‘వెట్రి తమిళగం’ బ్లూప్రింట్.. వేగవంతమైన నిర్ణయాలు : విజయ్ 50 రోజుల పాలనలో హైలైట్స్ ఇవే..
తమిళనాడు ముఖ్యమంత్రిగా దళపతి సి.జోసెఫ్ విజయ్ బాధ్యతలు చేపట్టి 50 రోజులు పూర్తయింది.
By: Tupaki Political Desk | 23 Jun 2026 1:06 PM ISTతమిళనాడు ముఖ్యమంత్రిగా దళపతి సి.జోసెఫ్ విజయ్ బాధ్యతలు చేపట్టి 50 రోజులు పూర్తయింది. నట జీవితం వదులుకుని రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ తొలి ప్రయత్నంలో సూపర్ సక్సెస్ అయ్యారు. అనూహ్య రీతిలో రాజకీయ దిగ్గజాలను ఓడించి రాష్ట్రంలో చెరగని ముద్ర వేశారు. ముఖ్యమంత్రిగా దళపతి అసాధారణ ప్రస్థానంపై జాతీయ స్థాయిలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అగ్రశ్రేణి కథానాయకుడిగా లక్షలాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న విజయ్, ఇప్పుడు పరిపాలనా దక్షుడిగా తనను తాను నిరూపించుకునే క్రమంలో ఉన్నారు. ఈ 50 రోజుల పాలన కేవలం ఆరంభం మాత్రమే అయినప్పటికీ, ఆయన అనుసరిస్తున్న వ్యూహాలు, తీసుకుంటున్న నిర్ణయాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే విజయ్ తనదైన శైలిలో పాలనను పరుగులు పెట్టించే ప్రయత్నం మొదలుపెట్టారు. సంప్రదాయ రాజకీయ ధోరణులకు భిన్నంగా, ఒక కార్పొరేట్ సంస్థ సీఈఓ తరహాలో ఆయన యంత్రాంగాన్ని నడిపిస్తున్నారు. నిర్ణయాల్లో వేగం, పనుల్లో పారదర్శకత ఉండాలని తన అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తమ ప్రభుత్వ పాలన సామాన్యుల కోసం అంటూ చాటిచెప్పే క్రమంలో ఎన్నికలకు ముందు 436 అంశాలతో రూపొందించిన 'వెట్రి తమిళగం' బ్లూప్రింట్‌ను అమలు చేసేలా అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు.
పాలనలో ఆయన ప్రదర్శిస్తున్న పట్టుదల, ముఖ్యంగా శాంతిభద్రతల విషయంలో స్పష్టంగా కనిపిస్తోంది. గత ప్రభుత్వాల హయాంలో చోటుచేసుకున్న లోపాలను సరిదిద్దుతూ, డీజీపీ నియామకంలో ఆయన చూపిన చొరవ ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. మహిళా భద్రత కోసం ప్రత్యేకంగా 'సింగపెన్నై' టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయడం, రాష్ట్రంలో నేర నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవడం వంటి నిర్ణయాలు సామాన్య ప్రజల్లో ఆయనపై విశ్వాసాన్ని పెంచాయని అంటున్నారు. అవినీతిని అసలు సహించేది లేదని, తన ప్రభుత్వంలో ఎవరైనా తప్పు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించడం ఆయన చిత్తశుద్ధిని ప్రతిబింబిస్తోంది.
సినీ నటుడిగా ఉన్నప్పటి నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగే క్రమంలో ఆయన ఎదుర్కొన్న సవాళ్లు అంత సులభమైనవి కావు. ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే చేస్తున్న విమర్శలు, అసెంబ్లీలో ప్రతిపక్షాల నిరసనలు ఆయనకు నిరంతరం పరీక్షగా మారుతున్నాయి. ముఖ్యంగా, 'హార్స్ ట్రేడింగ్' ఆరోపణలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో జరుగుతున్న జాప్యంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు విజయ్‌కు పెద్ద సవాలుగా పరిణమించాయి. ఎన్నికలకు ముందు కరూర్ లో చోటుచేసుకున్న అవాంఛనీయ సంఘటన కూడా ఆయన ప్రభుత్వాన్ని వెంటాడుతోందని అంటున్నారు. అయినప్పటికీ ప్రతిపక్షాలను తన వాగ్ధాటితో దీటుగా ఎదుర్కొంటున్నారు ముఖ్యమంత్రి విజయ్.
ఇక రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, విజయ్ ప్రస్థానం కేవలం ఒక 'రీల్' కథనం కాదు. 2008 నుంచి శ్రీలంక తమిళుల సమస్యలపై, ఆ తర్వాత జల్లికట్టు, స్టెరిలైట్ ఉద్యమాల్లో తన పాత్రను గుర్తు చేస్తూ, తాను ఎప్పటి నుంచో ప్రజాక్షేత్రంలో ఉన్నానని ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ పరిణతిని ప్రతిబింబిస్తున్నాయని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూనే, తమిళనాడు ప్రయోజనాలను కాపాడటంలో ఆయన చూపిస్తున్న సమతుల్యత భవిష్యత్తులో ఆయనకు కలిసొచ్చే అంశం కానుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ 50 రోజుల్లో ఆయన సాధించిన విజయాలు, ఎదుర్కొన్న సవాళ్లు ఆయన భవిష్యత్ రాజకీయ ప్రయాణానికి పునాదులు కానున్నాయి. మొత్తానికి, నటుడి పార్టీ అనే ముద్రను చెరిపేసి, ఒక నిజమైన ప్రజా నాయకుడిగా ఎదిగేందుకు విజయ్ వేస్తున్న ప్రయత్నం అభినందనీయమే అంటున్నారు.
