అప్పుడు చిరు టీడీపీకి చేసిందే.. ఇప్పుడు విజయ్ అన్నాడీఎంకేకు చేశారా?
చరిత్రలోకి వెళితే.. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలో వైఎస్ భారీ మెజార్టీతో విజయం సాధించి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టటం తెలిసిందే.
By: Garuda Media | 30 April 2026 9:53 AM ISTహిస్టరీ రిపీట్ కానుందా? ఉమ్మడి ఏపీలో వైఎస్ కు తిరిగులేని అధికారాన్ని కట్టబెట్టే విషయంలో తెలీయకుండానే తన పార్టీ కారణంగా చిరు చేసినట్లే.. తాజాగా జరిగిన తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పుణ్యమా అని డీఎంకే అధినేత స్టాలిన్ కు జరగనుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంత హోరాహోరీగా సాగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే గెలుపు పక్కా అన్నట్లుగా నిన్న విడుదలైన మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ తేల్చేయటం తెలిసిందే. ఈ ఎన్నికల్లో సినీ నటుడు విజయ్ ప్రభావం పక్కాగా ఉంటుందని.. ఎన్నికల ఫలితాల్లో ఆయన కీలకభూమిక పోషిస్తారన్న అంచనాకు తగ్గట్లే.. జరగనున్నట్లుగా చెబుతున్నారు. అయితే.. ఫలితాలు విజయ్ కు కాకుండా అధికార డీఎంకేకు మరోసారి పవర్ ను కట్టబెట్టేలా చేయటంలో విజయ్ కీలకభూమిక పోషించనున్నారా? అన్నదిప్పుడు చర్చగా మారింది.
చరిత్రలోకి వెళితే.. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలో వైఎస్ భారీ మెజార్టీతో విజయం సాధించి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టటం తెలిసిందే. అయితే.. 2009 ఎన్నికల నాటికి వైఎస్ కు విజయం సాధ్యం కాదన్నట్లుగా ర్చ జరిగింది. దీనికి కారణం విపక్ష టీడీపీతో పాటు.. మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి రావటం.. ప్రజారాజ్యం పేరుతో సామాజిక మార్పు నినాదంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వటం తెలిసిందే.
దీంతో.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ దెబ్బకు నాటి కాంగ్రెస్ సర్కారుకు ఓటమి షాక్ తప్పదన్నట్లుగా కొందరు అంచనా వేశారు. కానీ.. ఎగ్జిట్ ఫలితాల్లో వైఎస్ మరోసారి అధికారాన్ని చేపడతారన్న అంచనాలు వెలువడ్డాయి. ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇంచుమించు అప్పట్లో చిరు పోషించిన పాత్రనే తమిళనాడులో స్టార్ హీరో విజయ్ పోషిస్తున్నట్లుగా ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి.
బీజేపీతో జత కట్టిన అన్నాడీఎంకేకు నిరాశ తప్పదని.. అదే సమయంలో కూటమిలో చేరేందుకు ససేమిరా అన్న విజయ్.. ప్రజారాజ్యం పార్టీతో చిరుకు ఎలాంటి ఫలితం ఎదురైందో.. అలాంటి పరిస్థితే విజయ్ కు తప్పదన్నఅంచనాలు వ్యక్తమయ్యాయి. ఈ వాదనలో నిజం ఉందన్నట్లుగా తాజాగా విడుదలైన ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. సినిమాల నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్.. తమిళనాడు ఎన్నికల్లో రెండంకెల సీట్లు రావొచ్చని... మూడో స్థానానికే పరిమితమవుతారన్న అంచనాలు వ్యక్తమయ్యాయి.
234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో ఏ పార్టీ అయినా అధికారాన్ని చేపట్టాలంటే వారికి 118 స్థానాల మేజిక్ ఫిగర్ ను సొంతం చేసుకోవాలి. బుధవారం సాయంత్రం విడుదలైన మెజార్టీ సర్వేలను చూస్తే.. డీఎంకే అధికారానికి వస్తున్నట్లుగా అంచనా వేశాయి. ఒక్క ఎన్డీటీవీ - యాక్సిస్ మై ఇండియా కలిసి నిర్వహించిన సర్వే మాత్రం విజయ్ పార్టీ (టీవీకే) అందరి కంటే ఎక్కువ స్థానాలు వస్తాయన్న అంచనాను వ్యక్తం చేసింది. మెజార్టీ సర్వే సంస్థలు మాత్రం డీఎంకే మరోసారి పవర్ చేతికి వస్తుందని.. అందుకు విజయ్ పార్టీ కారణంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి.. అంతిమంగా డీఎంకేకు మేలు జరిగినట్లుగా విశ్లేషిస్తున్నారు. ఈ వాదనలో నిజం ఎంత? అన్నది తేలాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయకతప్పదు.
