస్తామని చెబుతున్న ఒకే దేశం.. ఒకే ఎన్నిక విధానాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లుగా చెప్పారు.

నియోజకవర్గాల పునర్విభజన పేరుతో కుట్ర జరుగుతుందన్న ఆరోపణల్ని చేసిన ఆయన.. దక్షిణాది రాష్ట్రాల బలం తగ్గిపోయే ప్రమాదం పొంచి ఉన్నట్లు చెప్పారు. అంతేకాదు.. హిందీ భాషను తమిళులపై రుద్దు ప్రయత్నం జరుగుతుందన్న ఆయన.. తమిళనాడుకు బీజేపీ ద్రోహం చేస్తుంటే..డీఎంకే సొంత ప్రజల్ని మోసం చేస్తుందన్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఇచ్చిన ఎన్నికల హామీల్ని అమలు చేయటంలో వైఫల్యం చెందినట్లుగా విమర్శించారు.

తాను డబ్బు కోసం రాజకీయాల్లోకి రాలేదని.. ప్రజాసేవ కోసమే వచ్చినట్లుగా చెప్పారు. మొత్తంగా చూస్తే.. విజయ్ తొలి ఎన్నికల ప్రచార సభకు భారీగా ప్రజలు హాజరయ్యారు. సెంటిమెంట్ కు పెద్ద పీట వేస్తూ తిరుచ్చిరాపల్లిని ఎంపిక చేసుకున్న ఆయన.. తన తొలి ఎన్నికల సభ వేళ ఎంపిక చేసుకున్న మైకు విషయంలో మరింత జాగ్రత్త తీసుకుంటే బాగుండేదని చెప్పొచ్చు. ఎందుకుంటే.. ఆయన తొలి సభలో 20 నిమిషాలు ప్రసంగిస్తే.. రెండు మూడు నిమిషాలు మాత్రమే మైకు స్పష్టంగా వినిపించటం.. ఆ తర్వాత సరిగా వినిపించకపోవటంతో అభిమానులు.. కార్యకర్తలు కాసింత నిరాశకు గురయ్యారు. అయితే.. అంచనాలకు ఏ మాత్రం తగ్గని రీతిలో భారీ జనసందోహం విజయ్ సభకు హాజరైనట్లుగా చెప్పాలి.