Begin typing your search above and press return to search.

ఇదేంటి విజయ్? నామినేషన్ల ప్రిపరేషన్ లోనూ ఇన్ని తిప్పలా?

తాజాగా ఆయన పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాల్లో దాఖలు చేసిన నామినేషన్లలోనూ చోటు చేసుకున్న తప్పులు ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. విజయ్ టీం సమర్థత మీద కొత్త సందేహాలు పుట్టుకుచ్చేలా చేస్తుందని చెప్పాలి.

By:  Garuda Media   |   4 April 2026 12:23 AM IST
ఇదేంటి విజయ్? నామినేషన్ల ప్రిపరేషన్ లోనూ ఇన్ని తిప్పలా?
X

మిగిలిన రంగాల సంగతి ఎలా ఉన్నా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని భావించే వారు ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ రంగంలో ప్రత్యర్థులకు జాలి..దయ.. కరుణ.. లాంటివి అస్సలు ఉండవు. చిన్నపాటి అవకాశం లభించినా చెలరేగిపోవటమే కాదు.. తిరిగి లేవలేని విధంగా దెబ్బేయాలన్నట్లుగా కాచుకొని కూర్చుకోవటం రాజకీయ రంగంలో కనిపిస్తూ ఉంటుంది. అందుకే..సున్నిత మనస్కులు ఈ రంగంలోకి రావొద్దని చెబుతారు. మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించినంతనే ఆయన గురించి వ్యక్తిగతంగా తెలిసిన వారంతా ఆశ్చర్యపోయారు. చిరు లాంటి సున్నిత మనస్కులు ఈ రంగంలో ఎలా నెట్టుకు వస్తారా? అన్న సందేహాలు వ్యక్తమయ్యేవి.

అనుకున్నట్లే.. ఆయన రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించింది మొదలు ఆయనకు తగిలిన ఎదురుదెబ్బలు అన్నిఇన్ని కావు. చివరకు.. తనకు రాజకీయం సూట్ కాదన్న విషయాన్ని గ్రహించి వెనక్కి వచ్చేశారు. మళ్లీ.. ఆ వైపు చూసేందుకు సైతం ఇష్టపడలేదు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా రాజకీయాల్లోకి రావాలని తెగ ఆసక్తిని ప్రదర్శించటమే కాదు.. అందుకు భారీ కసరత్తు చేశారు. అదిగో రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారన్న సమయంలో.. అవి తనకు ఏ మాత్రం సూట్ కావన్న విషయాన్ని గుర్తించి.. పార్టీ ఏర్పాటు అంశాన్ని పురిట్లోనే చిదిమేశారు.

తాజాగా తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన తమిళ సూపర్ హీరో విజయ్ కు ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాదు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తా చాటాలని తపిస్తున్నారు. ఆయన బలాన్ని గ్రహించిన ప్రత్యర్థులు.. ఆయనకు ఇప్పటికే పలు ఎదురుదెబ్బలు తగిలేలా చేయటంలో సక్సెస్ అయ్యారు. చాలా సందర్భాల్లో ఆయన తిరిగి సమాధానం ఇవ్వలేని పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా ఆయన పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాల్లో దాఖలు చేసిన నామినేషన్లలోనూ చోటు చేసుకున్న తప్పులు ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. విజయ్ టీం సమర్థత మీద కొత్త సందేహాలు పుట్టుకుచ్చేలా చేస్తుందని చెప్పాలి.

పెరంబూర్.. తిరుచ్చి ఈస్ట్ స్థానాల్లో నామినేషన్ వేసిన విజయ్.. అందుకు సంబంధించి ఎన్నికల సంఘం అధికారులకు సమర్పించిన అఫిడవిట్ లో తేడాలు ఉన్న విషయాన్ని గుర్తించారు. దీంతో.. ఆయన ప్రత్యర్థులు తెలివిగా ఈ విషయాల్ని బయటకు తీసుకొచ్చి.. విజయ్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పెరంబూర్.. తిరుచ్చి (ఈ) అసెంబ్లీ స్థానాల కోసం సిద్ధం చేసిన అఫిడవిట్ లో పేర్కొన్న వివరాలు.. ఒకదానితో మరొకటి మ్యాచ్ కావట్లేదని చెబుతున్నారు. పెండింగ్ క్రిమినల్ కేసులు.. ఎన్నికల బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలు రెండు నామినేషన్ల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్ లో వ్యత్యాసాలు ఉన్నట్లుగా చెబుతున్నారు.

పెరంబూరులో ఇచ్చిన అఫిడవిట్ లో తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని పేర్కొన్నట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో తిరుచ్చి (ఈ) కోసం సమర్పించిన అఫిడవిట్ లో మాత్రం రెండు ఎఫ్ఐఆర్ లు ఉన్నట్లుగా పేర్కొన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు. ఎన్నికల ఖర్చు కోసం ఒక బ్యాంకు ఖాతా తెరిచినట్లుగా పేర్కొంటూ అందులో రూ.లక్ష ఉన్నట్లుగా పెరంబూరు అఫిడవిట్ లో పేర్కొనగా.. తిరుచ్చి (ఈ) అఫిడవిట్ లో మాత్రం రెండు బ్యాంకు ఖాతాలు ఉన్నాయని పేర్కొన్నట్లు చెబుతున్నారు.

ఇలా ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొనే అంశాలు పరస్పరం విరుద్ధంగా ఉండటం విజయ్ కు కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతుందని చెబుతున్నారు. ఇలాంటి తప్పుల్ని ఉద్దేశపూర్వకంగా వాస్తవాల్ని దాచి పెట్టినట్లుగా పేర్కొనటమే కాదు.. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం నిబంధనల ఉల్లంఘనే కాదు.. తీవ్రమైన ఇబ్బందులకు కారణమవుతుందని చెబుతున్నారు. అఫిడవిట్ లో పేర్కొన్న అంశాల్లో తేడాలు ఉండటం అంటే.. ఇందులో తప్పు విజయ్ కంటే కూడా ఆయన టీందే అవుతుంది. వారు చేసిన తప్పులకు.. విజయ్ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. విజయ్ తన రాజకీయ పార్టీ ప్రారంభం నుంచి తరచూ ఎదురుదెబ్బలు తింటూనే ఉన్నారు. అది కూడా తనకు సంబంధం లేకుండానే. ఇప్పుడు మరోసారి అలాంటి పరిస్థితే రిపీట్ అయ్యిందని చెప్పాలి.