కొత్త రాజకీయం ఇదేనా విజయ్ ?
ఈ హామీలే కాదు వరుసగా అనేక హామీలతో టీవీకే పార్టీ వరాల జల్లునే కురిపించేసింది. మహిళల ఓట్ల కోసం అన్నట్లుగా వారికే అనేక హామీలు ఇచ్చేశారు.
By: Satya P | 7 March 2026 10:15 PM ISTరాజకీయాల్లో కొత్త పార్టీలు వస్తున్నాయి అంటే అంతా ఎదురు చూసేది ఏంటి అంటే ట్రెడిషనల్ పార్టీలకు భిన్నంగా వ్యవహరిస్తాయని. రొటీన్ పాలిటిక్స్ ని దూరంగా పెడుతూ కొత్తదనం వైపు చూస్తాయని. జెన్ జెడ్ కాలంలో కూడా యాభై ఏళ్ల క్రితం నాటి ఉచిత హామీలను నమ్ముకోవడంతో కొత్త పార్టీల ఫ్లేవర్ పోతుందని అంటున్నారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఉచిత హామీలు తారాస్థాయికి చేరుకున్నాయి. అధికార డీఎంకే విపక్ష అన్నా డీఎంకే ఎన్నో ఫ్రీ హామీలు ఇస్తున్నాయి. ఇపుడు వారి సరసన తమిళ దళపతి విజయ్ నాయకత్వంలోని టీవీకే పార్టీ కూడా చేరిపోయింది.
బంగారంతోనే అంతా :
ఈ రోజున బంగారం ధరలు చూస్తే ఆకాశాన్ని అంటి ఉన్నాయి. తులం బంగారం అక్షరాలా లక్షా డెబ్బై వేల దాకా ఉంది. రోజు రోజుకీ రేటు ఎగబాకుతున్న వేళ టీవీకే పార్టీ ఉచిత హామీలలో బంగారాన్ని చేర్చేసింది. ఒక విధంగా అతి బరువైన ఖరీదైన హామీగా దీన్ని అంతా చూస్తున్నారు. పిల్లలు పుడితే ఉచితంగా బంగారం ఉంగరం ఇస్తామని అలాగే అమ్మాయికి పెళ్ళికి ఎనిమిది గ్రాముల బంగారం ఫ్రీగా ఇస్తామని టీవీకే ప్రకటించింది. దీంతో ఇది అతి పెద్ద చర్చగా మారింది ఇపుడున్న పరిస్థితుల్లో బంగారం పేరుతో ఉచిత హామీలు వర్కౌట్ అవుతాయా అమలు సాధ్యమేనా అన్నది అంతా చర్చిస్తున్నారు. ఉచిత హామీలు ఎన్నికల్లో అధికారం అందుకోవడానికి షార్ట్ కట్ మెదడ్స్ అని ఏనాడో రుజువు అయిపోయింది. అయితే ఎంత ఫ్రీ అని చెప్పినా జనాలు నమ్మేలా హామీలు ఉండాలి కదా అని అంటున్నారు. ఈ రకంగా హామీలు ఇస్తే అది బూమరాంగ్ అవుతుందా అన్నది కూడా మరో చర్చ. ప్రత్యర్ధులు సైతం దీనినే అవకాశంగా తీసుకుని రివర్స్ ఎటాక్ చేసే ప్రమాదం కూడా ఉందని అంటున్నారు.
వరాల జల్లు కురిసింది :
ఈ హామీలే కాదు వరుసగా అనేక హామీలతో టీవీకే పార్టీ వరాల జల్లునే కురిపించేసింది. మహిళల ఓట్ల కోసం అన్నట్లుగా వారికే అనేక హామీలు ఇచ్చేశారు. ప్రతీ నెలా 2,500 రూపాయలు మహిళలకు ఇస్తామని ఒక భారీ హామీ టీవీకే ఇచ్చింది. అలాగే మహిళలకు ఉచిత బస్సు అని ఇంకో హామీ కూడా ప్రకటినారు. అన్ని ప్రభుత్వ బస్సులలో ఇక మీదట ఫ్రీ అని టీవీకే పేర్కొంది. అలాగే మహిళల కోసం స్పెషల్ పోలీస్ స్టేషన్లు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించారు పేద కుటుంబాలకు ఏడాదికి ఆరు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని కూడా హామీ ఇచారు ఇక పాఠశాలకు వెళ్ళే బాలబాలికలకు ఏడాదికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని కూడా చెప్పారు ఇలా మహిళలే లక్ష్యంగా చేసుకుని టీవీకే వరాలు గుప్పించింది.
హిట్ అయిన హామీలతో :
విజయ్ టీవీకే పార్టీ పొరుగు రాష్ట్రాలలో హిట్ అయిన హామీలనే తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది అని అంటున్నారు. అయితే ఆయా రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చిన పార్టీలు ఆ హామీలు ఇవ్వలేక ఎంత ఇబ్బంది పడుతున్నాయో టీవీకే మరచిందా అని విమర్శలు వస్తున్నాయి. ఇటీవల సుప్రీం కోర్టు ఉచిత హామీల మీద చేసిన వ్యాఖ్యలను కూడా రాజకీయ పార్టీలు పట్టించుకోకుండా హామీలు ఇవ్వడం పట్ల చర్చ సాగుతోంది. అయితే ఎన్నికల్లో గెలుపే ప్రదానం అందువల్ల వ్యూహాలలో భాగంగా హామీలు ఎన్ని అయినా ఇవ్వవచ్చు కానీ మరీ కొండ మీద కోతిని తెస్తామంటే జనాలు నమ్మలి కదా అంటున్నారు. ఏది ఏమైనా హామీల విషయంలో విజయ్ పార్టీ కూడా ఆ తానులో ముక్కనే అన్నట్లుగా వ్యవహరిస్తోంది అని అంటున్నారు. మరి ఈ హామీల మీద తమిళ జనాల రియాక్షన్ ముఖ్యంగా మహిళలు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంటుంది అంటున్నారు.
