Begin typing your search above and press return to search.

పరువు పోవడం తప్ప ఒరిగింది ఏముంది రెడ్డి గారూ !

విజయసాయిరెడ్డి వైసీపీలో పునాది నుంచి ఉన్న నాయకుడు. ఆయన వైఎస్ ఫ్యామిలీకి నమ్మిన బంటుగా మెలిగిన వారు.

By:  Satya P   |   2 Sept 2026 7:00 AM IST
పరువు పోవడం తప్ప ఒరిగింది ఏముంది రెడ్డి గారూ !
X

విజయసాయిరెడ్డి వైసీపీలో పునాది నుంచి ఉన్న నాయకుడు. ఆయన వైఎస్ ఫ్యామిలీకి నమ్మిన బంటుగా మెలిగిన వారు. మూడు తరాల వారితో కలసి ప్రయాణించడం అంటే మామూలు విషయం కాదు. అలా విజయసాయిరెడ్డి ఆడిటర్ స్థాయి నుంచి ఏపీ రాజకీయాల్లో ప్రముఖ నేత దాకా ఎదిగారు. ఈ విషయంలో ఆయన వైఎస్సార్ ఫ్యామిలీ మీద చూపించిన విశ్వసనీయతతో పాటు ఆయన కష్టం, త్యాగం, కృషి ఉన్నాయి. అలాగే ఆయన్ని ఆదరించిన ఘనత కూడా వైఎస్సార్ ఫ్యామిలీకి దక్కుతుంది. ఇలా సాగిన ఈ ప్రయాణానికి కాస్తా 2025 జనవరి 25న బ్రేక్ పడింది. తానుగా స్వచ్చందంగా వైసీపీ నుంచి అలాగే వైసీపీ ద్వారా సంక్రమించిన రాజ్యసభ నుంచి తప్పుకుంటున్నట్లుగా విజయసాయిరెడ్డి ప్రకటించి రాజకీయ లోకాన్ని ఒక్కసారిగా ఆశ్చర్యంలో పడవేశారు.

కొత్త పార్టీ పేరుతో :

అంతే కాదు ఆయన తనకీ రాజకీయాలు వద్దు వ్యవసాయం బెస్ట్ అనుకుంటూ వెళ్లిపోయారు. కొన్ని రోజుల పాటు ఆయన వ్యవసాయం చేస్తున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చాయి. ఇదంతా బాగానే ఉంది ఆయన రాజకీయంగా మాజీ నాయకుడే అనుకునేలోపుగా ఆయన మీడియా ముందుకు వచ్చారు. అలా ఆయన వైసీపీ మీద కోటరీ మీద జగన్ మీద ఇండైరెక్ట్ గా విమర్శలు చేస్తూ సంచలనం రేకెత్తించారు. ఆ తరువాత అడపా దడపా ఆయన ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. తన ట్విట్టర్ కి పని చెబుతూనే ఉన్నారు. ఒక సందర్భంలో శ్రీకాకుళం పర్యటనలో ఆయన కొత్త పార్టీ పెడతాను అని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక తాజాగా తిరుపతి దేవుడి దర్శనం వేళ కొత్త పార్టీ ప్రకటన కూడా చేశారు. అయితే ఎపుడు పార్టీ ప్రారంభిస్తున్నట్లుగా స్టేట్మెంట్ ఇస్తారో అన్నదే ఇపుడు చూడాల్సిన విషయం.

సానుభూతి కోసమా లేక :

ఇవన్నీ పక్కన పెడితే తాజాగా విజయసాయిరెడ్డి విడుదల చేసిన ఒక బహిరంగ లేఖలో 2022 వైసీపీ ప్లీనరీలో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తన మీద భౌతికంగా దాడి చేశారు అని సంచలన విషయాన్ని బయటపెట్టారు. దాంతో పొలిటికల్ గా ఇది షాకింగ్ ఇష్యూ అయింది. విజయసాయిరెడ్డి లాంటి నేత టీడీపీ మీద ఎన్ని విధాలుగా విమర్శలు చేసినా ఈ తరహా దాడులు అయితే జరగలేదు, మరి సొంత పార్టీలో అది కూడా ప్లీనరీ సమయంలో ఈ విధంగా జరిగింది అంటే ఏమిటిదని జనాలు రాజకీయ జనాలూ చర్చించుకోవడం జరుగుతోంది. అంతే కాదు వైసీపీలో తాను 74 రకాలైన అవమానాలు భరించాను అవన్నీ సమయం వచ్చినపుడు విడతల వారీగా బయటపెడతాను అని విజయసాయిరెడ్డి కొసమెరుపు కూడా ఆ లేఖ ద్వారా మెరిపించారు.

