Begin typing your search above and press return to search.

రెడ్డి కార్డు...విజయసాయికి వర్కౌట్ అవుతుందా ?

వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయ ఆరాటం అర్థం చేసుకోవాల్సిందే.

By:  Satya P   |   21 Sept 2026 9:24 AM IST
రెడ్డి కార్డు...విజయసాయికి వర్కౌట్ అవుతుందా ?
X

వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయ ఆరాటం అర్థం చేసుకోవాల్సిందే. ఆయన తాను వ్యవసాయం చేసుకుంటాను అని గత ఏడాది జనవరి చివరిలో తన ఎంపీ పదవికి రాజీనామా ఇచ్చినపుడు కూడా చాలా మంది నమ్మలేదు. ఎందుకంటే రాజకీయ మోజు అలాంటిది. అక్కడ ఒకసారి ఎంట్రీ ఇవ్వాలే కానీ రాజీనామాలు పదవీ విరమణలు ఉండవు. అందుకే అతి తక్కువ సమయంలోనే విజయసాయిరెడ్డి తిరిగి ట్వీట్లతో రాజకీయ సౌండ్ మొదలెట్టేశారు. ఇపుడు చూస్తే ఆయన కొత్త పార్టీ అంటున్నారు. అది కూడా విజయదశమికి ప్రారంభం అని చెబుతున్నారు. ఈ మధ్యలో తన పార్టీ అజెండా ఏమిటో చెప్పకున్నా వైసీపీని గట్టిగానే టార్గెట్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

రెడ్లు ఆదరిస్తారా :

ఏపీలో రెడ్లకు రాజకీయంగా ఘనమైన చరిత్ర ఉంది. తెలుగు రాష్ట్రం ఏర్పాటుతోనే వారి రాజకీయ వైభవం కూడా మొదలైంది. టీడీపీ ఆవిర్భావం వరకూ అది అన్ స్టాపబుల్ గానే సాగింది. అయితే టీడీపీ వచ్చాక ప్రతీ అయిదేళ్లకు అధికార మార్పిడితో రెడ్లు పగ్గాలు అందుకుంటూనే ఉన్నారు. అలా ఉమ్మడి ఏపీలో చెన్నారెడ్డి, నేదురుమల్లి, కోట్ల విజయభాస్కరరెడ్డి, వైఎస్సార్, కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రులుగా చేశారు. విభజన ఏపీలో రెడ్లు వైసీపీని తమ రాజకీయ క్షేత్రంగా ఎంచుకున్నారు. ఈ నేపధ్యంలో రెడ్లలో చీలిక తెచ్చేలా తాజాగా విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఒరిజినల్ రెడ్లు అంటూ ఆయన చేసిన హాట్ కామెంట్స్ వైసీపీ మీద పరోక్ష విమర్శలే అంటున్నారు. అదే సమయంలో రెడ్ల ఆత్మ గౌరవం పౌరుషం అన్నవి ఆయన ప్రస్తావిస్తూ వాటిని తమ కొత్త పార్టీ పరిరక్షిస్తుందని హామీ ఇచ్చారు. అయితే రెడ్లు విజయసాయిరెడ్డి పెట్టబోయే పార్టీని ఆదరిస్తారా అన్నదే ఇక్కడ పాయింట్ గా ఉంది.

బలమైన ఓటు బ్యాంకు గా :

రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాలలో వైసీపీకి రెడ్లు బలమైన ఓటు బ్యాంక్ గా ఉన్నారు. 2024 ఎన్నికల్లో మాత్రం వారు ఫోర్ ఫ్రంట్ లో నిలిచి గట్టిగా పోరాడకపోవచ్చు కానీ యాంటీగా మాత్రం చేయలేదు, ఏపీలో రాజకీయ పరిస్థితులు, సామాజిక వాతావరణం రెడ్లకు తెలియదు అని ఎవరూ అనుకోవడం లేదు, కాంగ్రెస్ ఏపీలో చతికిలపడిన తరువాత తమకు సురక్షిత స్థావరం వైసీపీ అనే వారు ఆ వైపునకు మొగ్గు చూపించారు. నిజానికి వైసీపీ వైపు ఉన్న రెడ్లలో చీలిక తేవాలన్న ఆలోచన కాంగ్రెస్ కూడా చేసింది. అందుకే వైఎస్సార్ తనయ షర్మిలను ముందు పెట్టి రాజకీయంగా వ్యూహ రచన చేసింది. అయితే ఆమెని చూసి రెడ్లు కాంగ్రెస్ వైపు మళ్ళలేదు కదా అని గుర్తు చేస్తున్నారు. ఒక జాతీయ పార్టీగా గతంలో రెడ్లకు సముచితమైన స్థానం కల్పించిన కాంగ్రెస్ వైపే ఏపీలో కీలక సామాజిక వర్గంగా ఉన్న రెడ్లు మొగ్గు చూపలేనిది విజయసాయిరెడ్డి పెట్టబోయే కొత్త పార్టీ వైపు ఎలా చూపిస్తారు అన్నది కూడా ప్రశ్నగా ఉంది.

గెలిపించే వారి వైపే :

నాయకుడు అంటే గెలిపించేవారే. ఆ విధంగా చూస్తే టీడీపీకి చంద్రబాబు వైసీపీకి జగన్ అలా కనిపిస్తారు. ఇమేజ్ అన్నది వారి చుట్టూనే బిల్డప్ అయి ఉంటుంది. రాజకీయాల్లో ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలలో ఇమేజ్ ఉన్న నాయకుడితోనే పార్టీలు ఉంటాయి. వారి చుట్టే అల్లుకుంటాయి. విజయసాయిరెడ్డి విషయానికి వస్తే ఆయనను రాజకీయ మేధావిగా అంతా చూస్తారు. ఆయన రెండు సార్లు రాజ్యసభకు నెగ్గార్జు కానీ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేదు అని గుర్తు చేస్తున్నారు. ఇక జగన్ విషయం తీసుకుంటే ఆయన ప్రజాకర్షణను చూసే వైసీపీలో నేతలు ఎంతటి సీనియర్లుగా ఉన్నా కొనసాగుతున్నారు. దాంతో విజయసాయిరెడ్డి రెడ్ల విషయంలో చీలిక తేవాలని అనుకుంటే కుదిరే వ్యవహారం కాదని అంటున్నారు. పైగా బీజేపీ అనుకూల భావజాలంతో విజయసాయిరెడ్డి ట్వీట్లు వ్యాఖ్యలు ఉన్న వేళ మరింతగా ఆలోచిస్తారు అని అంటున్నారు. ఏది ఏమైనా కొత్త పార్టీ కోసం విజయసాయిరెడ్డి చేస్తున్న ఈ ప్రయత్నాలు మాత్రం కొంత ఆసక్తిగా కనిపిస్తున్నాయి.