రాజకీయ కోణంలో విజయ్-త్రిష.. పుట్టినరోజు సెంటిమెంట్ వెనుక అసలు కథ ఏమిటి?
ముఖ్యంగా విజయ్ రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) స్థాపించిన తర్వాత ఆయన ప్రతి కదలికపై రాజకీయ శత్రువులు, అభిమానులు నిశితంగా దృష్టి సారిస్తున్నారు.
By: A.N.Kumar | 19 March 2026 11:50 PM ISTతమిళ సినీ, రాజకీయ యవనికపై ప్రస్తుతం నటుడు విజయ్, నటి త్రిష కృష్ణన్ మధ్య ఉన్న అనుబంధం గురించిన వార్తలు దావానంలా వ్యాపిస్తున్నాయి. కేవలం సినీ వార్తలుగా మాత్రమే కాకుండా ఇవి రాజకీయ రంగు పులుముకోవడంతో ఈ అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
పుకార్లకు అదే కారణం..
విజయ్, త్రిషల జోడీ వెండితెరపై ఎంతటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం ఉందనే ప్రచారం పాతదే అయినప్పటికీ, ఇటీవల ఓ వివాహ వేడుకలో వీరిద్దరూ ఒకే రకమైన రంగు దుస్తుల్లో కనిపించడం ఈ పుకార్లకు కొత్త ఊపిరి పోసింది. ముఖ్యంగా విజయ్ రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) స్థాపించిన తర్వాత ఆయన ప్రతి కదలికపై రాజకీయ శత్రువులు, అభిమానులు నిశితంగా దృష్టి సారిస్తున్నారు.
రాజకీయ కోణం: ఎన్నికలు.. సెంటిమెంట్
ఈ వివాదంలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తేదీ (మే 4) , త్రిష పుట్టినరోజు ఒకే రోజున రావడం. ఈ యాదృచ్ఛికాన్ని నెటిజన్లు రకరకాలుగా అన్వయిస్తున్నారు. ప్రత్యర్థి వర్గాలు దీనిని ఒక బలహీనతగా చూపిస్తూ సెటైర్లు వేస్తుండగా ఇది విజయ్ రాజకీయ ఇమేజ్‌ను దెబ్బతీసే కుట్రగా ఆయన అభిమానులు భావిస్తున్నారు. తమిళ రాజకీయాల్లో వ్యక్తిగత జీవితం, నైతికతకు ఓటర్లు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఎన్నికలకు ముందు ఇలాంటి ప్రచారం విజయ్ ఓటు బ్యాంకుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
మద్దతు.. వ్యతిరేకత
ఈ అంశంపై నటి ఖుష్బూ సుందర్ స్పందించిన తీరు చర్చనీయాంశమైంది. ఆమె త్రిషకు మద్దతుగా నిలుస్తూ వ్యక్తిగత విమర్శలను తప్పుబట్టారు. ఒక మహిళగా, రాజకీయ నాయకురాలిగా ఆమె చేసిన వ్యాఖ్యలు నిరాధారమైన ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నంగా కనిపిస్తున్నాయి. అయితే సోషల్ మీడియా యుగంలో నిజానిజాలతో సంబంధం లేకుండా ఒక వార్త ఎంత వేగంగా ప్రజల్లోకి వెళ్తుందో ఈ ఘటన నిరూపిస్తోంది.
ఇది వ్యూహమా? లేక కేవలం కాకతాళీయమా?
తమిళనాడు రాజకీయ చరిత్రను పరిశీలిస్తే సినీ గ్లామర్‌ను రాజకీయంగా దెబ్బతీయడం కొత్తేమీ కాదు. విజయ్ తన రాజకీయ ప్రస్థానాన్ని వేగవంతం చేస్తున్న తరుణంలో, ఇలాంటి రూమర్లు ఆయనను ఆత్మరక్షణలో పడేసే అవకాశం ఉంది. అయితే, ఇప్పటివరకు అటు విజయ్ గానీ, ఇటు త్రిష గానీ ఈ విషయంపై మౌనంగా ఉండటం గమనార్హం.
