Begin typing your search above and press return to search.

విజయ్ పార్టీ ఎన్నికల గుర్తు ఏంటంటే ?

ఆయన నటించిన చివరి సినిమా జననాయగన్ అయితే ఒక వైపు రిలీజ్ కాకుండా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

By:  Satya P   |   22 Jan 2026 6:00 AM IST
విజయ్ పార్టీ ఎన్నికల గుర్తు ఏంటంటే ?
X

తమిళనాడులో ఈసారి ఒక రాజకీయ సంచలనంగా సినీ నటుడు విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం టీవీకే నిలుస్తోంది. కొత్తగా వస్తున్న ఈ పార్టీ ఏ రకమైన ప్రభంజనం సృష్టిస్తుందో అన్నది అంతటా చర్చగా ఉంది. విజయ్ పార్టీతో తమిళనాడులో రాజకీయం కాస్తా ద్విముఖ పోటీ నుంచి త్రిముఖ పోటీగా మారుతోంది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇదే రకమైన పరిస్థితి కనిపించనుంది ఇక ఈ కీలక సమయంలో విజయ్ పార్టీ తన ఎన్నికల గుర్తు కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసింది.

ఆ మూడింటిలో ఒకటి :

మొత్తం తమిళనాడులోని 234 స్థానాలకు తమిళగ వెట్రి కళగం పార్టీ పోటీ చేస్తోంది. దాంతో అందరి అభ్యర్ధుల కోసం ఒక ఉమ్మడి గుర్తు కావాలని కేంద్ర ఎన్నికల సంఘానికి విజయ్ విన్నవించుకున్నారు. ఉమ్మడి గుర్తు అయితే తమ పార్టీకి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన అందులో చెప్పుకొచ్చారు. ఒల తమ పార్టీకి ఆటో, క్రికెట్ బ్యాట్, విజిల్ వంటి గుర్తులలో ఏదో ఒకటిని ఖాయం చేయాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది మేలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఎన్నికల గుర్తు అన్నది చాలా కీలకమని విజయ్ పార్టీ భావిస్తోంది. గుర్తు కనుక కేటాయిస్తే ఇప్పటి నుంచే దానిని జనంలో ఉంచి ప్రచారం చేసుకోవాలని చూస్తోంది.

ఎక్కడా తగ్గకుండా :

ఇక తమిళగ వెట్రి కళగం అధినేత హోదాలో విజయ్ ఎన్నో పెను సవాళ్ళను ఎదుర్కొంటున్నారు. ఆయన నటించిన చివరి సినిమా జననాయగన్ అయితే ఒక వైపు రిలీజ్ కాకుండా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. మరో వైపు గత ఏడాదిలో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి సీబీఐ విజయ్ ని విచారిస్తోంది. అయినా కూడా ఎక్కడా తగ్గేది లేదని విజయ్ స్పష్టం చేస్తూ ముందుకు సాగుతున్నారు. తనదైన ఎన్నికల పధక రచనలో ఆయన పూర్తిగా నిమగ్నం అయి ఉన్నారని అంటున్నారు.

ఉమ్మడి గుర్తు దక్కుతుందా :

సాధారణంగా గుర్తింపు లేని పార్టీలకు కామన్ సింబల్ కేటాయించడం అన్నది ఈసీ నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది. 2019 ఎన్నికల వేళ ఏపీలో జనసేనకు గాజు గ్లాస్ గుర్తు విషయంలో అయితే కామన్ సింబల్ ఆ పార్టీ పోటీ చేసిన చోట మాత్రమే ఇచ్చారు. మిగిలిన చోట్ల వేరే ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఇచ్చారు. అయితే 2024 తరువాత గాజు గ్లాస్ ని పర్మనెంట్ గా ఇచ్చేశారు. విజయ్ పార్టీ విషయం తీసుకుంటే మొత్తంగా అన్ని స్థానాలకు పోటీ చేస్తోంది. దాంతో కామన్ గుర్తు అన్నది చాలా అవసరం. మరి ఈసీ ఏ విధంగా డెసిషన్ తీసుకుంటుందో చూడాలని అంటున్నారు. గుర్తు కోసం ఎన్నికల సంఘం అడిగిన వివరాలు అన్నీ కూడా విజయ్ పార్టీ సమర్పించింది. దాంతో తమకు తప్పకుండా కామన్ సింబల్ దక్కుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు.

పొత్తుల విషయంలో క్లారిటీ :

ఇక వచ్చే ఎన్నికల్లో విజయ్ పార్టీ ఒంటరి పోరుకే సిద్ధపడుతోంది. అటు బీజేపీతో కానీ ఇటు డీఎంకేతో కానీ పొత్తులు ఉండవని ఆ పార్టీ స్పష్టం చేస్తోంది. దాంతో తమిళనాడులో ఈసారి డీఎంకే కూటమి అలాగే ఏఐడీఎంకే బీజేపీ కూటమి టీవీకే మధ్య పోటీ తీవ్ర స్థాయిలో జరగనుంది. అయితే నాం తమిళ్ కట్చి అన్న పార్టీ పోటీలో ఉంది. దాంతో కొన్ని చోట్ల చతుర్ముఖ పోటీలు కూడా ఉండబోతున్నాయని అంటున్నారు. మరి ఇంతటి పోటీలో అధికార పక్షం ఓట్లు చీలి డీఎంకేకి కలసి వస్తుందా లేదా విజయ్ పార్టీ పోరులో ఉంటే అది అన్నా డీఎంకే బీజేపీ కూటమికి కలసి వస్తుందా లేక కొత్త పార్టీగా విజయ్ కే జనాలు పట్టం కడుతారా అన్నది వేచి చూడాల్సి ఉంది.