విజయసాయి ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే !
ఉన్న ఎంపీ పదవికి రాజీనామా చేశారు. 2028 దాకా పదవీకాలం ఉన్నా కాదనుకున్నారు. మాతౄ సంస్థ లాంటి వైసీపీని కారణాలు ఏమిటో తెలియదు కానీ ఆయన వీడారు.
By: Satya P | 20 Aug 2026 9:09 AM ISTవి విజయసాయిరెడ్డి కేరాఫ్ వైసీపీ. ఇదంతా దాదాపుగా ఇరవై నెలల క్రితం నాటి ముచ్చట. విజయసాయిరెడ్డి కేరాఫ్ ఒక రైతు ఇది 2025 జనవరి 25న ఆయన వైసీపీకి తన పదవికి రాజీనామా చేస్తూ వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పినప్పటి మాట. ఇక ఈ ఏడాది మొదట్లో విజయసాయిరెడ్డి చేసిన ప్రకటన చూస్తే ఆయన ప్రస్తుతం ఉన్న పార్టీలలో ఏదో ఒక దానిలో చేరుతారు అని అంతా అనుకున్నారు. కానీ చివరికి విజయసాయిరెడ్డి తేల్చింది ఏంటి అంటే కొత్తగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నాను అని. శ్రీవారిని దర్శించుకుని బయటకు వచ్చిన ఆయన ఈ విషయం ప్రకటించి కొంత మేరకు సంచలనం రేపారు. జనం గొంతుకగా తన కొత్త పార్టీ ఉంటుందని ఆయన చెప్పారు. అంతే కాదు ఈ నెలాఖరులోనే విజయవాడలో ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ తన పార్టీకి సంబంధించిన విషయాలు అన్నీ కూడా వివరంగా తెలియచేస్తాను అని అంటున్నారు.
అపుడే మోజు పోయిందా :
ఉన్న ఎంపీ పదవికి రాజీనామా చేశారు. 2028 దాకా పదవీకాలం ఉన్నా కాదనుకున్నారు. మాతౄ సంస్థ లాంటి వైసీపీని కారణాలు ఏమిటో తెలియదు కానీ ఆయన వీడారు. అప్పట్లో ఆయన అన్న మాటలు వ్యవసాయం తనకు ఇష్టమని చేసుకుంటాను అన్నారు. ఆ తరువాత సోషల్ మీడియాలో కూడా వ్యవసాయానికి సంబంధించిన ఫోటోలు ఆయన పెట్టారు. దాంతో ఆయన ఇక రాజకీయాల వైపు చూడరనే అనుకున్నారు. కానీ ఆయనకు ముఖం మొత్తిందో ఏమో తెలియదు కానీ గత కొన్నాళ్ళుగా రాజకీయ ప్రకటనలు చేస్తూ వచ్చారు. ఇపుడు ఏకంగా కొత్త పార్టీ అంటూ ముగ్గులోకి దిగిపోయారు.
చోటు ఉందా అన్నదే :
సరే పార్టీ పెట్టడం ఎవరైనా చేస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు వెళ్తే గుట్టలుగా ఎన్నో పార్టీలు రిజిస్ట్రేషన్ అయి ఉంటాయి. అందులో వేళ్ళ మీద లెక్క పెట్టినవే రాణిస్తున్నాయి. ఏ లెక్క ఎంత బాగా అర్ధమైనా రాజకీయ లెక్కలు ఎంతటి గణిత శాస్త్ర సహస్రావధానికి అయినా అర్ధం కావనే అంటారు. రాజకీయాల్లో గెలుపుకే విలువ ఉంటుంది. అక్కడ అది కొందరికే దక్కుతుంది. మరి అలాంటి రాజకీయాల గురించి విజయసాయిరెడ్డికి తెలియదు అని ఎవరూ అనుకోరు. ఎందుకంటే ఆయన వైసీపీలో పునాది నుంచి ఉన్న వారు. అంతే కాదు ఆ పార్టీలో కీలకంగా ఉంటూ నడిపించారు. వివిధ హోదాలలో పనిచేశారు. మరి విజయసాయిరెడ్డికి ముఖ్యంగా తెలియాల్సింది ఏపీలో కొత్త రాజకీయ పార్టీకి అవసరం అయిన చోటు ఉందా అన్నదే.
వాటికే లేదు కదా :
ఏపీలో చూస్తే చాలా పార్టీలు ఇప్పటికే ఉన్నాయి. కాంగ్రెస్ వామపక్షాలు అయితే సుదీర్ఘమైన అనుభవం కలిగి ఉండి కూడా విభజన ఏపీలో ఇంతవరకూ సభలో అడుగు పెట్టలేకపోయాయి. ఇక ఉమ్మడి ఏపీలో ప్రజారాజ్యం పార్టీ ప్రభంజనంగా వచ్చి ఆ వెంటనే కాంగ్రెస్ లో విలీనం అయిపోయింది. ఇక విభజన ఏపీలో జనసేన పొత్తులతో నెట్టుకుని వస్తోంది. ఏపీలో చూస్తే ప్రధానంగా పోటీ టీడీపీ వైసీపీల మధ్యనే ఉంది. రాజకీయం జనాలు అభిమానులు మీడియా సోషల్ మీడియా ఈ రెండు పార్టీల మధ్యనే నిలువునా చీలిపోయిన నేపథ్యం ఉంది. ఈ రెండు పార్టీలకు సొంతంగా చెరో నలభై శాతం ఓటు షేర్ ఉంది. ఇక ఎవరైనా ఆ మిగిలిన ఇరవై శాతం కోసమే పోటీ పడాల్సి ఉంటుంది. ఇందులో జనసేన వాటా చాలా పెద్దదిగా ఉంది. బీజేపీ కూడా కొంత స్కోర్ చేస్తోంది. కాంగ్రెస్ వామపక్షాలదీ పరిమితమైన వాటా ఉంది. ఇక వీటితో పాటు వైసీపీ టీడీపీలలో ఎవరిని అధికారంలోకి తేవాలో నిర్ణయించేది ఈ 20 శాతమే కాబట్టి వారు కూడా ఈ వాటా కోసం పోటీ పడతారు.
సాహసమేనా అంటూ :
విజయసాయిరెడ్డి సాహసమే చేస్తున్నారా అన్న మాట వినిపిస్తోంది. ఆయన రాజకీయ సర్కిల్స్ లో తెలుసు కానీ జన సామాన్యంలో పెద్దగా పరిచయం ఉన్న వారు కాదు. ఇక ప్రజాకర్షణ లేదు, మేధస్సు ఉంది. రాజకీయ వ్యూహాలు ఉన్నాయి కానీ జనాలను కూడగట్టే చాతుర్యం ఎంత ఉందో చూడాల్సి ఉంది. ఇక ఆయన వెంట ఎవరు ఉన్నారు, ఏ రాజకీయ సిద్ధాంతాలతో పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు అన్నది కూడా చూడాల్సి ఉంది. ఏది ఏమైనా విజయసాయిరెడ్డి ఒక రకంగా ధైర్యం చేస్తున్నారు అనే అంటున్నారు. ఆయన లాంటి మేధావి రాజకీయ నాయకులు ఏదైనా పార్టీలో చేరి సేవ చేయడమే మంచి ఆప్షన్ అని అంటున్నారు. కానీ విజయసాయిరెడ్డి ఆలోచనలు ఎలా ఉన్నాయో కొత్త పార్టీ అంటున్నారు కాబట్టి వేచి చూడాల్సిందే.
