Begin typing your search above and press return to search.

మళ్లీ మొదలుపెట్టిన విజయసాయిరెడ్డి.. వైరల్ పోస్ట్!

ఎంతో కాలంగా వైఎస్ కుటుంబానికి అత్యంత నమ్మకస్తుడిగా, సానుభూతిపరుడుగా ఉన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి.. వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

By:  Raja Ch   |   19 Jan 2026 11:31 AM IST
మళ్లీ మొదలుపెట్టిన విజయసాయిరెడ్డి.. వైరల్ పోస్ట్!
X

ఎంతో కాలంగా వైఎస్ కుటుంబానికి అత్యంత నమ్మకస్తుడిగా, సానుభూతిపరుడుగా ఉన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి.. వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆయన ట్విట్టర్ వేదికగా పలు పోస్టులు పెట్టారు. ఇందులో ఆయన జగన్ ని ఉద్దేశించి నర్మగర్భ వ్యాఖ్యలు చేసినట్లు చర్చలు జరిగాయి. అయితే తాజాగా మరోసారి ఆయన చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. అమ్ముడు పోయిన 'కోటరీల' మధ్య ‘బందీలుగా’ ఉన్న ఓ ప్రజానాయకులారా అంటూ ఆయన రాసుకొచ్చారు.

అవును... అమ్ముడు పోయిన 'కోటరీల' మధ్య 'బందీలుగా' ఉన్న ఓ ప్రజా నాయకులారా ఆలోచించుకోండి అంటూ 'ఎక్స్‌' వేదికగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారాయి. ఆయన వైసీపీలో ఉన్నప్పుడు, రాజీనామా చేసి బయటకు వచ్చాక ఆ పార్టీలో కోటరీలపైనే ఎక్కువ వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజా వ్యాఖ్యలు కూడా జగన్‌ ను ఉద్దేశించి చేసినవే అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో బలంగా జరుగుతోంది.

వెనుజువెలాలో అధ్యక్షుడి పరిస్థితిని ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి తెరపైకి తెచ్చారు. వెనిజువెలాలో ఎంతో భారీగా ప్రజాదరణతో ఎన్నికైన తర్వాత.. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ అధిపతులు, ఇంతమంది చుట్టూ ఉన్నా.. మిసైళ్ళు, యుద్ధ విమానాలు, భారీ సైన్యం ఎంతగా ఉన్నా, ఆ దేశ అధ్యక్షుడిని, అతడి భార్యని ప్రెసిడెన్షియల్ పేలెస్ నుంచి అమెరికా ఎలాంటి ప్రతిఘటనా లేకుండా ఎత్తుకుపోగలిగిందంటే కారణం ఏమిటి? “వారంతా అమ్ముడు పోవటమే కదా”! అని సాయిరెడ్డి రాసుకొచ్చారు.

అంటే... 2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో గెలుపొంది అతి బలమైన ప్రభుత్వంగా వైసీపీ నిలిచిన తర్వాత 2024 ఎన్నికల్లో 11 స్థానాలకు పరిమితమవ్వడాని విజయసాయిరెడ్డి.. వెనుజువెలా ప్రెసిడెంట్ పరిస్థితితో పోల్చినట్లు చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ ఘోర పతనానికి కారణం... "వారంతా అమ్ముడు పోవటమే కదా"! అని నొక్కి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. ఇంతకూ ఎవరు అమ్ముడుపోయారు.. ఎవరికి అమ్ముడైపొయారు అనేది మాత్రం సాయిరెడ్డి స్పష్టంగా చెప్పలేదు!

ఏది ఏమైనా... విజయసాయిరెడ్డి తాజా ట్వీట్ మాత్రం నెట్టింట వైరల్ గా మారింది. ఇటీవల కాస్త గ్యాప్ ఇచ్చినట్లు కనిపించిన సాయిరెడ్డి.. మళ్లీ మొదలుపెట్టేసినట్లే అనే చర్చా మొదలైంది. కాగా... మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 22న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.