Begin typing your search above and press return to search.

విజయసాయిరెడ్డి కొత్త పార్టీ పేరు ?

వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నవంబర్ 11న ఉదయం 11 గంటల 11 నిమిషాల 11 సెకన్లకు విజయవాడలో కొత్త పార్టీని ప్రకటించనున్నారు. పార్టీ పేరు, జెండా రంగులు, సిద్ధాంతాలపై ఆసక్తి నెలకొంది. అన్ని కులాలు, మతాలను గౌరవించేలా పార్టీ ఉంటుందని, బీజేపీతో సంబంధం లేదని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు.

By:  Satya P   |   11 Nov 2026 7:16 AM IST
విజయసాయిరెడ్డి కొత్త పార్టీ పేరు ?
X

వైసీపీ మాజీ నాయకుడు, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త పార్టీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఆయన తన పార్టీని ప్రకటించేందుకు ఈ నెల 11వ తేదీన 11 గంటలకు 11 నిముషాల 11 సెకండ్లకు ఒక మంచి ముహూర్తాన్ని ఎంచుకున్నారు. విజయవాడలో పార్టీ ప్రకటన ఆయన చేయనున్నారు. మరి కొత్త పార్టీ పేరు ఏమిటి, జెండా రంగులు ఏమిటి, పార్టీ సిద్ధాంతాలు ఏమిటి అన్నది అయితే చర్చ సాగుతోంది.

జగన్ కుడి భుజంగా :

విజయసాయిరెడ్డి అంటే జగన్ కి కుడి భుజం అనే అంతా చెప్పుకునే వారు. వైసీపీలో నంబర్ టూ గా ఆయన ఉన్నారు. అలాంటి ఆయన 2025 జనవరి 25న తాను వైసీపీని వీడుతున్నట్లుగా ఢిల్లీలో ఒక సంచలన ప్రకటన చేశారు. ఆ తరువాత ఆయన పార్టీకి దాని ద్వారా వచ్చిన రాజ్యసభ ఎంపీ పదవికి కూడా రాజీనామా చేశారు. అనంతరం తాను వ్యవసాయం చేసుకుంటాను అన్నారు. కానీ కొద్ది కాలం తరువాత ఆయన ట్విట్టర్ మళ్లీ పొలిటికల్ సౌండే వినిపించింది. అలా ఆయన మళ్ళీ రాజకీయాల వైపు తొంగి చూశారు.

అపుడే సంకేతాలు :

రాజకీయాలలో విజయసాయిరెడ్డికి ఆసక్తి ఉందని తేలిన తరువాత ఆయన బీజేపీలో చేరుతారు అని ప్రచారం కూడా సాగింది. అలాగే ఆయన జనసేనలోకి వెళ్తారు అని అనుకున్నారు. అదే విధంగా ఆయన మళ్లీ వైసీపీలోనే చేరుతారు అని కూడా ఊహాగానాలు చేశారు. వీటి మధ్యనే విజయసాయిరెడ్డి ఆ మధ్యన శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తూ మీడియాతో మాట్లాడారు. తాను అవసరం అయితే కొత్త పార్టీ పెడతాను అని అపుడే సంకేతాలు ఇచ్చారు. కానీ అది ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు, ఎందుకంటే కొత్త పార్టీ పెట్టడం అన్నది మామూలు విషయం అయితే కాదు, కానీ విజయసాయిరెడ్డి ఇపుడు దానినే నిజం చేసి చూపించబోతున్నారు. దాని కోసం ఆయన కార్తీక మాసంలో ఒక సుముహూర్తాన్నే ఎంచుకున్నారు.

నిజమైన రెడ్ల కోసం :

ఇక రాయలసీమలో ఒక ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ నిజమైన రెడ్ల కోసం తన పార్టీ ఉంటుందని అన్నారు. వారి ఆత్మ గౌరవం కాపాడుతాను అని కూడా చెప్పారు. మరో సందర్భంలో హిందూత్వ వాదాన్ని వినిపించారు. ఇలా ఆయన చాలా వ్యాఖ్యానాలు చేస్తూ ప్రెస్ మీట్లను విజయవాడ విశాఖ తిరుపతి అనంతపురంలలో నిర్వహించారు. లేటెస్ట్ గా ఆయన మాట్లాడిన ప్రెస్ మీట్ లో మాత్రం అన్ని మతాలను కులాలను గౌరవిస్తూ తన పార్టీ ఉంటుందని అన్నారు. బీజేపీకి తన పార్టీకి ఏ మాత్రం సంబంధం లేదని కూడా స్పష్టం చేశారు.

చేరేది ఎవరు :

కొత్త పార్టీ అంటే కీలక నేతలు వివిధ ప్రాంతాల నుంచి చేరితేనే జోష్ వస్తుంది. ఏపీలో ఉమ్మడి పదమూడు జిల్లాలు ఉన్నాయి. విజయసాయిరెడ్డి నెల్లూరుకి చెందిన వారు. మరి ఆయన కొత్త పార్టీలో చేరేది ఎవరు అన్నది కూడా కొద్ది గంటలలో తెలుస్తుంది అని అంటున్నారు. బలమైన నాయకులు వివిధ జిల్లాల నుంచి చేరితేనే పార్టీకి ఒక బలం ఉందని తొలి ప్రకటనతోనే అంతా విశ్వసించే అవకాశం ఉంటుంది. మరి విజయసాయిరెడ్డి విశాఖ సహా ఉత్తరాంధ్ర జిల్లాలలో ఆరేళ్ళ పాటు రీజనల్ కో ఆర్డినేటర్ గా వైసీపీకి సేవలు అందించారు. అక్కడ పరిచయాలు నుంచి చూస్తే ఆయనకు ఆ ప్రాంతం నుంచి కొత్త పార్టీకి ఎంత మద్దతు ఉండబోతోంది అన్నది కూడా చూడాలని అంటున్నారు. ఏది ఏమైనా ఏపీలో మరో కొత్త పార్టీ అయితే రాబోతోంది. మరి దాని పేరు ఏమిటి అన్నదే ఇపుడు ఉత్కంఠగా ఉంది.