Begin typing your search above and press return to search.

బరస్ట్ అయిన విజయసాయి...టార్గెట్ జగన్ !

వైసీపీ నుంచి తనను అవమానించి బయటకు పంపించారని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. పార్టీలో తనకు దాదాపు 70 సార్లు అవమానాలు ఎదురయ్యాయని, ఆత్మగౌరవం దెబ్బతినడంతో బయటకు రావాల్సి వచ్చిందని చెప్పారు. ఈ నెల 11న అన్ని కులాలు, మతాలకు సమాన ప్రాధాన్యం ఇచ్చే కొత్త పార్టీని స్థాపించనున్నట్లు ప్రకటించారు. ఏపీలో రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా తమ పార్టీ ఉంటుందని వెల్లడించారు.

By:  Satya P   |   7 Nov 2026 7:58 AM IST
బరస్ట్ అయిన  విజయసాయి...టార్గెట్ జగన్ !
X

వైసీపీకి మూల స్తంభం గా ఆయన ఒకనాడు వెలిగారు. నంబర్ టూ అనిపించుకున్నారు. వైసీపీలో జగన్ తరువాత అంతటి వారు అని కూడా అన్నారు. వైసీపీకి అండగా ఉంటూ ప్రత్యర్ధులను సోషల్ మీడియా ద్వారా చీల్చి చెండాడే వారు. ఒక విధంగా వైసీపీకి వ్యూహకర్తగా ఢిల్లీలో ఆ పార్టీకి తలలో నాలుకగా మెలిగిన విజయసాయిరెడ్డి అనూహ్యంగా పార్టీ నుంచి దూరం అయ్యారు. తాను ఎందుకు వైసీపీని విడిచిపెట్టినది ఆయన గతంలో చాలా సార్లు చెప్పుకొచ్చారు. ఇక లేటెస్ట్ గా చూస్తే ఆయన తీవ్ర భావోద్వేగానికి గురి అయినట్లుగా కనిపిస్తోంది. వైసీపీ నుంచి తనను బయటకు గెంటేశారు అని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

డెబ్బై దాకా అవమానాలు :

ఇక వైసీపీలో ఒకటి రెండూ కాదు ఏకంగా డెబ్బై దాకా అవమానాలు చేశారు. అని ఆయన లెక్క కూడా చెప్పారు. ఏ మనిషికీ జరగకూడని అవమానాలు వైసీపీలో తనకు జరిగాయని అన్నారు. వైసీపీ అధినేత జగన్ అవమానించినట్లుగా తనను ఏ రోజూ వైఎస్ రాజారెడ్డి కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కానీ అవమానించలేదు అని ఆయన స్పష్టం చేస్తున్నారు. వైసీపీలో తనను పొమ్మనకుండా పొగబెట్టారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.

చెప్పుడు మాటలు విని :

వైసీపీ నుంచి తాను బయటకు రాలేదని వారే బయటకు తోసేశారు అని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. అడుగడుగునా తనను అవమానిస్తూ భరించలేని పరిస్థితులు తీసుకుని వచ్చారు అని అన్నారు. అందుకే పార్టీని వీడాల్సి వచ్చింది అని అన్నారు. తన ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసేలా పనులు చేశారని ఎవరైనా అవి సహించగలరా అని ఆయన ప్రశ్నించారు. తన ఆత్మ గౌరవం దెబ్బ తిందని అందుకే వైసీపీ నుంచి బయటకు రావాల్సి వచ్చిందని ఆయన అన్నారు. తాను కూర్చున్న కొమ్మనే నరికేశారు అని కూడా విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు.

హిందూత్వ పార్టీ కాదు :

తాను పెట్టబోయే పార్టీ హిందూత్వ పార్టీ కాదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. అన్ని వర్గాలు మతాలకు కులాలకు చెందిన పార్టీ అని అన్నారు. ఈ పార్టీలో అందరికీ సమాన అవకాశాలు ఉంటాయని ఆయన చెప్పారు. అన్ని వర్గాలకు సమ న్యాయం తమ పార్టీతో జరుగుతుందని అన్నారు. ఈ నెల 11న తన పార్టీని స్థాపిస్తున్నామని ఆయన వెల్లడించారు. తనకు వైసీపీలో జరిగిన అవమానాలు కొత్త పార్టీలో ఎవరికీ జరగవని మాట ఇస్తున్నాను అన్నారు. అందరినీ గౌరవంగా చూసుకోవడమే తమ పార్టీ ప్రధాన అంశంగా చెప్పారు.

రెండు పార్టీలేనా :

ఏపీలో రెండు పార్టీలు ఉండడం మీద ఆయన విమర్శలు చేశారు. ఎంతసేపూ రెండు కుటుంబాలు రెండు పార్టీలే ఏపీలో ఉండాలా అని ఆయన ప్రశ్నించారు. ఆ పార్టీలకు ప్రత్యామ్నాయంగా తన కొత్త పార్టీ పెడుతున్నామని విజయసాయిరెడ్డి వివరించారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా సాగలేదని ఆయన విమర్శించారు. అధికారం అండతో ఏకపక్ష వైఖరిని ప్రదర్శించారని ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు అని అన్నారు. ఎవరైనా అధికారం ఉందని విర్రవీగితే ప్రజలే గుణపాఠం చెబుతారు అని అన్నారు. ఇదిలా ఉంటే విజయసాయిరెడ్డి కొత్త పార్టీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన వేళ జగన్ నే గట్టిగా టార్గెట్ చేస్తూ ముందుకు రావడం విశేషం.