Begin typing your search above and press return to search.

విజయ్ మ్యానిఫెస్టో.. కాంగ్రెస్ ను కాపీ కొట్టారా?

తమిళనాడు ఎన్నికల కోసం టీవీకే అధినేత, దళపతి విజయ్ విడుదల చేసిన మ్యానిఫెస్టోపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

By:  Tupaki Political Desk   |   17 April 2026 2:37 PM IST
విజయ్ మ్యానిఫెస్టో.. కాంగ్రెస్ ను కాపీ కొట్టారా?
X

తమిళనాడు ఎన్నికల కోసం టీవీకే అధినేత, దళపతి విజయ్ విడుదల చేసిన మ్యానిఫెస్టోపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. విజయ్ ఇచ్చిన పలు హామీలు గతంలో తెలంగాణ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రకటనలను గుర్తు చేస్తున్నాయని అంటున్నారు. కొన్ని చిన్న మార్పులతో తెలంగాణ కాంగ్రెస్ మ్యానిఫెస్టోనే విజయ్ ప్రకటించారా? అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన హామీలు అన్నీ పరిశీలిస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపించిన వాగ్దానాలే అంటున్నారు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా 234 స్థానాలకు విజయ్ నెలకొల్పిన పార్టీ టీవీకే పోటీ చేస్తోంది. ఈ నెల 23న ఎన్నికల పోలింగ్ జరగనుండగా, గురువారం మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఇందులో పలు హామీలు గుప్పించారు విజయ్. ప్రతి కుటుంబానికి ఏడాదికి ఆరు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. అదేవిధంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, నిరుపేద యువతుల వివాహానికి 8 గ్రాముల బంగారం తదితర హామీలను ప్రకటించారు. అదేవిధంగా 60 ఏళ్ల లోపు వయసున్న మహిళలకు బ్యాంకు ఖాతాలో రూ.2,500 నగదు జమ చేస్తామని, ప్లస్-2 వరకు చదువుకునేందు కోసం విద్యార్థులకు ఏటా రూ.15 వేల ఆర్థిక సాయం. ఆ తర్వాత ఉన్నత చదువులకు రూ.20 లక్షల విద్యారుణం ప్రకటించారు.

నిరుద్యోగులకు రూ.4 వేల భృతి, ప్లస్2 వరకు చదువుకుని ఖాళీగా ఉన్నవారికి రూ.2,500, వంద కామరాజన్ స్పెషల్ స్కూల్ ఏర్పాటు, ఐదు ఎకరాలకన్నా తక్కువ భూమి ఉన్న రైతుల పంట రుణాల మాఫీ వంటి కీలక హామీలు ఉన్నాయి. అయితే విజయ్ మ్యానిఫెస్టోలో ఎక్కువగా తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హామీలే ఉన్నాయని అంటున్నారు. తెలంగాణలో పేద యువతుల వివాహానికి తులం బంగారం ఇస్తామని ప్రకటించగా, విజయ్ మాత్రం 8 గ్రామాలు ఇస్తామని ప్రకటించారు. అదేవిధంగా తెలంగాణలో గ్యాస్ సిలిండర్లకు రూ.500 రాయితీ ఇస్తున్నారు. విజయ్ మాత్రం ఏటా 6 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ప్రటించారు.

ఇక రైతు రుణ మాఫీపై కూడా కాంగ్రెస్ పార్టీ విధానాన్ని అనుసరించినట్లే కనిపిస్తోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. అదేవిధంగా తెలంగాణలో మహిళలకు నెలకు రూ.1,500 ఇస్తామని ప్రకటించగా, విజయ్ ఆ మొత్తాన్ని రూ.2,500 చేశారు. ఇదే హామీని కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే నెరవేర్చింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత మహిళలకు రూ.1,500 ఇస్తున్నారు. కాగా, తన పార్టీది సంక్షేమ మ్యానిఫెస్టోగా ప్రకటించిన విజయ్ ఎంపిక చేసిన పార్టీ నేతలు, ఆదర్శ రైతు, ఆటో డ్రైవర్ చేతుల మీదుగా మ్యానిఫెస్టోను ఆవిష్కరించి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.