Begin typing your search above and press return to search.

తమిళనాడులో తాజా సర్వే.. విజయ్ దెబ్బకు మారుతున్న లెక్కలు.. దళపతే కింగ్ మేకర్!

ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్ది తమిళనాడులో సమీకరణాలు మారిపోతున్నాయి. ప్రధాన పార్టీల బలాబలాల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయని అంటున్నారు.

By:  Tupaki Political Desk   |   17 April 2026 4:00 PM IST
తమిళనాడులో తాజా సర్వే.. విజయ్ దెబ్బకు మారుతున్న లెక్కలు.. దళపతే కింగ్ మేకర్!
X

ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్ది తమిళనాడులో సమీకరణాలు మారిపోతున్నాయి. ప్రధాన పార్టీల బలాబలాల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయని అంటున్నారు. అధికార డీఎంకే, విపక్షం ఏఐడీఎంకే కూటములు మధ్యే పోటీ ఉంటుందని ముందుగా అంచనాలు వెలువడ్డాయి. అయితే అగ్ర నటుడు, దళపతి విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ కూడా గట్టి పోటీ ఇస్తుందని అంటున్నారు. విజయ్ సారథ్యంలోని టీవీకేపార్టీ తన బలాన్ని రోజురోజుకు పెంచుకుంటోందని, టీవీకే కారణంగా డీఎంకే, ఏఐడీఎంకే పార్టీల ఓటు బ్యాంకుకు చిల్లు పడుతోందని విశ్లేషిస్తున్నారు.

విజయ్ ఓటు బ్యాంకు పెరుగుతుందా?

తమిళనాడులో తాజా అంచనాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు వెల్లడైన ఓపినియన్ పోల్స్ లో రాష్ట్రంలో తిరిగి డీఎంకే అధికారం చేపడుతుందని అంచనాలు వెలువడ్డాయి. ఆ తర్వాత కొన్ని సర్వే సంస్థలు ఏఐడీఎంకే కూటమికి అవకాశాలు ఉన్నాయని ప్రకటించాయి. అయితే ఇప్పటివరకు ఏ సర్వేలో అయినా దళపతి విజయ్ పార్టీ పది శాతం ఓట్లు దాటదనే అంచనాలనే వెలువరించాయి. అయితే తొలిసారిగా విజయ్ పార్టీ ఓటు బ్యాంకు గణనీయంగా పెరుగుతోందని, డీఎంకే వ్యతిరేక ఓటర్లు, ఏఐడీఎంకేలో నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నవారు టీవీకే పార్టీ పట్ల ఆకర్షితులవుతున్నారని విశ్లేషిస్తున్నారు. ఇలా సంఘటితమవుతూ టీవీకేకు మద్దతుగా నిలుస్తున్నవారి ఓట్ల శాతం 20 నుంచి 25 శాతం వరకు ఉండొచ్చని వ్యాఖ్యానిస్తున్నారు.

డీఎంకే, ఏఐడీఎంకే హోరాహోరీ

ప్రముఖ సినీ విమర్శకుడు, విశ్లేషకుడు అక్షయ్ తాజాగా ఇటువంటి అంచనాలనే వెల్లడించారు. రాష్ట్రంలో త్రిశంకు సభ ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని ఆయన తన అంచనాలను వివరించారు. అధికార డీఎంకే, విపక్ష ఏఐడీఎంకే కూటమి చెరో 80-90 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని, విజయ్ పార్టీ టీవీకే 25-27% ఓట్లతో 25 నుంచి 30 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని అక్షయ్ తాజాగా ప్రకటించారు. డీఎంకే స్వల్ప ఆధిక్యం సంపాదించినా, ముఖ్యమంత్రి పీఠం అధిష్టించడానికి ఆ పార్టీ టీవీకే అధిపతి విజయ్ సహకారం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

కింగ్ మేకర్ విజయ్

తాజా అంచనాలతో తమిళనాడు ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. హంగ్ అసెంబ్లీ ఏర్పడితే టీవీకే అధిపతి విజయ్ కింగ్ మేకర్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు. విజయ్ ప్రభావంతో డీఎంకే సర్కార్ గట్టి పోటీ ఎదుర్కొంటుండగా, విపక్షం అన్నా డీఎంకే కోలుకోలేని విధంగా దెబ్బతింటుందని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిణామాలు భవిష్యత్తులో విజయ్ ని తిరుగులేని శక్తిగా నిలబెడతాయని అంటున్నారు. అంతేకాకుండా విజయ్ పార్టీతో అధికారం చేపట్టే పార్టీ ఏదైనా ఆయనను సంతృప్తి పరచి ప్రభుత్వాన్ని నడపడం అంత తేలికైన విషయం కాదని వ్యాఖ్యానిస్తున్నారు.