పాపం జెన్ జీ .... విజయసాయి సంచలన కామెంట్స్ !
తన లాంటి వారు అంతా జెన్ జీ తరానికి గొంతుకగా ఉండాలని అనుకుంటున్నట్లుగా విజయసాయిరెడ్డి తాజాగా చేసిన ఒక ట్వీట్ లో పేర్కొనడం విశేషం.
By: Satya P | 10 Aug 2026 9:21 AM ISTజెన్ జీ...ఇపుడు ఎవరి మధ్య అయినా ఇదే రకమైన చర్చ సాగుతోంది. జెన్ జీ ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఉద్యమించిన తీరు కేంద్ర మంత్రి రాజీనామా డిమాండ్ ని సాధించుకున్న విధానంతో ఒక్కసారిగా వారి గురించి చర్చ అంతటా మొదలైంది. జెన్ జీ బలం ఏంటో దేశం మొదటి సారి చూసింది. వారి గురించి ఆర్ఎస్ఎస్ వంటి కుడి భావజాలం కలిగిన సంస్థలు అలాగే ఎడమ భావజాలాన్ని నమ్మే వామపక్షాలు తటస్థ సిద్ధాంతాలను కలిగిన వారు ఇలా అంతా కూడా మద్దతుగా నిలుస్తున్నారు. జెన్ జీ తరం ఆవేదనను గుర్తించాల్సిన అవసరం ఉందని అంతా అంటున్నారు. ఇపుడు తాజాగా మాజీ ఎంపీ మాజీ వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఈ జాబితాలో చేరిపోయారు. ఆయన జెన్ జీ ఆందోళనకు తన మద్దతు పూర్తిగా ప్రకటించారు.
వారి గొంతుకగా :
తన లాంటి వారు అంతా జెన్ జీ తరానికి గొంతుకగా ఉండాలని అనుకుంటున్నట్లుగా విజయసాయిరెడ్డి తాజాగా చేసిన ఒక ట్వీట్ లో పేర్కొనడం విశేషం. జెన్ జీ పట్ల అంతా సానుభూతి చూపించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. వారికి భద్రత కలిగిన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ లేవని, అలాగే సరైన పర్యావరణం లేని సమాజంలో వారు జీవిస్తున్నారని గుర్తు చేశారు. బలహీనమైన కుటుంబ వ్యవస్థలో వారు బతుకుతున్నారని అన్నారు. ఏ రకమైన వనరులు చూసిన అవి ప్రకృతి పరమైనవి అయినా కూడా ప్రస్తుతం కొరతగా ఉన్నాయని మరి ఈ కాలంలో జన్మించిన జెన్ జీ ఏమి పొందుతున్నారు అన్నది కూడా అంతా ఆలోచించాలని ఆయన అన్నారు.
ఆశలకు ఆలంబనగా :
జెన్ జీ తరానికి ఆశలు ఎన్నో ఉంటాయని వాటికి ఆలంబనగా పాలకులు ఉండాలని ఆయన కోరుకున్నారు. అలాగే వారికి దక్కని అవకాశాల మీద కూడా ఆందోళన ఉంటుందని దానిని సానుభూతి చూపిన వారు మాత్రమే అర్ధం చేసుకోగలరని విజయసాయిరెడ్డి అన్నారు. జెన్ జీ ఆలోచనలను ఆవేశాన్ని వారి భావజాలాన్ని అంతా శ్రద్ధ పెట్టి వినాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టంగా చెప్పారు. మొత్తానికి చూస్తే విజయసాయిరెడ్డి జెన్ జీ తరం గురించి ఎవరూ ఆలోచించని విషయాలను అలాగే ఎవరూ స్పృశించని అంశాలను తెర మీదకు తెచ్చారు. విజయసాయిరెడ్డి ఆలోచించిన కోణంలో కనుక అంతా చూస్తే అయ్యో పాపం జెన్ జీ తరం కదా అనిపించక మానదు.
వారికి ఏమిస్తున్నాం :
అవును, ప్రస్తుతం పెద్ద తరం కానీ మధ్య తరం కానీ యువ తరానికి ఏమిస్తోంది అన్న ప్రశ్న ప్రతీ వారూ వేసుకోవాల్సి ఉంది. వారికి సరైన ప్రకృతి వనరులను మిగిలించామా అంటే అది కూడా లేదు, అలాగే వారిక్ ధీమాను పెంచే ఉపాధిని సిద్ధం చేసి ఉంచామా అంటే అది కూడా లేదు, వారికి గట్టి మానవ సంబంధాల అనుభూతిని కూడా తెలియ చేయలేని నిస్సహాయ సమాజంలో ఉంచామని సామాజిక వేత్తలు కూడా అంటున్నారు. అలాంటపుడు తమ బతుకు గురించి, తమ భద్రత గురించి, తమ జీవితాల గురించి తమ రేపటి తరం గురించి ఆలోచించుకునే స్వేచ్చ కానీ హక్కు కానీ జెన్ జీ తరానికి ఉంటాయి కదా అని అంటున్నారు. అది కచ్చితంగా ఉంటుంది అని కూడా సమర్ధిస్తూ చాలా మంది జెన్ జీ తరం పట్ల సానుభూతి తెలియచేస్తున్నారు. విజయసాయిరెడ్డి కూడా తాను జెన్ జీకి గట్టి మద్దతుదారుడిని అని చాటి చెప్పారు. రానున్న రోజులల్లో ఆయన ఈ యువతతో కలసి ఎలా పనిచేస్తారో చూడాల్సి ఉంది.
