వై ప్లస్ భద్రత విఫలమయిందా.. విజయ్ ఇంట్లోకి ఆగంతకుడు!
విషయంలోకి వెళ్తే.. తమిళ నటుడు విజయ్ ఇంటి టెర్రస్ పైకి తాజాగా ఓ ఆగంతకుడు వచ్చినట్టు తెలుస్తోంది.
By: Madhu Reddy | 19 Sept 2025 1:58 PM ISTతమిళ నటుడు విజయ్ దళపతి ఈ మధ్యనే "తమిళ వెట్రి కళగం" అనే పార్టీతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. వచ్చే ఏడాది తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం మొదలు పెట్టి, తమిళ వెట్రి కళగం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని కృషి చేస్తున్నారు. ఇలాంటి సమయంలో తాజాగా విజయ్ దళపతి ఇంట్లోకి ఓ ఆగంతకుడు ప్రవేశించడం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి ఇంతకీ విజయ్ ఇంట్లోకి చొరబడ్డ ఆ వ్యక్తి ఎవరు..? అంతా కట్టుదిట్టమైన వై ప్లస్ కేటగిరి భద్రత ఉన్నా కూడా ఆ వ్యక్తి ఇంటిలోకి ఎలా వచ్చారు? వై ప్లస్ భద్రత విఫలం అయ్యిందా? అనే ప్రశ్నలు అభిమానులలో తలెత్తుతున్నాయి.
విషయంలోకి వెళ్తే.. తమిళ నటుడు విజయ్ ఇంటి టెర్రస్ పైకి తాజాగా ఓ ఆగంతకుడు వచ్చినట్టు తెలుస్తోంది. నీలంకరైలోని విజయ్ నివాసంలోకి ఒక గుర్తుతెలియని వ్యక్తి చొరబడ్డాడు. అయితే ఆ ఆగంతకుడు టెర్రస్ పై అటు ఇటూ తిరుగుతూ ఉండగా విజయ్ దగ్గర పనిచేసే సిబ్బంది ఆగంతకుడిని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ఆ ఆగంతకుడిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది.. విజయ్ ఇంట్లోకి చొరబడాలని చూసిన ఆ వ్యక్తికి మతిస్థిమితం లేదని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిందట. 24 ఏళ్ల వయసున్న అరుణ్ అనే వ్యక్తికి గత నాలుగు సంవత్సరాల నుండి మతిస్థిమితం లేదని పోలీసులు ప్రాథమికంగా తేల్చేశారు. అయితే మతిస్థిమితం బాగా లేకపోవడంతో ఆయన్ని ట్రీట్మెంట్ కోసం గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు పోలీసులు.
ఈ విషయం కాస్త తమిళ మీడియాలో వైరల్ గా మారడంతో చాలామంది రాజకీయ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే విజయ్ కి Y+ భద్రతని కల్పించారు. ఇక ఈ వై ప్లస్ భద్రత లో మొత్తం 11 మంది సిబ్బంది ఉంటారు. వై ప్లస్ భద్రత అంటే నాలుగో అత్యున్నత స్థాయి.. ఈ 11 మంది సిబ్బంది షిఫ్ట్ ల వారిగా పని చేస్తారు. ఇందులో ఇద్దరి నుండి నలుగురు కమాండోలు ఉండగా.. మిగిలిన వారిలో పోలీస్ సిబ్బంది ఉంటుంది. అయితే అంత కట్టుదిట్టమైన భద్రత విజయ్ కి ఉన్నప్పటికీ ఇంట్లోకి గుర్తుతెలియని ఆగంతకుడు ఎలా చొరబడ్డాడు అనే అనుమానాలు తమిళనాడు రాజకీయాల్లో తలెత్తుతున్నాయి.
అంత భద్రతను దాటుకొని సీసీ కెమెరాలు దాటుకొని ఆగంతకుడు టెర్రస్ పైకి ఎలా ప్రవేశించాడు అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక విజయ్ ఇంట్లోకి అగంతకుడు చొరబడ్డాడు అనే విషయం తెలియడంతోనే చెన్నైలో ఉన్న చాలా మంది రాజకీయ నాయకులు భయపడుతున్నారు. అయితే ఇప్పటివరకు విజయ్ ఇంట్లోకి చొరబడ్డ వ్యక్తికి సంబంధించిన వార్తలు పార్టీ నుండి అధికారికంగా ఏమి ప్రకటించకపోయినప్పటికీ తమిళనాడు మీడియాలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.మరి ఆ ఆగంతకుడు ఎవరు? మతిస్థిమితం లేకుండానే అక్కడికి వచ్చారా.. అంత మంది భద్రతను దాటుకొని ఆయన లోపలికి ఎలా వచ్చారు అనేది తెలియాల్సి ఉంది.
