Begin typing your search above and press return to search.

విజయ్ ర్యాలీలో తుపాకీతో వ్యక్తి చొరబాటు.. ఎవరీ డేవిడ్..!

వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్న సంగతి తెలిసిందే

By:  Raja Ch   |   9 Dec 2025 12:01 PM IST
విజయ్  ర్యాలీలో తుపాకీతో వ్యక్తి చొరబాటు.. ఎవరీ డేవిడ్..!
X

వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీవీకే పార్టీ అధినేత, నటుడు విజయ్ ఎన్నికల ప్రచారాన్ని పెంచారు. వాస్తవానికి కరూర్ లో జరిగిన ఘోర తొక్కిసలాట అనంతరం కాస్త గ్యాప్ తీసుకున్న ఆయన.. ఇప్పుడు తిరిగి జనాల్లోకి వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఆందోళనకర ఘటన చోటు చేసుకుంది.

అవును... గతంలో కరూర్ లో నిర్వహించిన ప్రచార సభలో జరిగిన తీవ్ర విషాదం అనంతరం విజయ్ జనాల్లోకి రాని సంగతి తెలిసిందే! ఈ క్రమంలో గత నెలలో ఓ ఇంజినీరింగ్ కాలేజీ ఆడిటోరియంలో ముందుగా ఎంపిక చేసిన కార్యకర్తలు, ప్రజలతో విజయ్ మాట్లాడారు. ఈ క్రమంలో తాజాగా బహిరంగ సభలో పాల్గొంటున్నారు.

ఇందులో భాగంగా... పుదుచ్చేరిలో నేడు విజయ్ బహిరంగ సభ జరగనుంది. ఈ క్రమంలో ఆ సభకు ఓ వ్యక్తి తుపాకీతో చొరబడేందుకు ప్రయత్నించడం ఆందోళన కలిగించింది. అయితే ఆ వ్యక్తి తుపాకీతో వేదిక వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తిని పార్టీ శివగంగై జిల్లా కార్యదర్శి ప్రభుకు గార్డుగా పనిచేసే డేవిడ్ గా గుర్తించినట్లు తెలుస్తోంది.

వాస్తవానికి కరూర్ లో నిర్వహించిన సభలో జరిగిన విషాదాన్ని దృష్టిలో పెట్టుకున్న పుదుచ్చేరి పోలీసులు.. కఠినమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా... టీవీకే పార్టీ అభ్యర్థించినట్లుగా 5,000 మందికి మాత్రమే హాజరును పరిమితం చేశారు. ఈ విషయాన్ని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ఆర్ కలైవానన్ తెలిపారు.

ఇదే సమయంలో పొరుగున ఉన్న తమిళనాడు నివాసితులు వేదికలోకి ప్రవేశించకుండా పోలీసులు నిషేధం విధించారు! ఈ సమయంలో అసౌకర్యాన్ని నివారించడానికి ఇతర ప్రాంతాల ప్రజలు, కార్యకర్తలు పుదుచ్చేరికి వెళ్లవద్దని కోరారు! అదేవిధంగా.. భద్రతా నిబంధనల్లో భాగంగా ఈ సభకు పిల్లు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులకు ప్రవేశం నిరాకరించారు.