Begin typing your search above and press return to search.

విజయసాయిరెడ్డి మార్గం.. నెగెటివిటీని దాటి కొత్త ప్రయాణం వైపు.. ఈ తరం నేర్చుకోవాల్సిన పాఠం

సమాజంలో ఏ మంచి పని చేయాలన్నా.. కొత్త మార్గంలో అడుగులు వేయాలన్నా ప్రారంభంలో విమర్శలు, ట్రోలింగ్ ఎదురుకావడం సహజం.

By:  A.N.Kumar   |   31 Oct 2026 10:47 AM IST
విజయసాయిరెడ్డి మార్గం.. నెగెటివిటీని దాటి కొత్త ప్రయాణం వైపు.. ఈ తరం నేర్చుకోవాల్సిన పాఠం
X

రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం.. వ్యూహాత్మక ఆలోచనలు.. సునిశిత విమర్శలతో సుపరిచితులైన వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా సరికొత్త అవతారంలో కనిపిస్తున్నారు. ఒకప్పుడు కేవలం రాజకీయ ప్రకటనలు.. ప్రెస్ మీట్లకే పరిమితమైన ఆయన శైలి.. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా యువతకు, సామాన్యులకు మరింత దగ్గరవుతోంది. రాజకీయంగా క్రియాశీల పాత్రకు కాస్త దూరంగా ఉన్న సమయంలోనూ.. డిజిటల్ వేదికల ద్వారా ప్రజల్లో నిలవడం వెనుక ఆయన దూరదృష్టి స్పష్టంగా కనిపిస్తోంది.

ఇటీవల ఆయన పంచుకున్న పలు వీడియోలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా తారకరత్న కుమార్తెతో కలిసి సరదాగా గడిపిన క్షణాల నుంచి.. మధ్యప్రదేశ్‌కు చెందిన 'బిట్టు తబాహీ' అనే యువకుడి స్ఫూర్తిదాయక కథ వరకు ఆయన షేర్ చేసిన విషయాలు ఆలోచింపజేస్తున్నాయి. అజ్నార్ నదిని శుభ్రం చేయడానికి ఒక యువకుడు పూనుకున్నప్పుడు సమాజం నుంచి తొలుత విమర్శలు.. ఎగతాళి ఎదురయ్యాయి. అయినా సరే వెనకడుగు వేయకుండా తన లక్ష్యాన్ని పూర్తి చేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఈ కథ ద్వారా విజయసాయిరెడ్డి నేటి తరానికి ఒక గొప్ప సందేశాన్ని అందించారు.

సమాజంలో ఏ మంచి పని చేయాలన్నా.. కొత్త మార్గంలో అడుగులు వేయాలన్నా ప్రారంభంలో విమర్శలు, ట్రోలింగ్ ఎదురుకావడం సహజం. ఒక వ్యక్తి ప్రయాణాన్ని లేదా ఉద్దేశాన్ని సగం లోనే చూసి తీర్పు చెప్పడం సరికాదని.. చివరి వరకు ఓపికతో ప్రయత్నం కొనసాగిస్తేనే విజయానికి నిజమైన విలువ దక్కుతుందని ఆయన స్పష్టం చేశారు. నెగెటివిటీకి భయపడి ఆగిపోకుండా లక్ష్యం వైపు సాగాలనే ఈ సందేశం నేటి యువతకు ఎంతో స్పూర్తినిచ్చేలా ఉంది.

సొంత రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ తరహా సోషల్ మీడియా ప్రచారం ఒక బలమైన వ్యూహంగా మారుతోంది. సంప్రదాయ రాజకీయ పద్ధతుల కంటే రీల్స్ , డిజిటల్ కంటెంట్ ద్వారా వేగంగా యువతకు చేరువ కావచ్చు. ముందుగా సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్లి తన సరికొత్త కోణాన్ని పరిచయం చేసుకుంటూ భవిష్యత్తు రాజకీయ ఇన్నింగ్స్‌కు పునాది వేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈ డిజిటల్ పరిచయం భవిష్యత్తులో రాజకీయ ఆదరణగా మారుతుందో లేదో చూడాలి.