దళపతి 'వ్యూహం' ఇదేనా.. విజయ్ ఒంటరి పోరు వెనుక మాస్టర్ ప్లాన్!
తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి 'దళపతి' విజయ్ పైనే ఉంది.
By: Tupaki Political Desk | 7 April 2026 7:09 PM ISTతమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి 'దళపతి' విజయ్ పైనే ఉంది. రెండేళ్ల క్రితం 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీని ప్రకటించిన విజయ్ అసెంబ్లీ ఎన్నికల్లో 234 నియోజకవర్గాల్లో ఒంటరిగా బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. తమిళనాట అగ్ర పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే కూటములతో పొత్తు లేకుండా ఆయన ఎందుకు వెళ్తున్నారు? దీని వెనుక ఉన్న వ్యూహాత్మక రహస్యం ఏమిటి? ఇటీవల వెలువడిన సర్వేలపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఒంటరి పోరు ఎందుకు?
సాధారణంగా కొత్త పార్టీలు ఏదో ఒక పెద్ద కూటమితో జతకట్టి ఉనికిని చాటుకోవాలని చూస్తాయి. కానీ విజయ్ మాత్రం అందుకు భిన్నంగా వెళ్తున్నారు. సర్వేల ప్రకారం, ప్రస్తుతం తమిళనాడులో అధికార డీఎంకే ప్రభుత్వంపై యువత, మహిళలు మరియు ప్రభుత్వ ఉద్యోగులలో కొంత వ్యతిరేకత ఉంది. అటు అన్నాడీఎంకే కూటమిపై కూడా తటస్థ ఓటర్లు పూర్తి సంతృప్తిగా లేరు. ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను తనవైపు తిప్పుకోవడమే విజయ్ ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారని అంటున్నారు.
తాజా అంచనాల ప్రకారం, విజయ్ పార్టీకి సుమారు 18 నుంచి 20 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ ఆయనకు ఈ స్థాయిలో ఓట్లు పడితే, మెజారిటీ సాధించడం కష్టమైనా, ప్రభుత్వ ఏర్పాటులో ఆయన పాత్ర అత్యంత కీలకంగా మారుతుందని అంటున్నారు. అంటే, సీఎం కాకపోయినా, ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయంలో 'కింగ్ మేకర్'గా అవతరించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందని చెబుతున్నారు.
విజయ్ వ్యక్తిగత నేపథ్యం ఆయన ఇమేజ్ కారణంగా క్రైస్తవ సామాజిక వర్గం ఓట్లు టీవీకే పార్టీకి ప్లస్ అయ్యేలా కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. ఇప్పటివరకు ఆ వర్గానికి రాష్ట్ర స్థాయిలో బలమైన రాజకీయ ప్రత్యామ్నాయం లేదు. ఇప్పుడు విజయ్ ఆ లోటును భర్తీ చేస్తూ, ఆ వర్గం ఓట్లను గంపగుత్తగా సాధించాలని చూస్తున్నారని అంటున్నారు. దీనితో పాటు సినిమా స్టార్ గా ఉన్న విపరీతమైన క్రేజ్ యువతను ఆయన వైపు ఆకర్షిస్తోంది.
మొత్తానికి, విజయ్ 'సోలో ఫైట్' కేవలం ధైర్యంతో కూడిన నిర్ణయం మాత్రమే కాదు, దీని వెనుక పక్కా రాజకీయ లెక్కలు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. ఓట్లను చీల్చడం ద్వారా ప్రధాన పార్టీల గెలుపోటములను శాసించి, తద్వారా రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదగాలన్నదే దళపతి మాస్టర్ ప్లాన్. మరి ఈ వ్యూహం ఫలిస్తుందో లేదో తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందేనని చెబుతున్నారు.
