Begin typing your search above and press return to search.

టీవీకే విజయ్‌కి బిగ్ షాక్.. హ్యాండిచ్చిన ఒక పార్టీ.. ప్రమాణ స్వీకారంపై సందిగ్ధం!

ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశించిన తరుణంలో టీవీకే అధినేత విజయ్‌కు రాజకీయ సమీకరణాలు సవాలుగా మారాయి.

By:  A.N.Kumar   |   8 May 2026 10:34 PM IST
టీవీకే విజయ్‌కి బిగ్ షాక్.. హ్యాండిచ్చిన ఒక పార్టీ.. ప్రమాణ స్వీకారంపై సందిగ్ధం!
X

తమిళనాడు రాజకీయ యవనికపై అనూహ్య మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశించిన తరుణంలో టీవీకే అధినేత విజయ్‌కు రాజకీయ సమీకరణాలు సవాలుగా మారాయి. మ్యాజిక్ ఫిగర్‌కు అడుగు దూరంలో నిలిచిన వేళ మిత్రపక్షాల నుంచి ఎదురవుతున్న పరిణామాలు రాష్ట్రంలో తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి.

ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైందని భావిస్తున్న తరుణంలో విజయ్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. తొలుత టీవీకేకు మద్దతు ప్రకటించిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అనూహ్యంగా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఈ పరిణామంతో విజయ్ కూటమి సంఖ్యాబలం 116కు పడిపోయింది. తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118. ఇప్పుడు విజయ్ మరో ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు కోసం తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వీసీకే దోబూచులాట.. గవర్నర్ మౌనం

మరోవైపు టీవీకేకు మద్దతు ఇస్తామని బహిరంగంగా ప్రకటించిన వీసీకే నుంచి ఇంకా అధికారిక లేఖ గవర్నర్ కార్యాలయానికి చేరకపోవడం చర్చనీయాంశమైంది. మద్దతు లేఖ అందకపోవడంతో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ తదుపరి చర్యలపై వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు. విజయ్ ఇప్పటికే గవర్నర్‌ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కోరినప్పటికీ రాజ్‌భవన్ నుంచి అధికారిక ఆహ్వానం అందకపోవడానికి ఈ సాంకేతిక లోపాలే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రమాణ స్వీకారంపై అనిశ్చితి

ఈ రాజకీయ గందరగోళం మధ్యే టీవీకే మిత్రపక్షమైన సీపీఎం సంచలన ప్రకటన చేసింది. శనివారం ఉదయం 11 గంటలకు విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని సీపీఎం నేత కె. బాలకృష్ణన్ ప్రకటించారు. ఈ వేడుకకు కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ హాజరవుతారని సమాచారం. అయితే ప్రస్తుత సంఖ్యాబల సమీకరణాల దృష్ట్యా ఈ షెడ్యూల్ యథాతథంగా కొనసాగుతుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

వామపక్షాల కీలక నిర్ణయం

గవర్నర్‌తో భేటీ అనంతరం విజయ్ నేరుగా సీపీఐ, సీపీఎం కార్యాలయాలకు వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వామపక్షాలు తమ వైఖరిని స్పష్టం చేశాయి. టీవీకే ప్రభుత్వానికి బయటి నుంచే మద్దతు ఇస్తామని, మంత్రివర్గంలో చేరబోమని సీపీఎం నేత యు. వాసుకి స్పష్టం చేశారు. ప్రజా సమస్యలు, రాష్ట్రాల హక్కుల పరిరక్షణలో తమ వైఖరి స్వతంత్రంగా ఉంటుందని, కేవలం లౌకికవాదాన్ని కాపాడటానికే టీవీకేకు మద్దతు ఇస్తున్నామని వెల్లడించారు. అసెంబ్లీలో జరిగే విశ్వాస పరీక్షలో టీవీకేకు అనుకూలంగా ఓటు వేస్తామని హామీ ఇచ్చారు. "ప్రజలు టీవీకేను అతిపెద్ద పార్టీగా ఎన్నుకున్నారు. ఆ ప్రజా తీర్పును గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉంది." అని వామపక్ష నేతలు పేర్కొన్నారు.

విజయ్ తదుపరి అడుగు ఎటు?

ప్రస్తుతానికి విజయ్‌కు మరో ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు అనివార్యమైంది. స్వతంత్రులు లేదా చిన్న పార్టీల ఎమ్మెల్యేలతో టీవీకే చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. తమిళనాడు రాజకీయాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక కొత్త పార్టీ అధికారంలోకి రాబోతున్న తరుణంలో ఈ చిన్న చిన్న అడ్డంకులు విజయ్‌కు అగ్నిపరీక్షగా మారాయి.

రేపు ఉదయం లోపు వీసీకే నుంచి మద్దతు లేఖ అందడం.. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టడంపైనే విజయ్ ముఖ్యమంత్రి పీఠం భవిష్యత్తు ఆధారపడి ఉంది. శనివారం ఉదయం రాజ్‌భవన్ నుంచి వచ్చే ప్రకటన కోసం యావత్ తమిళనాడు ఆసక్తిగా ఎదురుచూస్తోంది.