తమిళ రాజకీయాల్లో స్టార్ పవర్ వర్క్ అవుట్ కావడం లేదా?
కమల్ ఒక్కరే కాదు గతంలో కూడా చాలా మంది హీరోలు రాజకీయ ప్రవేశం చేశారు. వెండితెరపై మెరిసిన స్టార్లు రాజకీయాల్లో మాత్రం తెర వెనక పాత్రలతోనే సరిపెట్టుకున్నారని అంటున్నారు.
By: Tupaki Political Desk | 25 March 2026 11:00 PM IST"సినిమా.. రాజకీయం.. ఈ రెండింటికీ తమిళనాడు ఒక ప్రయోగశాల. వెండితెరపై దేవుళ్లుగా కొలిచే నటులను ఏకంగా ముఖ్యమంత్రి సింహాసనంపై కూర్చోబెట్టిన చరిత్ర ద్రవిడ గడ్డది. ఇక్కడ 'హీరోయిజం' అంటే కేవలం బాక్సాఫీస్ వసూళ్లు మాత్రమే కాదు, తిరుగులేని ఓటు బ్యాంకు కూడా! తమిళ రాజకీయాలకు, సినిమా రంగానికి విడదీయలేని అనుబంధం ఉంది. ఈ రాష్ట్రానికి చెందిన ఎంతో మంది అగ్ర నటులు రాజకీయాల్లోకి వచ్చి వివిధ పదవులను అధిష్టించారు. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత వంటి వారు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రులుగా పనిచేయగా, సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న రజనీకాంత్, శివాజీ గణేషన్ వంటి వారు రాజకీయాలకు సరిపడమంటూ దండం పెట్టేశారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్న విజయ్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.
తమిళనాడులో డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి బలమైన క్యాడర్ ఉన్న పార్టీలను ఎదుర్కోవడం అంటే మామూలు మాటల్లో చెప్పేంత తేలిక కాదని అంటున్నారు. తమిళ రాజకీయాల్లో 'సినీ గ్లామర్' అనేది ఒకప్పుడు తిరుగులేని అస్త్రం. కానీ, మారుతున్న కాలంతో పాటు అక్కడి ఓటరు నాడి కూడా మారుతోందని చెబుతున్నారు. కటౌట్ ఉంటే సరిపోదు.. క్యాడర్ ను పెంచుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇందుకు పలువురు నటీనటుల ఉదంతాలను ఉదహరిస్తున్నారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న స్టార్ యాక్టర్, మక్కల్ నీది మయ్యం (MNM) వ్యవస్థాపకుడు కమల హాసన్ ఈ ఎన్నికలలో పోటీకి దూరంగా ఉండిపోయారు. అధికార డీఎంకేకు తన పార్టీ మద్దతు ప్రకటించారు.
కమల్ ఒక్కరే కాదు గతంలో కూడా చాలా మంది హీరోలు రాజకీయ ప్రవేశం చేశారు. వెండితెరపై మెరిసిన స్టార్లు రాజకీయాల్లో మాత్రం తెర వెనక పాత్రలతోనే సరిపెట్టుకున్నారని అంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ సమకాలీన అగ్ర నటుడైన శివాజీ గణేషన్ రాజకీయాల్లో రాణించలేకపోయారు. తొలుత కాంగ్రెస్‌లో చేరి, ఆ తర్వాత సొంతంగా 'తమిళగ మున్నేట్ర మున్నాని' పార్టీ పెట్టినా ఆయన విజయం సాధించలేకపోయారు. సినిమా ఇమేజ్ రాజకీయాల్లోకి వచ్చేసరికి ఓట్లుగా మారకపోవడమే దీనికి ప్రధాన కారణమనే విశ్లేషణలు ఉన్నాయి.
ఇక రజనీకాంత్ వంటి సూపర్ స్టార్ కూడా తమిళ రాజకీయ క్షేత్రంలో గడ్డుకాలన్నే ఎదుర్కోవాల్సివచ్చింది. దశాబ్దాల పాటు "రాజకీయం" అనే అంశంపై ఉత్కంఠ రేపిన రజనీకాంత్ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించి ఒక్క రోజులోనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. తన ఆరోగ్యం సహకరించదని, అభిమానులను నిరాశ పరచడం ఇష్టం లేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. అదేవిధంగా సీనియర్ హీరో శరత్ కుమార్ అఖిల భారత సమత్తువ మక్కల్ కట్చి పార్టీని స్థాపించి ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే, ఒంటరిగా పార్టీని నడపడం కష్టమని భావించి, ఇటీవల తన పార్టీని బీజేపీలో విలీనం చేశారు. అదేవిధంగా కార్తీక్ అఖిల భారత నాడలుం మక్కల్ కట్చి అనే పార్టీ పెట్టినా పెద్దగా ప్రభావం చూపలేక రాజకీయాలకు దూరమయ్యారు.
ఈ పరంపరలో టీవీకే అధినేత విజయ్ వచ్చేనెలలో జరిగే ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతారనేది ఆసక్తి రేపుతోంది. ఎన్నికల నిర్వహణలో ఎదురయ్యే భారీ ఆర్థిక వ్యయాన్ని భరించడం ఆయనకు పెద్ద సవాల్ గా మారే పరిస్థితి ఉందని అంటున్నారు. అదేవిధంగా డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి బలమైన క్యాడర్ ఉన్న పార్టీలను ఢీకొని విజయతీరాలకు చేరుకోవడం అంత తేలిక కాదని వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం వెలువడుతున్న ఒపీనియన్ పోల్స్ కూడా ఇవే ఫలితాలను వెల్లడిస్తున్నాయని చెబుతున్నారు.
