Begin typing your search above and press return to search.

మెజారిటీపై గవర్నర్ సందేహాలు.. విజయ్‌కు కీలక ప్రశ్నలు! ఏం జరుగనుంది?

తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు అంశం రోజురోజుకీ మరింత ఆసక్తికరంగా మారుతోంది.

By:  A.N.Kumar   |   7 May 2026 12:15 PM IST
మెజారిటీపై గవర్నర్ సందేహాలు.. విజయ్‌కు కీలక ప్రశ్నలు! ఏం జరుగనుంది?
X

తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు అంశం రోజురోజుకీ మరింత ఆసక్తికరంగా మారుతోంది. టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేసిన వేళ.. గవర్నర్ రాజేంద్రతో జరిగిన భేటీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ తనను కలిసిన సందర్భంగా గవర్నర్ పలు కీలక ప్రశ్నలు లేవనెత్తినట్లు సమాచారం. ముఖ్యంగా మెజారిటీ నిరూపణ, ప్రభుత్వ స్థిరత్వం, మద్దతు ఇచ్చే పార్టీల జాబితాపై ఆయన స్పష్టత కోరినట్లు తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం టీవీకేకు ప్రస్తుతం 108 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 118 మంది సభ్యుల మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో ‘113 మంది ఎమ్మెల్యేలతో మీరు మెజారిటీ ఎలా నిరూపించుకుంటారు? ఈ సంఖ్యతో స్థిరమైన ప్రభుత్వం ఎలా నడుస్తుంది?’ అని గవర్నర్ విజయ్‌ను ప్రశ్నించినట్లు చెబుతున్నారు. అలాగే మద్దతు ఇస్తున్న పార్టీల పేర్లు, స్వతంత్ర ఎమ్మెల్యేల వివరాలు, అప్డేటెడ్ సపోర్ట్ లిస్టును అధికారికంగా అందించాలని కూడా సూచించినట్లు సమాచారం.

ఇక ప్రభుత్వ ఏర్పాటులో ఎలాంటి రాజ్యాంగ సంక్షోభం తలెత్తకూడదన్న దానిపై గవర్నర్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మద్దతు లేఖలు, ఎమ్మెల్యేల సంతకాలు, కూటమి పార్టీల అంగీకార పత్రాలు అన్నీ సమర్పించిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు టీవీకే శిబిరం మాత్రం తాము అవసరమైన సంఖ్యను సమీకరిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. కొందరు స్వతంత్ర ఎమ్మెల్యేలు, చిన్న పార్టీల సభ్యులు తమకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని టీవీకే వర్గాలు చెబుతున్నాయి.

అయితే పరిస్థితి అంత సులభంగా కనిపించడం లేదు. కాంగ్రెస్ మద్దతు ప్రకటించినప్పటికీ కొన్ని షరతులు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు సీపీఐ , వీసీకే వంటి పార్టీలు కూడా విజయ్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నా.. అధికారికంగా ఎంతమంది ఎమ్మెల్యేలు మద్దతిస్తారన్నది ఇంకా స్పష్టంగా లేదు. ఇదే సమయంలో ప్రతిపక్షాలు మాత్రం ‘సంఖ్యాబలం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రయత్నించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు’ అంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి.

ఇక డీఎంకే అధినేత స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయ చర్చకు దారితీశాయి. “విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోనివ్వండి.. మేము ఆరు నెలలు గమనిస్తాం” అన్న వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దీనితో తమిళనాడులో కొత్త రాజకీయ సమీకరణాలు ఏర్పడుతున్నాయా అన్న చర్చ మొదలైంది.

మొత్తానికి ఇప్పుడు అందరి దృష్టి గవర్నర్ తదుపరి నిర్ణయంపైనే నిలిచింది. విజయ్ అవసరమైన మద్దతు జాబితాను సమర్పిస్తారా? లేక మెజారిటీ లెక్కల్లో ఇరుక్కుంటారా? అన్నది ఆసక్తిగా మారింది. తమిళనాడు రాజకీయాల్లో వచ్చే 48 గంటలు అత్యంత కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.