అవును నిజమే అంటూ :

ఇదిలా ఉంటే విజయసాయిరెడ్డి లేఖను కౌంటర్ చేస్తూ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా మీటింగ్ పెట్టి మరీ పూర్తి వివరణ ఇచ్చారు. ఆయన మీద తాను దాడి చేస్తే ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ఒక లాజిక్ పాయింట్ ని కూడా లేవనెత్తారు. అంతే కాదు ఆయనకు ఆ తర్వాత కూడా రాజ్యసభ లాంటి పదవులు లభించాయి కదా ఇక అవమానం ఎక్కడ అని కూడా సజ్జల రెట్టించారు. దాంతో ఈ ఎపిసోడ్ లో వైసీపీ వెర్షన్ ఇదని క్లారిటీ వచ్చాక విజయసాయిరెడ్డి ఏమి చెబుతారు అన్నది అంతా చూస్తున్న వేళ టీడీపీ ఎమ్మెల్యే పూర్వాశ్రమంలో వైసీపీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సీన్ లోకి వచ్చారు. అవును విజయసాయిరెడ్డి మీద సజ్జల భౌతిక చేసింది నిజమని స్పష్టం చేశారు. అంతే కాదు మరో సందర్భంలో ఇదే సజ్జల విజయసాయిరెడ్డి మీద దారుణంగా మాట్లాడారు అని కొత్త విషయం చెప్పారు. బహుశా ఇది విజయసాయిరెడ్డికి జరిగిన మిగిలిన 74 అవమానాలలో భాగం అయి ఉంటుంది. కానీ దానిని ఆయన కంటే ముందు కోటంరెడ్డి రివీల్ చేశారనుకోవాలి.

ఏమిటి లాభమంటే :

సరే సజ్జల విజయసాయిరెడ్డి మీద దాడి చేశారు. ఇది నిజం అని కోటంరెడ్డి కూడా ఖరారు చేశారు. అంతా నిజమే అనుకున్నా ఏమిటి లాభం ఇపుడు అన్నదే ప్రశ్న. ఆ తరువాత మరో మూడున్నరేళ్ల పాటు ఇదే విజయసాయిరెడ్డి వైసీపీలో ఉన్నారు కదా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇక వైసీపీ వారు అయితే ఆయనకు ఎంతో గౌరవం ఇచ్చామని చెబుతున్నారు. అంతే కాదు మరో ప్రశ్న కూడా వారి నుంచి వస్తోంది. 2024 లో ఒకవేళ జగన్ గెలిచి ఉంటే సాయి రెడ్డి పార్టీని వీడిపోవడాలు ఈ ఫ్లాష్ బ్యాక్ అవమానాల గురించి వల్లించేవారా అనేది లాజిక్ పాయింట్ గా వదులుతున్నారు. విజయసాయిరెడ్డి వంటి పెద్ద మనిషి మీద భౌతిక దాడి జరిగితే అది ఖండించాల్సిన విషయం. అయితే అది ఎపుడు జరిగింది అన్నది కూడా ముఖ్యం. నాలుగేళ్ళ క్రితం జరిగిన దానిని ఇన్నాళ్ళకు బయట పెట్టడం వల్ల ఒరిగేది ఏముంది అన్నదే ప్రశ్న.

వ్రతం చెడినా :

ఆనాడే తనకు తీరని అవమానం జరిగింది వైసీపీలో అంటూ విజయసాయిరెడ్డి బయటకు వచ్చి ఉంటే ఆయన జనం దృష్టిలో అభిమానం సానుభూతి పొందేవారు అని అంటున్నారు. అలా కాకుండా రాజ్యసభ సీటు అందుకున్నారు, 2024 ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా కూడా పోటీ చేశారు, వైసీపీ ఓటమి తర్వాత కదా ఆయన బయటపడ్డారు అని అంటున్నారు. వ్రతం చెడినా ఫలితం దక్కాలి అని ఒక సామెత ఉంది. ఇక్కడ సాయి రెడ్డి మీద దాడి జరిగింది అన్నది ఇపుడు కన్ఫర్మ్ అయినా సానుభూతి అయితే ఏ మేరకు వస్తుంది అన్నది డౌటే. అదే సమయంలో పదే పదే ఇదే విషయం చెప్పుకుంటూ పోతే పెద్దాయన పరువు పోతోంది అన్నది గుర్తెరగాలని సూచనలు వస్తున్నాయి.