విజయ్ కు ఈ ఎదురుదెబ్బలు మంచివే
ఎందుకంటే.. ప్రజలు తనతో ఉన్నా.. అధికారం చేతికి వచ్చినట్లే వచ్చి ఆగిన తీరు చూసినప్పుడు సిస్టం ఎలా పని చేస్తుంది? తోటి రాజకీయ పార్టీల వ్యవహారశైలి ఎలా ఉంటుంది?
By: Garuda Media | 9 May 2026 10:19 AM ISTరీల్ లైఫ్ కు రియల్ లైఫ్ కు మధ్య వ్యత్యాసం తెలిసిందే అయినా.. కొన్ని సందర్భాల్లో మరింత బాగా అర్థమయ్యే పరిస్థితులు చాలా అవసరం. సినీ హీరోగా తిరుగులేని విజయాల్ని సొంతం చేసుకున్న రాజకీయాల్లోకి రావటం.. తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మేజిక్ ఫిగర్ కు కూసింత దూరంలో ఆగటం తెలిసిందే. ఎన్నికల ఫలితాలు వెలువడిన సోమవారం నుంచి శుక్రవారం జరిగిన పరిణామాల్ని చూస్తే.. ఎన్నికల్లో సాధించిన 108 సీట్ల కంటే కూడా మేజిక్ ఫిగర్ కు అవసరమైన 10 మంది ఎమ్మెల్యేల కోసం పడాల్సిన పాట్లు చూస్తే.. రాజకీయాలు ఎంత కఠినంగా.. నిర్దయగా ఉంటాయన్న విషయం విజయ్ కు మరింత బాగా అర్థమయ్యేలా తోటి రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి.
108 అసెంబ్లీ స్థానాల్ని సాధించిన తమను రెండు స్థానాలు సాధించిన పార్టీలు పెడుతున్న ముప్పతిప్పలు విజయ్ కు మాత్రమే కాదు.. తమిళ ప్రజలకు సైతం బాగానే అర్థమవుతోంది. నిజానికి తమిళ ప్రజల తీర్పు ఎప్పుడూ స్పష్టంగానే ఉంటుంది. అస్పష్టత అన్నది చాలా తక్కువ. గద్దెను ఎక్కించాలన్నా.. దించాలన్నా ఒకేలాంటి ఉద్యమస్ఫూర్తిని ప్రదర్శించటం కనిపిస్తుంది. అయితే.. పోటీ తీవ్రంగా ఉండటం.. విజయ్ ఒక్కడే చేసిన పోరు.. అధికార, విపక్షాలు సైతం తమ వంతుగా చేసిన ప్రయత్నాల వేళ.. తమిళ ఓటర్లు కాస్తంత కన్ఫ్యూజ్ అయినట్లుగా కనిపిస్తోంది.
అందుకే.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన దానికి కేవలం పది సీట్ల దూరంలో విజయ్ ఉన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వేళ.. చాలామంది ఈ పది మంది ఎమ్మెల్యేల్ని తీసుకురావటం చాలా తేలికైన పనిగా భావించారు. కానీ.. రోజులు గడుస్తున్న కొద్దీ.. ట్విస్టుల మీద ట్విస్టులు ఎదురుకావటం.. చివరకు గవర్నర్ వ్యవహరించిన తీరు సైతం చర్చగా మారింది. ఇదంతా చూసినప్పుడు ఈ అనుభవాలు.. ఎదురుదెబ్బలు విజయ్ కు అవసరమైనవనే చెప్పాలి.
ఎందుకంటే.. ప్రజలు తనతో ఉన్నా.. అధికారం చేతికి వచ్చినట్లే వచ్చి ఆగిన తీరు చూసినప్పుడు సిస్టం ఎలా పని చేస్తుంది? తోటి రాజకీయ పార్టీల వ్యవహారశైలి ఎలా ఉంటుంది? కొత్తగా అధికారంలోకి వచ్చే వారికి ఎన్ని కఠిన పరీక్షలు ఎదురవుతాయన్న విషయాన్ని చాలా స్వల్ప వ్యవధిలోనే విజయ్ కు అర్థమయ్యే పరిస్థితి. ఇవన్నీ కూడా ఆయన్ను మరింత రాటుదేలేందుకు.. వ్యవస్థ మీద ఇప్పటివరకు తనకున్న అవగాహనకు మించి అర్థమయ్యేలా చేస్తుందని చెప్పాలి. ఏదో రకంగా విజయ్ ను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోకుండా చేయాలన్నట్లుగా వ్యవహరిస్తున్న పార్టీల తీరును తమిళ ప్రజలు చూస్తున్నారు. అదే సమయంలో విజయ్ తీరు సైతం ఆకట్టుకునేలా సాగుతోంది.
సీఎం అయిపోవాలన్న ఆత్రుతను పెద్దగా కనిపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మిత్రపక్షాల విషయంలో ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అధికారాన్ని సొంతంగా చేసుకోవాలన్న తొందరపాటుతో వారు కోరిన గొంతెమ్మ కోరికల్ని తీర్చేందుకు తాను సిద్ధంగా లేనన్న విషయాన్ని ఆయన స్పష్టం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో అనవసర వ్యాఖ్యలు చేయకుండా.. జరుగుతున్న పరిణామాల్ని గుంభనంగా చూస్తున్న తీరు చూస్తే.. గడిచిన ఐదారు రోజులుగా విజయ్ కు ఎదురవుతున్న ఎదురుదెబ్బలు ఆయన మరింత రాటుదేలేందుకు సాయం చేస్తాయని చెప్పాలి. ఆయన రాజకీయ జీవితం ఇప్పుడే మొదలైంది. మరెన్నో మజిలీలను చూడాల్సి ఉంది. తెలిసి తెలియనితనానికి భిన్నంగా.. అన్ని అంశాలు అర్థమయ్యేలా ఇతర పార్టీలు వ్యవహరిస్తున్న తీరు ఆయనకు చక్కటి పాఠాలుగా మారయని చెప్పాలి. ఏమైనా మరక మంచిదే అన్నట్లు.. రాజకీయాల్లో ఎదురుదెబ్బలు సైతం మరింత రాటుదేలేలా చేస్తాయని చెప్పక తప్పదు.
