విజయసాయి...వైసీపీ లో బిగ్ చేంజ్ ?
ఇది మామూలు గ్యాప్ కాదని అగాధం అని అంటున్నారు వైసీపీలో విజయసాయిరెడ్డి చేరడం అంటే ఇక కష్టమే అని అంటున్నారు.
By: Satya P | 11 July 2026 9:24 AM ISTవిజయసాయిరెడ్డి అంటే ఆయన పేరుకు ముందు వైసీపీ అని తప్పనిసరిగా జోడించాల్సిన అవసరం ఉంటుంది. అంతలా వైసీపీకి కట్టుబడిపోయి తన ఇంటిపేరుగా ఒంటిపేరుగా మార్చుకున్న నాయకుడిగా కనిపిస్తారు. విజయసాయిరెడ్డి గురించి ఒక సందర్భంలో ప్రత్యర్ధి పార్టీలకు చెందిన కొందరు నేతలు చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే ఆయన వైసీపీకి దూరం కావడం ఎనిమిదవ వింతగా అనిపిస్తుంది. వైసీపీకి జగన్ కి అత్యంత విశ్వాసపాత్రుడైన నాయకుడు విజయసాయిరెడ్డి అని ప్రత్యర్థులే చెబుతూ వచ్చారు. అలాంటి ఆయన ఉన్నట్లుండి 2025 జనవరి 25న తీసుకున్న ఒకానొక కఠిన నిర్ణయం ఈ రోజున ఆయనను మాజీ వైసీపీ నేతగా మార్చేసింది.
ఎందుకు గ్యాప్ అంటే :
వైసీపీలో ఏ నాయకుడికీ లేనంత సాన్నిహిత్యం అనుబంధం వైఎస్ జగన్ తో విజయ్ సాయిరెడ్డికి ఉందని చెప్పుకునే వారు వైఎస్సార్ ఫ్యామిలీకి మూడు తరాలుగా అనుబంధం కలిగిన వారు విజయసాయిరెడ్డి. వైఎస్ రాజారెడ్డి, వైఎస్సార్ జగన్ ఇలా ముగ్గురు నేతలతో పనిచేసిన వారు, జగన్ తో పాటు పదహారు నెలలు జైలు జీవితం అనుభవించిన వారు. ఇక వైసీపీ ఏర్పాటులో పునాదిగా ఉన్నారు. ఆయన జగన్ కి కుడి భుజం అని వైఎస్సార్ కి కేవీపీ మాదిరిగా జగన్ కి ఆత్మ అని కూడా అంటూండేవారు. అందుకే వైఎస్ జగన్ ఆయనను రెండు సార్లు రాజ్యసభకు పంపించారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి రావడం వెనక విజయసాయిరెడ్డి వ్యూహాలు కూడా ఉన్నాయని అంటారు. అటువంటి విజయసాయిరెడ్డి 2019లో పార్టీ అధికారంలోకి వచ్చాక ఎందుకో మెల్లగా అధినేతతో గ్యాప్ పెరిగి 2025 నాటికి పూర్తిగా పార్టీకి దూరం అయిపోయారు. దాంతో వైసీపీలో ఆ లోటు ఇప్పటికీ ఉందని అనేవారూ ఉన్నారు.
అది టెంపరరీ అనుకుంటూ :
ఇక విజయసాయిరెడ్డి వైసీపీని వీడిపోవడం టెంపరరీ అని ఏదో నాటికి ఆయన మళ్ళీ వైసీపీలో చేరుతారు అని జగన్ కి ఆయనకు మధ్య అంతటి బంధం ఉందని నిన్నటిదాకా అనుకుంటూ వచ్చిన వైసీపీ క్యాడర్ కి ఇపుడు ఒక విషయం అయితే స్పష్టంగా అర్ధం అవుతోంది. ఇది మామూలు గ్యాప్ కాదని అగాధం అని అంటున్నారు వైసీపీలో విజయసాయిరెడ్డి చేరడం అంటే ఇక కష్టమే అని అంటున్నారు. జగన్ విషయం తీసుకుంటే ఆయన ఒకసారి తనను నమ్మి ఆ తరువాత దూరం అయిన నేతలను ఎవరైనా ఎంతటి వారు అయినా వెనక్కి తీసుకున్న సందర్భాలు లేవని అంటున్నారు. అయితే విజయసాయిరెడ్డి కేసు ప్రత్యేకం అని అనుకుంటున్నా ఇపుడు అలాంటి భ్రమలు ఏవీ లేవని తాజాగా సాగుతున్న పరిణామాలు తెలియచేస్తున్నాయి.
విమర్శల తాకిడితో :
ఈ మధ్య దాకా విజయసాయిరెడ్డి మీద విమర్శల జోరు అయితే వైసీపీ నుంచి పెద్దగా లేదు, కానీ తాజాగా ఆ ఉధృతి పెరిగింది. ఆయన లేటెస్ట్ గా చేసిన ఒక ట్వీట్ మీద సోషల్ మీడియా వేదికగా వైసీపీ యాక్టివిస్టులు అభిమానులు విరుచుకుపడుతున్నారు. వైసీపీని యూట్యూబర్ ని సమర్ధించడాన్ని హిందూత్వ వ్యతిరేక విధానంగా భావం వచ్చేలా విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ కి సోషల్ మీడియాలో గట్టిగానే వైసీపీ నుంచి వ్యతిరేకత వస్తోంది. వైసీపీకి ద్రోహం చేసిన వారిలో వైఎస్ షర్మిల తో పాటు విజయసాయిరెడ్డి కూడా ఉన్నారంటూ వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు గట్టిగా విమర్శించడం చూస్తే కనుక ఇది ఒక కీలక సంకేతం అని అంటున్నారు.
ఆయనకు డోర్స్ క్లోజ్ అంటూ :
ఇక వైసీపీలో విజయసాయిరెడ్డికి డోర్స్ క్లోజ్ అని కూడా సోషల్ మీడియా నుంచి వినిపిస్తున్న మాటగా ఉంది. జగన్ నమ్మితే ఆయన ఈ విధంగా పార్టీని వీడిపోవడమే కాకుండా ఇపుడు జగన్ ని వైసీపీని టార్గెట్ చేస్తున్నారు అని కూడా మండిపడుతున్నారు. మొత్తం మీద చూస్తే విజయసాయిరెడ్డికి వైసీపీలో రీ ఎంట్రీ అన్నది ఉండదన్న భావనను రేకెత్తించేలా ఈ కామెంట్స్ ఉంటున్నాయి. మరి విజయసాయిరెడ్డి రాజకీయ భవిష్యత్తు ఏమిటి ఎలా ఉంటుంది అంటే ఆయన తానుగా కొత్త పార్టీని పెట్టుకోవాల్సి ఉందని అంటున్నారు. లేదా బీజేపీ లాంటి పార్టీలో చేరాలని అంటున్నారు. మరి కూటమి పార్టీలు అయితే దీనికి ఓకే చెప్పాలి. లేదా తాను అంటున్నట్లుగా విజయసాయిరెడ్డి పార్టీ పెడతారేమో చూడాల్సి ఉంది. ఏది ఏమైనా వైసీపీ బంధం అయితే ఆయనకు లేనట్లే అని అంటున్నారు.
