Begin typing your search above and press return to search.

డిజిటల్ ప్రపంచంలోనూ 'దళపతి' ప్రభంజనం.. 48 గంటల్లోనే 10 లక్షల మంది కొత్త ఫాలోవర్స్!

తమిళనాడు సీఎంఓ ఇన్‌స్టా పేజీ గతంలో ఎన్నడూ చూడని రీతిలో ఫాలోవర్లను సంపాదించుకుంది. గతంలో ఈ పేజీకి కేవలం 4.4 లక్షల (4.4 L) మంది ఫాలోవర్లు మాత్రమే ఉండేవారు.

By:  Tupaki Political Desk   |   12 May 2026 1:42 PM IST
డిజిటల్ ప్రపంచంలోనూ దళపతి ప్రభంజనం.. 48 గంటల్లోనే 10 లక్షల మంది కొత్త ఫాలోవర్స్!
X

సోషల్ మీడియా అంతగా లేని జమానాలో ఒక నాయకుడికి ఫాలోవర్స్ అంటే కాన్వాయ్.. నాయకుడు ఇంటి ముందు జనం.. ఇలా ఉండేవారు. కానీ సోషల్ మీడియా విస్తరించిన తర్వాత సీన్ మారింది. నాయకుడికి ఆదరణ అంటే అది ఫాలోవర్స్ పెరగడం.. అదే నాయకుడికి ఆదరణ తగ్గింది అంటే ఫాలోవర్స్ తగ్గడం.. ఒక్కొక్కసారి దీన్ని కూడా కొలమానంగా తీసుకోలేం. నాయకుడు తీసుకునే నిర్ణయాలపై అభిమానులు, నెటిజన్లు క్షణాల్లో వారి తీర్పును మార్చుకుంటారు. ఇటీవలి కాలంలో రాఘవ్ చడ్ఢా విషయంలో ఇదే జరిగింది. రాఘవ్ చడ్ఢా ఆప్ లో కీలక నాయకుడిగా ఉన్నారు. ఆయనకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోవర్స్ ఉండేవారు. ఆయన బీజేపీలో చేరడంతో ఒక్క రోజులోనే ఫాలోవర్స్ తగ్గారు. అదే విధంగా ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి అయిన విజయ్ కి 48 గంటల్లోనే 10 లక్షలకు పైగా ఫాలోవర్స్ పెరిగారు.

ఒక సినిమా స్టార్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆ క్రేజ్ ఏ స్థాయిలో ఉంటుందో అనడానికి ఈ సోషల్ మీడియా గణాంకాలు ఒక నిదర్శనం. గతంలో ద్రవిడ రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన దిగ్గజాల వారసులను కూడా పక్కన పెట్టి, కేవలం 48 గంటల్లోనే 10 లక్షల మంది కొత్త ఫాలోవర్లను సంపాదించుకోవడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ డైలీ అప్‌డేట్స్ తెలుసుకోవడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఎంతగా వేచి చూస్తున్నారో ఈ డిజిటల్ జోష్ చూస్తుంటే అర్థమవుతోంది.

తమిళనాడు 13వ ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి, ప్రభుత్వ అధికారిక సోషల్ మీడియా ఖాతాలకు విపరీతమైన ఆదరణ పెరిగింది. అభిమానులు కేవలం విజయ్ వ్యక్తిగత ఖాతాలనే కాకుండా, ప్రభుత్వ నిర్ణయాలు తెలుసుకోవడానికి సీఎంఓ (సీఎంవో) పేజీలను కూడా పెద్ద ఎత్తున ఫాలో చేస్తున్నారు.

ఇన్‌స్టాలో అనూహ్య వృద్ధి

తమిళనాడు సీఎంఓ ఇన్‌స్టా పేజీ గతంలో ఎన్నడూ చూడని రీతిలో ఫాలోవర్లను సంపాదించుకుంది. గతంలో ఈ పేజీకి కేవలం 4.4 లక్షల (4.4 L) మంది ఫాలోవర్లు మాత్రమే ఉండేవారు. 48 గంటల మ్యాజిక్ జరిగింది. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లోనే ఈ సంఖ్య 1.4 మిలియన్లకు (14 లక్షలు) చేరుకుంది. కేవలం రెండు రోజుల్లోనే సుమారు 10 లక్షల మంది రికార్డ్ స్థాయిలో కొత్త ఫాలోవర్స్ ఈ పేజీని ఫాలో అవ్వడం విశేషం.

'X'లో దూకుడు

ప్రభుత్వ అధికారిక ప్రకటనలకు వేదికైన 'X (ఎక్స్)' లో కూడా అదే జోరు కనిపించింది. ఈ ప్లాట్ ఫారంపై కూడా దాదాపు పది లక్షల మంది కొత్త ఫాలోవర్లు యాడ్ కావడంతో, సీఎంఓ పేజీ ఫాలోవర్ల సంఖ్య 2 మిలియన్లను (20 లక్షలు) దాటింది. జగదీష్ పళనిస్వామి నేతృత్వంలోని 'ది రూట్' సంస్థ ఐదేళ్లుగా నిర్మించిన డిజిటల్ సామ్రాజ్యం ఇప్పుడు ప్రభుత్వ పేజీల బలోపేతానికి ఎంతో ఉపయోగపడింది.

ఈ క్రేజ్‌కు ప్రధాన కారణాలు..

సోషల్ మీడియాలో విజయ్ ఇలాంటి సంచలనాలు సృష్టించడానికి కొన్ని కీలక అంశాలు దోహదపడుతున్నాయి. సీఎం హోదాలో విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలు (ఉదాహరణకు 717 మద్యం షాపుల మూసివేత) ప్రజలకు వెంటనే చేరుతుండటం. కోట్లాది రూపాయల పారితోషికాన్ని వదిలి, రూ. 2 లక్షల వేతనంతో ముఖ్యమంత్రిగా పని చేస్తున్న ఆయన పట్ల ప్రజల్లో ఏర్పడిన సానుకూలత. దళపతిగా సినీ తెరపై అలరించిన విజయ్, ఇప్పుడు నిజ జీవితంలోనూ తనదైన ముద్ర వేస్తుండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

ఒక నాయకుడికి ప్రజల్లో ఉన్న ఆదరణను కొలవడానికి నేటి రోజుల్లో సోషల్ మీడియా ఒక కొలమానంగా మారింది. విజయ్ ముఖ్యమంత్రి అయిన రెండు రోజుల్లోనే ఈ స్థాయిలో డిజిటల్ సపోర్ట్ లభించడం ఆయన భవిష్యత్తు రాజకీయ ప్రయాణానికి గొప్ప శుభపరిణామం.