Begin typing your search above and press return to search.

పోటీ చేసిన ప్రతి చోటా డిపాజిట్.. విజయ్ మార్కు సంచలనం..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే (టీవీకే) పార్టీ సృష్టించిన ప్రభంజనం కేవలం గెలిచిన స్థానాలకే పరిమితం కాలేదు.

By:  Tupaki Political Desk   |   6 May 2026 10:31 AM IST
పోటీ చేసిన ప్రతి చోటా డిపాజిట్.. విజయ్ మార్కు సంచలనం..
X

సాధారణంగా ఒక కొత్త పార్టీ ఎన్నికల రంగంలోకి దిగుతోందంటే, రాజకీయ విశ్లేషకులు వేసే లెక్కలు పరిమితంగా ఉంటాయి. ఆ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి..? ఎక్కడ గట్టి పోటీ ఇస్తుంది..? అన్న కోణంలోనే చర్చ జరుగుతుంది. కానీ, తమిళనాడు రాజకీయ యవనికపై ఉదయించిన ఒక కొత్త శక్తి, ఆ అంచనాలన్నింటినీ తలకిందులు చేసింది. కేవలం సీట్లు గెలవడమే కాదు, పోటీ చేసిన ప్రతి చోటా కూడా తన ఉనికి చాటుకుంటూ ఓటర్ల మనసు గెలుచుకోవడం అసాధారణ పరిణామం. దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీలకే కొన్ని ప్రాంతాల్లో ఓటర్లు మొండిచేయి చూపుతున్న వేళ, ఈ కొత్త పార్టీ సాధించిన ఘనత ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చకు దారితీస్తోంది. అగ్రరాజకీయ పీఠం వైపు విజయవంతంగా అడుగులు వేయడమే కాకుండా.., తన వెనుక ఉన్న సైన్యం ఎంత బలంగా ఉందో ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ఒక్క డిపాజిట్ కూడా పోలేదు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే (టీవీకే) పార్టీ సృష్టించిన ప్రభంజనం కేవలం గెలిచిన స్థానాలకే పరిమితం కాలేదు. ఆ పార్టీ పోటీ చేసిన ఏ ఒక్క నియోజకవర్గంలోనూ డిపాజిట్ కోల్పోకపోవడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. బడా పార్టీలైన డీఎంకే, ఏఐడీఎంకే వంటి శక్తులకే కొన్ని చోట్ల డిపాజిట్లు గల్లంతైన ఉదంతాలు ఉండగా, తొలిసారి బరిలోకి దిగిన విజయ్ పార్టీ ఈ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. దీన్ని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఆ పార్టీకి కనీస ఓటు బ్యాంకు స్థిరంగా ఉందని అర్థం అవుతోంది. ఇది కేవలం సినీ గ్లామర్ వల్ల వచ్చిన విజయం మాత్రమే కాదని, పక్కా ప్రణాళికతో కూడిన రాజకీయం అని నిరూపితమైంది.

విన్నింగ్ మార్జిన్‌లోనూ..

గెలుపు కంటే కూడా ఆ గెలుపు గుర్రం ఎంత వేగంగా పరుగెత్తిందనేది ముఖ్యం. టీవీకే గెలుచుకున్న 108 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థుల సగటు విన్నింగ్ మార్జిన్ ఏకంగా 22,842 ఓట్లుగా నమోదైంది. ఇది ఇతర ప్రధాన పార్టీలతో పోలిస్తే చాలా ఎక్కువ. ఉదాహరణకు, ఏఐడీఎంకే అభ్యర్థుల సగటు గెలుపు మార్జిన్ 15,164 ఓట్లుగా ఉండగా, అధికారంలో ఉన్న డీఎంకే మార్జిన్ కేవలం 9,310 ఓట్లకు పరిమితమైంది. అంటే, ఒక్కో నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థులు డీఎంకే అభ్యర్థుల కంటే దాదాపు 2.5 రెట్లు ఎక్కువ మెజారిటీతో విజయం సాధించారు. ఈ గణాంకాలు విజయ్ పట్ల ప్రజల్లో ఉన్న తిరుగులేని ఆదరణకు అద్దం పడుతున్నాయి.

ఓడినా.. తగ్గని ఉత్సాహం

టీవీకేకు ఒక్క సీటు కూడా రాని ఆ ఏడు జిల్లాల్లో కూడా ఆ పార్టీ అభ్యర్థులు తమ డిపాజిట్లను దక్కించుకోవడం విశేషం. గెలుపోటములకు అతీతంగా, ఆయా ప్రాంతాల్లో పార్టీ బలంగా ఉందనే సంకేతాన్ని ఈ ఫలితాలు రుజువు చేశాయి. కన్యాకుమారి నుంచి నీలగిరి వరకు ఎక్కడా టీవీకే ప్రభావం తగ్గలేదని, కేవలం సమీకరణాల వల్ల సీట్లు కోల్పోయినా ఓటర్ల మద్దతు గణనీయంగా ఉందని ఫలితాలు చెబుతున్నాయి. ఈ పరిణామంతో విజయ్ సేన (పార్టీ కార్యకర్తలు) మరింత ఉత్సాహంగా ఉంది. భవిష్యత్తులో ఈ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారిస్తే తిరుగుండదని వారు భావిస్తున్నారు.

సరి కొత్త చరిత్ర..

తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త పార్టీ ఇంతటి గణాంకాలతో అధికారంలోకి రావడం గతంలో ఎన్నడూ జరగలేదు. ప్రజాస్వామ్యంలో ఓటు బ్యాంకు స్థిరత్వం అనేది పార్టీ దీర్ఘకాలిక భవిష్యత్తుకు పునాది. టీవీకే సాధించిన ఈ ‘క్లీన్ స్వీప్’ (డిపాజిట్ల పరంగా) ఆ పార్టీ పునాదులు ఎంత లోతుగా వెళ్తున్నాయో తెలియజేస్తోంది. స్టాలిన్, పళనిస్వామి వంటి ఉద్ధండుల మధ్య విజయ్ సాధించిన ఈ విజయం, రాబోయే రోజుల్లో ద్రవిడ రాజకీయాలను సరికొత్త బాటలో నడిపించనుంది.