Begin typing your search above and press return to search.

అసెంబ్లీ స్థానానికి విజ‌య్ రాజీనామా.. నెక్ట్స్ అభ్య‌ర్థి ఎవ‌రు?

త‌న రాజీనామా పత్రాన్ని అసెంబ్లీ సెక్ర‌ట‌రీ శ్రీనివాస‌న్‌కు మంత్రులు సెంగోట్ట‌య్య‌న్‌, వెంక‌ట‌రామ‌న్‌ల‌తో పంపించారు. అనంత‌రం ఆయ‌న సెక్ర‌ట‌రీకి వెళ్లి ముఖ్య‌మంత్రి ఆఫీసులో ఆశీసునుల‌య్యారు.

By:  Garuda Media   |   11 May 2026 9:38 AM IST
అసెంబ్లీ స్థానానికి విజ‌య్ రాజీనామా.. నెక్ట్స్ అభ్య‌ర్థి ఎవ‌రు?
X

గ‌త నెల‌లో జ‌రిగిన త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేసిన టీవీకే అధిప‌తి, తాజాగా ముఖ్య‌మంత్రి పీఠాన్ని అధిరోహించిన జోసెఫ్ విజ‌య్.. సీఎంగా ప్ర‌మాణం చేసిన వెంట‌నే రెండు స్థానాల్లో ఒకదానికి రాజీనామా చేశారు. త‌న రాజీనామా పత్రాన్ని అసెంబ్లీ సెక్ర‌ట‌రీ శ్రీనివాస‌న్‌కు మంత్రులు సెంగోట్ట‌య్య‌న్‌, వెంక‌ట‌రామ‌న్‌ల‌తో పంపించారు. అనంత‌రం ఆయ‌న సెక్ర‌ట‌రీకి వెళ్లి ముఖ్య‌మంత్రి ఆఫీసులో ఆశీసునుల‌య్యారు.

తాజా ఎన్నిక‌ల్లో తిరుచిరాప‌ల్లి తూర్పు, పెరుంబూరు స్థానాల నుంచి విజ‌య్ పోటీ చేశారు. రెండు స్థానాల్లోనూ ఆయ‌న విజ యం ద‌క్కించుకున్నారు. తాజాగా తిరుచిరాప‌ల్లి తూర్పు స్థానానికి రాజీనామా చేశారు. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌య్ 27 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధించారు. కానీ.. దీనిని ఆయ‌న వ‌దుల‌కున్నారు. 53 వేల పైచిలుకు ఓట్ల మెజా రిటీతో విజ‌యం ద‌క్కించుకున్న పెరుంబూరు స్థానాన్ని నిల‌బెట్టుకున్నారు. త‌ద్వారా త‌న స్థానాన్ని పెరుంబూరుగా ఆయ‌న చెప్ప‌క‌నే చెప్పారు.

తాజాగా రాజీనామా చేసిన తిరుచిరాప‌ల్లి తూర్పు నియోజ‌క‌వ‌ర్గానికి వ‌చ్చే ఆరు మాసాల్లో ఉప ఎన్నిక‌లు నిర్వ‌హిస్తారు. నిబంధ‌న‌ల ప్ర‌కారం.. ఇంకా ముందుగా నిర్వ‌హించినా ఆశ్చ‌ర్యం లేదు. అయితే.. ఇక్క‌డ నుంచి టీవీకే త‌ర‌ఫున ఎవ‌రు పోటీ చేస్తార‌న్న ప్ర‌శ్న‌గా మారింది. ఆది నుంచి న‌టి త్రిష ఇక్క‌డ నుంచి పోటీ చేయొచ్చ‌ర‌న్న ఊహాగానాలు ఉన్నాయి. కానీ, ఆమె టీవీకేకు మ‌ద్ద‌తు తెలుపుతున్నా.. విజ‌య్‌కు అనుకూలంగా ప్ర‌క‌ట‌న‌లు జారీ చేస్తున్నా.. ఆమె టీవీకే పార్టీ స‌భ్య‌త్వం తీసుకోలేదు. పైగా.. త్రిష‌ను పార్టీలోకి తీసుకుని.. టికెట్ ఇస్తే.. స‌రైన సంకేతాలు కూడా ఇచ్చిన‌ట్టు ఉండ‌ద‌న్న అభిప్రాయం టీవీకేలో వెలువ‌డుతోంది.

మ‌రోవైపు.. ప్ర‌స్తుతం టీవీకేకు మ‌ద్ద‌తు ఇచ్చిన వీసీకే పార్టీ.. విజ‌య్ రాజీనామా చేసిన స్థానం త‌మ‌కు ఇవ్వాల‌ని.. త‌ద్వారా ఆ స్థానంలో వీసీకే అదినేత పోటీ చేసి.. గెలిచేలా స‌హ‌క‌రించాల‌ని ముంద‌స్తు ఒప్పందం జ‌రిగింద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. అందుకే వీసీకే మ‌ద్ద‌తు ఇచ్చే విష‌యంలో కొంత మేర‌కు తాత్సారం జ‌రిగింద‌ని కూడా చెబుతున్నారు. ఇత‌ర పార్టీలు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించినా.. వీసీకే మాత్రం మ‌ద్ద‌తు ప్ర‌క‌టించి.. అధికారిక లేఖ ఇవ్వ‌కుండా తాత్సారం చేసింది. ఈ సీటు కోసం ప‌ట్టుబ‌ట్టిన ద‌రిమిలా.. టీవీకే నుంచి స్ప‌ష్ట‌మైన హామీ పొందిన త‌ర్వాతే మ‌ద్ద‌తు లేఖ‌ను అందించింద‌ని తెలుస్తోంది. సో.. దీనిని బ‌ట్టి విజ‌య్ రాజీనామా చేసిన తిరుచిరాప‌ల్లి(ఈస్ట్‌) నియోజ‌క‌వ‌ర్గాన్ని వీసీకే కు కేటాయించే అవ‌కాశం క‌నిపిస్తోంద‌ని అంటున్నారు.