Begin typing your search above and press return to search.

దళపతికి డేంజర్ సిగ్నల్స్.. ప్రభుత్వం నడపడం అంతా ఈజీ కాదా!

కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ పార్టీతో స్వల్ప విభేదాలు తలెత్తగా, ప్రస్తుతం సీపీఐ నేతలు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకేపై కారాలు మిరియాలు నూరుతున్నట్లు చెబుతున్నారు.

By:  Tupaki Political Desk   |   2 Oct 2026 3:09 PM IST
దళపతికి డేంజర్ సిగ్నల్స్.. ప్రభుత్వం నడపడం అంతా ఈజీ కాదా!
X

తమిళనాడులో ముఖ్యమంత్రి దళపతి విజయ్ ప్రభుత్వానికి ఈ నెల 6న జరగనున్న ఉప ఎన్నికలు తొలి సవాల్ విసురుతున్నాయి. అన్నా డీఎంకే ఎమ్మెల్యేల రాజీనామాతో మధురాంతకం, ధరాపురం నియోజకవర్గాలకు మరో నాలుగు రోజుల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో టీవీకే నేతలు భారీగా ఓట్లు కొనుగోలు చేస్తున్నారని మిత్రపక్షమైన సీపీఐ నుంచి ఆరోపణలు రావడం తీవ్ర దుమారం రేపుతోంది. దీంతో ఇప్పటికే దినదిన గండంగా ప్రభుత్వాన్ని నడుపుతున్న ముఖ్యమంత్రి విజయ్ కి ఉప ఎన్నికల తర్వాత కూడా టెన్షన్ తగ్గే పరిస్థితి కనిపించడం లేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలు గెలుచుకుని టీవీకే అధినేత, సినీ నటుడు దళపతి విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వాన్ని నడపాల్సిన కనీస మెజార్టీ 118 స్థానాలు లేకపోవడంతో కాంగ్రెస్, వీసీకేతోపాటు కమ్యూనిస్టు పార్టీల మద్దతుతో విజయ్ ప్రభుత్వాన్ని నడపాల్సివస్తోందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఏ క్షణంలోనైనా విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని ప్రతిపక్షాలు హెచ్చరిస్తున్నాయి. విజయ్ కి ఆరు నెలల సమయం ఇస్తామని, అంతవరకు వేచిచూస్తామని డీఎంకే అధినేత స్టాలిన్ ఇప్పటికే స్పష్టం చేశారు. స్టాలిన్ ఇచ్చిన గడువు సమయం సమీపిస్తుండగా, ముఖ్యమంత్రి విజయ్ ఇంకా రాజకీయంగా కుదరుకోలేని పరిస్థితులు కనిపిస్తున్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రస్తుతం మిత్రపక్షాల మద్దతుతో పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి విజయ్ సొంతంగా బలం పెంచుకోవాలని వ్యూహాలు రచిస్తున్నా, ప్రతిపక్షాల ఐక్యతతో ఆ ఎత్తులు పనిచేయడం లేదని అంటున్నారు. ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలంటే 118 స్థానాలు ఉండాల్సివుండగా, ప్రస్తుతం టీవీకే పార్టీకి 107 ఉన్నాయి. ఇంకా 11 మందిని ఇతర పార్టీల నుంచి రాజీనామా చేయించి గెలిపించుకోవాలని టీవీకే నేతలు భావిస్తున్నారని పరిశీలకులు చెబుతున్నారు. ఇందులో భాగంగా అన్నాడీఎంకే నుంచి ఇద్దరితో రాజీనామా చేయించారు. ఆ స్థానాలకే మరో నాలుగు రోజుల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు స్థానాలు గెలిచినా మరో 9 స్థానాలు అవసరం అవుతాయి. అయితే ప్రస్తుతం సహకరిస్తున్న మిత్రపక్షాలు తరచూ ప్రభుత్వాన్ని బెదిరించేలా మాట్లాడుతుండటమే విజయ్ సర్కార్ కు దినదిన గండంగా మారిందని అంటున్నారు.

కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ పార్టీతో స్వల్ప విభేదాలు తలెత్తగా, ప్రస్తుతం సీపీఐ నేతలు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకేపై కారాలు మిరియాలు నూరుతున్నట్లు చెబుతున్నారు. ప్రధానంగా మధురాంతకం ఉప ఎన్నికల్లో టీవీకే భారీగా డబ్బు ఖర్చు చేస్తోందని, దీంతో ఓటర్లు తమకు కూడా డబ్బులు అడుగుతున్నారని సీపీఐ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేయమని అధికారంలోకి వచ్చిన టీవీకే ఇప్పుడు ఇలా మాట మార్చడమే కాకుండా, అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని సీపీఐ నేతలు ధ్వజమెత్తుతున్నారు. మిత్రపక్షమైన సీపీఐ ఈ స్థాయిలో విమర్శలు చేస్తుంటే, టీవీకే నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని చెబుతున్నారు. ఇక సీపీఐ మరింత తీవ్రంగా ఆలోచిస్తే విజయ్ ప్రభుత్వానికి ప్రమాద ఘంటికలు మోగినట్లేనని అంటున్నారు. మొత్తానికి మిత్రపక్షాలతో సమన్వయం చేసుకోవడంలో ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వం విఫలమవుతోందని అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితులు చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు.