కామరాజ్ టు విజయ్.. తమిళ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ!
తమిళనాడు ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ సాధించిన విజయం అనేక చర్చలకు తెరలేపుతోంది.
By: Tupaki Political Desk | 29 May 2026 9:00 PM ISTతమిళనాడు ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ సాధించిన విజయం అనేక చర్చలకు తెరలేపుతోంది. సంప్రదాయ పార్టీలను మట్టి కరిపించి విజయ్ సంచలనం విజయం సాధించారు. దీనిపై రకరకాల విశ్లేషణలు వ్యక్తం అవుతుండగా, హీరో సూర్య తండ్రి సీనియర్ నటుడు శివకుమార్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ’ప్రజల తీర్పు ఎప్పుడూ ఒకేలా ఉండదు, దానికి నిదర్శనమే కామరాజ్ ఓటమే’ అంటూ శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 1954లో తొలిసారిగా సీఎం అయిన కామరాజ్ సుమారు 9 ఏళ్ల 172 రోజుల పాటు ఆ పదవిలో కొనసాగారు. ఈ కాలంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు తమిళనాడు దశ, దిశను సమూలంగా మార్చేశాయి. దీంతో తరాలు మారుతున్నా తమిళనాట కామరాజ్ ను గుర్తుకు తెచ్చుకుంటూనే ఉంటారు.
ఈ నేపథ్యంలో విజయ్ గెలుపుపై శివకుమార్ స్పందన మరోసారి కామరాజ్ రూలింగును స్మరించుకునేలా చేసిందని అంటున్నారు. తమిళనాడు రాజకీయ చరిత్రను కామరాజ్ పాలనకు ముందు, ఆ తర్వాత అని విభజించి చూస్తారని చరిత్రకారులు చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సంస్కరణలు, ముఖ్యంగా 'మధ్యాహ్న భోజన పథకం'తో విద్యా విప్లవం తీసుకువచ్చి రాష్ట్ర భవిష్యత్తును మార్చేశారని ప్రశంసిస్తుంటారు. అయితే ఆయన గొప్పదనం పాలనలో మాత్రమే కాదని, ఆయన జీవించిన విధానంలో కూడా ఉందని కామరాజ్ మరణాంతరం వెల్లడైంది. తమిళనాడుతోపాటు దేశ రాజకీయాల్లో 'కింగ్ మేకర్'గా చక్రం తిప్పిన కామరాజ్ మరణించినప్పుడు, ఆయన పడుకునే దిండు కింద కేవలం రూ. 140 మాత్రమే లభ్యమైంది. కొన్ని ఖాదీ షర్టులు, పంచెలు తప్ప ఆయన సొంత ఆస్తి అంటూ ఏమీ కూడబెట్టు కోలేదని చెబుతారు. అధికారం ఉంటే కోట్లు సంపాదించుకోవచ్చనే నేటి రోజుల్లో, కామరాజ్ జీవితం ఒక నమ్మలేని నిజంగా కీర్తిస్తుంటారు.
ప్రస్తుతం విజయ్ ఇమేజ్‌ను కామరాజ్ వంటి మహానేతలతో పోల్చడంపై తమిళనాడులోని ప్రముఖ చానళ్లు, పొలిటికల్ అనలిస్టుల మధ్య ఆసక్తికరమైన విశ్లేషణలు సాగుతున్నాయి. కామరాజ్ ప్రజల మధ్యే ఉంటూ, కింది స్థాయి నుండి ఎదిగిన నాయకుడు అయితే విజయ్ తన అపారమైన సినీ గ్లామర్, యూత్ ఫాలోయింగ్ ఆధారంగా రాజకీయాల్లోకి వచ్చారు. కాబట్టి వీరిద్దరి శైలికి అస్సలు పోలిక లేదనేది ఒక వర్గం వాదన. అంతేకాకుండా లీడింగ్ పార్టీలపై ఉన్న సహజమైన వ్యతిరేకత, ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న యువత ఓట్లు విజయ్‌ను గెలిపించాయని విశ్లేషిస్తున్నారు. ఇదే సమయంలో కామరాజ్ లాంటి నిస్వార్థపరుడిని పక్కన పెట్టి ద్రావిడ సిద్ధాంతాలకు పట్టం కట్టిన తమిళ ప్రజలు, నేడు మళ్లీ మార్పు కోసం సాంప్రదాయ ద్రావిడ పార్టీలను కాదని విజయ్ వైపు మొగ్గు చూపడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. అంతేకాకుండా ఈ ఎన్నికల్లో భారీగా డబ్బు ఖర్చు చేసినా కూడా ప్రజలు మార్పు వైపే నిలబడ్డారని, ఇది తమిళనాడు ఓటర్ల విలక్షణతకు నిదర్శనమని పొలిటికల్ ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు.
కామరాజ్ ఓటమి పాఠం.. విజయ్ కి సవాల్
నిష్కళంక చరిత్ర ఉన్న కామరాజ్‌నే 1967 ఎన్నికల్లో తమిళ ప్రజలు ఓడించారు. అప్పట్లో ద్రావిడ సిద్ధాంతాల ఉధృతి ముందు కామరాజ్ చేసిన మంచి పనులు కూడా కొట్టుకుపోయాయి. ప్రజాదరణ అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదని చెప్పడానికి కామరాజ్ ఓటమే అతిపెద్ద ఉదాహరణగా చెబుతుంటారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా విజయ్ గెలవడాన్ని స్వాగతిస్తూనే ఆయన భవిష్యత్తులో కామరాజ్ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని జాగ్రత్తగా వ్యవహరించాల్సివుందని శివకుమార్ వంటి వారు హెచ్చరిస్తున్నారు. దళపతి సాధించిన విజయం కేవలం ఒక ఆరంభం మాత్రమేనని, గ్లామర్ తోపాటు మార్పు అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన విజయ్, రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలను ఎలా పరిష్కరిస్తారు? కామరాజ్ ఆశయాలైన పారదర్శకత, నిస్వార్థ సేవను ఎంతవరకు ఆచరణలో చూపిస్తారు? అనే దానిపైనే ఆయన రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని అంటున్నారు.
