Begin typing your search above and press return to search.

107 మందితో విజయ్ రాజీనామాలు చేస్తే జరిగేది ఇదే ?

తమిళనాడు రాజకీయం దేశ రాజకీయ చరిత్రలో ఎన్నడూ చూడని ఒక అనూహ్య ఘట్టానికి తెర లేపనుందా అన్న చర్చ సాగుతోంది.

By:  Satya P   |   8 May 2026 1:06 PM IST
107 మందితో విజయ్ రాజీనామాలు చేస్తే జరిగేది ఇదే ?
X

తమిళనాడు రాజకీయం దేశ రాజకీయ చరిత్రలో ఎన్నడూ చూడని ఒక అనూహ్య ఘట్టానికి తెర లేపనుందా అన్న చర్చ సాగుతోంది. తమిళనాడు ప్రజలు ఎవరికీ పూర్తి మెజారిటీ ఇవ్వలేదు, హంగ్ అసెంబ్లీ వచ్చింది. అయితే టీవీకే అధినేత ద్రవిడ పార్టీలను దూరం పెట్టి చిన్న పార్టీలతో ప్రభుత్వ ఏర్పాటుకు చేస్తున్న ప్రయత్నాలు ఆశించిన ఫలితాలని ఇవ్వడం లేదు, మరో వైపు చూస్తే డీఎంకే అన్నా డీఎంకే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని ప్రచారం ఊపందుకుంది పళని స్వామి కొత్త ముఖ్యమంత్రి అంటూ ఆ పార్టీ ఎంపీ తంబిదురై లేటెస్ట్ గా చేసిన వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో కొత్త హీట్ ని పుట్టిస్తున్నాయి.

మొత్తం రాజీనామాలు :

అయితే తనకు సీఎం సీటు దక్కకుండా ద్రవిడ పార్టీలు రెండూ ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు వస్తే కనుక మొత్తం 107 మంది ఎమ్మెల్యేలతో మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని టీవీకే అధినేత హెచ్చరించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అంటే తాము అసెంబ్లీ ముఖం చూడమని ఆయన చెబుతున్నారు అన్న మాట. అపవిత్ర కలయిక ను వ్యతిరేకిస్తూ ఈ తీవ్రమైన నిర్ణయానికి విజయ్ సిద్ధపడుతున్నారు. ఒకవేళ ఆయన చెప్పినట్లుగానే మూకుమ్మడి రాజీనామాలు చేస్తే కనుక ఏమి జరుగుతుంది అన్నదే ఇపుడు రాజకీయ విశ్లేషకులు రాజ్యాంగ నిపుణులూ కూడా చర్చిస్తున్నారు.

రాష్ట్రపతి పాలనకు :

మొత్తం 234 మందితో ఉన్న తమిళనాడు అసెంబ్లీలో 107 మంది రాజీనామాలు ఒకేసారి చేయడం అంటే ఆషామాషీ కాదు, ఇంత పెద్ద ఎత్తున రాజీనామాలు ఎమ్మెల్యేలు చేసిన ఘటన స్వాతంత్ర్య భారతావనిలో ఇంతకు ముందు లేదు. పైగా ఇలా ఎన్నికల్లో గెలిచి అలా రాజీనామాలు చేయడం అంతకంటే లేదు, దాంతో ఇది ఒక కొత్త చరిత్ర అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతే కాదు ఈ రాజీనామాల వల్ల రాజకీయ సంక్షోభం తమిళనాడులో తలెత్తే ప్రమాదం ఉందని అంటున్నారు. సగానికి సగం అసెంబ్లీ ఖాళీగా ఉంచుతూ ప్రభుత్వం నిర్వహించడం సాధ్యపడదు, దాంతో పాటుగా పెద్ద ఎత్తున ఖాళీలకు ఎన్నికలు పెట్టాల్సి ఉంటుంది. దాంతో ఈ పరిస్థితిని అధిగమించేందుకు కీలక నిర్ణయాలే తీసుకోవాల్సి వస్తుందని అంటున్నారు.

రాష్ట్రపతి పాలన :

మూకుమ్మడి రాజీనామాలు చేస్తే కనుక రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫార్సు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అపుడు ఏ పార్టీకీ ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం లేకుండా పోతుంది. కనీసంగా ఆరు నెలల పాటు రాష్ట్రపతి పాలన పెట్టి ఆ మీదట కొత్తగా అసెంబ్లీకి ఎన్నికలు పెడతారా అన్నది కూడా ఉంది. ఎందుకంటే తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం రద్దు అయింది. కొత్త ప్రభుత్వం అన్నది ఏర్పడలేదు, దాంతో 107 అసెంబ్లీ సీట్లకే కాదు మొత్తం సీట్లకే ఎన్నికలు పెట్టి తాజాగా ప్రజా తీర్పునకు కేంద్ర ఎన్నికల సంఘం చొరవ చూపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఏది ఏమైనా విజయ్ కనుక ఈ సంచలన నిర్ణయం తీసుకుంటే కనుక తమిళనాడు రాష్ట్రపతి పాలనలోకి వెళ్తుంది. అంటే కేంద్ర పాలన అన్న మాట.మరి ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది.