Begin typing your search above and press return to search.

ఎన్నికల సమరానికి ముందే 'దళపతి'కి షాక్

తమిళ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తూ అడుగుపెట్టిన 'దళపతి' విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.

By:  A.N.Kumar   |   8 April 2026 8:00 PM IST
ఎన్నికల సమరానికి ముందే దళపతికి షాక్
X

తమిళ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తూ అడుగుపెట్టిన 'దళపతి' విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల రణక్షేత్రంలోకి దిగకముందే ఆ పార్టీ ఒక కీలక నియోజకవర్గాన్ని కోల్పోవాల్సి రావడం ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఎన్నికల నిర్వహణలో అనుభవం లేకపోవడం.. సాంకేతిక అంశాలపై పట్టు లేకపోవడం పార్టీకి శాపంగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఎడప్పాడి నియోజకవర్గంలో అసలేం జరిగింది?

తమిళనాడు రాజకీయాల్లో కీలకమైన ఎడప్పాడి నియోజకవర్గంపై టీవీకే ఆశలు పెట్టుకుంది. అయితే ఇక్కడ పార్టీ తరపున బరిలోకి దిగిన ఇద్దరు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురికావడంతో విజయ్ పార్టీకి పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. పార్టీ మొదట అరుణ్‌కుమార్ అనే వ్యక్తిని తన అధికారిక అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన నామినేషన్ పత్రాలను సమర్పించినప్పటికీ ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఉండాల్సిన ప్రతిపాదకుల సంతకాలు సరిపడా లేవని అధికారులు గుర్తించారు. రిజిస్టర్డ్ కానీ పార్టీలు లేదా స్వతంత్ర అభ్యర్థుల విషయంలో ఉండాల్సిన కనీస మద్దతు సంతకాల నిబంధనను పాటించకపోవడంతో అరుణ్‌కుమార్ నామినేషన్ వీగిపోయింది. అరుణ్‌కుమార్ నామినేషన్ తిరస్కరణకు గురవుతుందని ఊహించిన పార్టీ వెంటనే నిత్య అనే మహిళను ప్రత్యామ్నాయ అభ్యర్థిగా రంగంలోకి దించింది. దురదృష్టవశాత్తూ ఆమె సమర్పించిన పత్రాల్లో కూడా అదే సాంకేతిక లోపం తలెత్తింది. సరిపడా మద్దతు సంతకాలు లేకపోవడంతో ఎన్నికల అధికారులు ఆమె నామినేషన్‌ను కూడా తిరస్కరించారు.

గడువు ముగియడంతో చేతులు కాలిన పరిస్థితి

ఎన్నికల నిబంధనల ప్రకారం ఏప్రిల్ 6తో నామినేషన్ల గడువు ముగిసింది. అభ్యర్థుల పత్రాల స్క్రూటినీ ప్రక్రియలో ఈ లోపాలు బయటపడే సమయానికి కొత్తగా నామినేషన్ వేసే సమయం మించిపోయింది. దీనివల్ల ఎడప్పాడి స్థానంలో టీవీకే జెండా పాతే అవకాశం లేకుండా పోయింది. ఒక ప్రధాన నియోజకవర్గంలో పోటీకి అభ్యర్థి లేకుండా పోవడం పార్టీ క్యాడర్‌లో తీవ్ర నిరాశను నింపింది.

టీవీకే వ్యూహరచనలో లోపాలు?

విజయ్ వంటి స్టార్ ఇమేజ్ ఉన్న నాయకుడు పార్టీ పెట్టినప్పుడు గ్రౌండ్ లెవల్‌లో పని చేసే యంత్రాంగం పటిష్టంగా ఉండాలి. కానీ ఈ ఘటనతో పార్టీలో సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. నామినేషన్ పత్రాల సమర్పణ అనేది అత్యంత కీలకమైన ఘట్టం. అక్కడ కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం పార్టీ అంతర్గత క్రమశిక్షణను ప్రశ్నిస్తోంది. అభ్యర్థులు పత్రాలు దాఖలు చేసే ముందు పార్టీ లీగల్ సెల్ వాటిని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఇద్దరు అభ్యర్థులు ఒకే రకమైన తప్పు చేయడం గమనార్హం.

భవిష్యత్తుపై ప్రభావం

ఎన్నికలకు ముందే ఒక సీటును కోల్పోవడం అనేది ప్రత్యర్థి పార్టీలకు అస్త్రంగా మారింది. విజయ్ పార్టీకి ఇంకా క్షేత్రస్థాయిలో పట్టు లేదని, కేవలం సినీ గ్లామర్‌తోనే గెలవలేరని విమర్శలు మొదలయ్యాయి. ఈ పరిణామం ఇతర నియోజకవర్గాల్లోని అభ్యర్థుల మనోధైర్యంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.

విజయ్ తన రాజకీయ ప్రస్థానాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఈ "ఎడప్పాడి షాక్" నుండి పాఠాలు నేర్చుకుని మిగిలిన నియోజకవర్గాల్లో పార్టీని ఎలా ముందుకు నడిపిస్తారో చూడాలి. ఎన్నికల ముందే తగిలిన ఈ దెబ్బను టీవీకే ఎలా అధిగమిస్తుందన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.