ఇళయ దళపతి విజయ్ కి ఇపుడు అర్ధమవుతోందా ?
ఇక కరూర్ ఘటన తరువాత తన గుండె బద్దలైందని అసలు మాటలు రావడం లేదని విజయ్ అన్నారు.
By: Satya P | 1 Oct 2025 9:23 AM ISTరాజకీయాలు అంటే క్యాట్ వాక్ కావు. రీల్ లైఫ్ కి రియల్ లైఫ్ కి ఎంతో తేడా ఉంది. సినిమాల్లో ఒక హీరో ఏమైనా చేయగలడు. అదే రాజకీయాలు ప్రజా జీవితంలో రియల్ లైఫ్ లో చేయాలంటే చాలా కష్టాలు పడాలి. వెండి తెర అభిమానం ఓటర్ల ప్రేమగా కన్వర్ట్ కావాలంటే ఎన్నో చేయాలి. రీల్ హీరోతో ప్రజల కనెక్షన్ కేవలం మైండ్ వరకే. మరి రీల్ లైఫ్ లో నాయకుడుగా ప్రజల గుండెలలో స్థానం సంపాదించుకోవాలి. ఇదంతా ఎందుకు అంటే సినిమా స్టార్ల విషయంలో రాజకీయాల్లో వారి ఆసక్తి అనురక్తిని చూసినపుడు వచ్చే విశ్లేషణలు.
అదే డిస్అడ్వాంటేజ్ గా :
సినిమా హీరోలకు జనాలు విపరీతంగా వస్తారు. అది వారికి ఒక దశ వరకూ అడ్వాంటేజ్ గా ఉంటుంది. కానీ తరువాత డిస్ అడ్వాంటేజ్ గా మారుతుంది. ఏపీలో చూస్తే పవర్ స్టార్ పవన్ కి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆయన కూడా ప్రజలలోకి వచ్చి సభలు నిర్వహించేటపుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూంటారు. అయితే సరిగ్గా సభలు నిర్వహణ చేసుకోవడంలో జనసేన సక్సెస్ అయింది. అంతే కాదు జనసేన మొదటి నుంచి ఒక రాజకీయ పార్టీగా వ్యవహరించడం మొదలెట్టింది. విమర్శలకు ప్రతి విమర్శలు చేయడమే కాదు ఎక్కడ స్పందించాలి ఎలా ఎపుడు ఏమి చేయాలి అన్న దాని మీద ఒక క్లారిటీతో వ్యవహరించింది. కానీ ఇక్కడే విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ఇబ్బందులు పడుతోంది అని అంటున్నారు.
యువ నేతగా ఉంటూ :
ఇక విజయ్ విషయానికి వస్తే ఆయనకు ఇలయదళపతి అన్న బిరుదు ఉంది. దాని అర్ధం యువ నాయకుడు అని. నిజానికి తమిళనాడుకు ఆయన యువ నేతగానే ఉన్నారు ఏడున్నర పదుల వయసులో సీఎం స్టాలిన్ ఉన్నారు. మిగిలిన నేతలు అంతా కూడా ఆరు పదులు దాటిన వారే. ఈ నేపథ్యంలో సీఎం సీటుకి పోటీ పడే 51 ఏళ్ల పిన్న వయసు కలిగిన నేతగా విజయ్ ఉన్నారు ఆయన పట్ల యువత అభిమానం ఆకర్షణ కూడా అదే స్థాయిలో ఉంది. అయితే ఈ జనాదరణను సరిగ్గా మళ్ళించుకుంటే ఆయన అద్భుతాలు చేసేవారేమో. కానీ కరూర్ దుర్ఘటన మాత్రం టీవీకే పార్టీని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టేసింది అని అంటున్నారు.
చేష్టలుడినట్లుగా :
అతి పెద్ద ఘటన జరిగింది. ఏకంగా 41 మంది దాకా మృత్యువాత పడ్డారు. ఇందులో మహిళలు చిన్నారులు పెళ్ళి కావాల్సిన యువ జంటలు ఇలా ఎందరో ఉన్నారు. ఈ కన్నీటి విషాదం తరువాత టీవీకే స్పందించిన తీరు మాత్రం విమర్శల పాలు అవుతోంది. తిరుచ్చి ఎయిర్ పోర్టుకు వచ్చి అదే రాత్రి అక్కడ నుంచి చెన్నైకి చేరుకుని తన ఇంట్లో టీవీకే అధినేత విజయ్ గత కొన్ని రోజులుగా గడుపుతున్నారు. ఆయన మొదట ఈ విషాదం మీద ట్వీట్ ఒకటి చేశారు. తాజాగా ఒక వీడియో బైట్ వదిలారు. అందులో ఆయన సీఎం స్టాలిన్ మీద విమర్శలు చేశారు.
గుండె బద్దలైంది అంటూ :
ఇక కరూర్ ఘటన తరువాత తన గుండె బద్దలైందని అసలు మాటలు రావడం లేదని విజయ్ అన్నారు. అంతే కాదు ఈ ఘటనకు సంబంధించి తాను ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. ఇక తన మొత్తం జీవితంలో ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ ఎదుర్కోలేదని చెప్పుకున్నారు ఇక తానూ మనిషినే అని అంటూ అక్కడ అంతమంది చనిపోయారని తెలిస్తే అక్కడ్నించి వెళ్లిపోతానా అని కూడా అన్నారు. ఇక తన పార్టీ ర్యాలీ కోసం ఎన్నో విధాలుగా జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఇలాంటి ఊహించని ఘటన జరిగిందని వాపోయారు. ఇక ముఖ్యమంత్రి స్టాలిన్ తన మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే నన్ను ఏమైనా చేసుకోండి అని కూడా అన్నారు.
త్వరలో పరామర్శిస్తా :
ఇక ఈ ఘటనలో బాధితులను తాను తొందరలో పరామర్శిస్తానని విజయ్ చెప్పారు. ఈ దుర్ఘటన మీద ఏమి జరిగింది ఏమిటి అన్న నిజాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని ఆయన చెప్పారు అంతే కాదు తాను తొందరలో తిరుపతి వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటానని విజయ్ తెలిపారు. ఇలా ఆయన భావోద్వేగమైన వీడియోనే రిలీజ్ చేశారు. అయితే ఆయన విస్మరించిన విషయం ఏమిటి అంటే ఇన్ని రోజులు అయినా బాధితులను పరామర్శించకపోవడం, బాధితులకు ఆయన పెద్ద మొత్తంలో ఆర్ధిక సాయం ప్రకటించారు. కానీ ఒక ప్రజా నాయకుడిగా తన బాధ్యత మరచారని అంటున్నారు.
ఈ నెల 27న ఈ దుర్ఘటన జరిగింది. బాధితులను వెంటనే పరామర్శించి వారికి ఓదార్పు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ టీవీకే డిఫెన్స్ మోడ్ లోకి వెళ్లిపోయింది అని అంటున్నారు. పైగా డీఎంకేని నిందిస్తున్నారు. తమ బాధ్యత లేదని చెబుతున్నారు. రాజకీయం అంటే ఇదేనా అన్న చర్చ సాగుతోంది. ఇళయ దళపతి ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని అంటున్నారు. ఆయన ఇప్పటికైనా లేట్ చేయకుండా బాధితులను నేరుగా కలసి కన్నీరు తుడవడం ప్రథమ కర్తవ్యం అని సూచిస్తున్నారు.
