Begin typing your search above and press return to search.

జాతీయ నేతగా విజయ్.. ఎగిరే పిట్టకు మసాలా నూరినట్టేనా?

ఈ నేపథ్యంలో టీవీకే నేతలు ఒక సర్వే ఫలితం చూసి విజయ్ ని జాతీయ నేతగా ప్రచారం చేయడం వల్ల అదనంగా వచ్చే లాభమేమీ లేదంటున్నారు.

By:  Tupaki Political Desk   |   31 Aug 2026 9:41 AM IST
జాతీయ నేతగా విజయ్.. ఎగిరే పిట్టకు మసాలా నూరినట్టేనా?
X

కోలీవుడ్ స్టార్ నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత దళపతి విజయ్ పేరు ప్రస్తుతం జాతీయ స్థాయిలో మార్మోగుతోంది. ఇటీవల వెలువడిన ఇండియా టుడే 'మూడ్ ఆఫ్ ది నేషన్' సర్వేలో ప్రధాని ప్రధాని అభ్యర్థిగా విజయ్ నిలవడం రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టించింది. ప్రధాని మోదీ, విపక్ష నేత రాహుల్ తర్వాత 9 శాతం మంది విజయ్ ని ప్రధానిగా చూడాలని కోరుకోవడం విశేషంగా చెబుతున్నారు. అయితే కోలివుడ్ స్టార్ గా దక్షిణాదిలో ఇమేజ్ ఉన్న విజయ్.. తొలిసారి రికార్డు విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించడంతో సహజంగా ఇటువంటి సర్వేల్లోనూ ఆ ఫలితాలు ప్రతిబింబిస్తాయని అంటున్నారు. ఇది గమనించకుండా మూడ్ ఆఫ్ నేషన్ సర్వే ఫలితాలను అడ్డుపెట్టుకుని టీవీకే నేతలు, మంత్రులు విజయ్‌ను జాతీయ నాయుడిగా, కాబోయే ప్రధానిగా ఇప్పుడే ప్రచారం చేయడంపై పరిశీలకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా తమిళనాడులో విజయవంతమైన సీఎంగా నిరూపించుకోకుండా అప్పుడే ప్రధాని అంటూ ప్రచారం చేసుకోవడం అంటే ఎగిరే పిట్టకు మసాలా నూరడంగానే పరిగణించాల్సివస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు.

దశాబ్దాల పాటు తమిళ రాజకీయాలను శాసించిన డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు ప్రత్యామ్నాయంగా విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తన మొదటి ఎన్నికల పోరులోనే అద్భుత విజయాలను సాధించి సీఎం పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఇటువంటి తరుణంలో జాతీయ స్థాయిలో వచ్చిన ఈ సర్వే ఫలితాలు ఆయన అభిమానుల్లో, పార్టీ శ్రేణుల్లో అమితాసక్తిని, ఉత్సాహాన్ని నింపాయి. ఒక కొత్త నాయకుడికి జాతీయ స్థాయిలో ఈ స్థాయి గుర్తింపు రావడం సాధారణ విషయం కాదని, దీన్ని హైలైట్ చేయడంలో తప్పులేదని కొందరు భావిస్తున్నారు. ఇటువంటి సర్వేలు వచ్చినప్పుడు అభిమానులు సంబరాలు చేసుకోవడం సహజమే అయినప్పటికీ, అధికారంలో ఉన్న టీవీకే పార్టీ నేతలు, మంత్రులే స్వయంగా రంగంలోకి దిగి విజయ్‌ను జాతీయ నాయకుడిగా ప్రొజెక్ట్ చేయడం వల్ల ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉందని అంటున్నారు.

విజయ్ ప్రస్తుతం కేవలం కొన్ని నెలల కిందటే ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. రాష్ట్ర స్థాయిలో ఆయన పాలనా దక్షత ఇంకా నిరూపితం కావాల్సి ఉంది. అనేక హామీలు, పాలనాపరమైన సవాళ్లు ఆయన ముందున్నాయని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. కేవలం ఒక రాష్ట్రంలో విజయం సాధించినంత మాత్రాన, లేదా ఒక సర్వే ఫలితాన్ని చూసి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించడం తొందరబాటే అవుతుందని అభిప్రాయపడుతున్నారు. ప్రాంతీయ పార్టీలను జాతీయ స్థాయికి విస్తరించడం అంత తేలికైన విషయం కాదన్న విషయం ముందుగా గుర్తించాలని సూచిస్తున్నారు.

గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు, మమతా బెనర్జీ వంటి ఉద్ధండులైన ప్రాంతీయ నేతలు సైతం జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని ప్రయత్నించినప్పటికీ, సొంత రాష్ట్రం దాటి పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించడంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారని విజయ్ పార్టీ నేతలు తెలుసుకోవాలని సూచిస్తున్నారు. ఇటీవల కాలంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన బీఆర్ఎస్ పార్టీని జాతీయ విస్తరించాలని చూసిన చేదు అనుభవాలే ఎదురయ్యాయని తెలుసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. అదేవిధంగా ఢిల్లీలో ఘన విజయం తర్వాత దక్షిణాదిలో పార్టీని విస్తరించి బీజేపీ, కాంగ్రెస్ తర్వాత జాతీయ పార్టీ హోదాలో ప్రభావం చూపుతున్న ఆప్ కూడా కొన్ని పరిమితులను విధించుకుందని అంటున్నారు.

ఈ నేపథ్యంలో టీవీకే నేతలు ఒక సర్వే ఫలితం చూసి విజయ్ ని జాతీయ నేతగా ప్రచారం చేయడం వల్ల అదనంగా వచ్చే లాభమేమీ లేదంటున్నారు. రాష్ట్రంలో ఇంకా పూర్తిస్థాయిలో పాలన అందించకముందే, క్షేత్రస్థాయిలో బలమైన పునాదులు వేసుకోకుండానే విజయ్‌ను ప్రధాని రేసులో ఉన్నట్లు ప్రచారం చేయడం ఆయనకే రివర్స్ అయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ప్రజల్లో ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం కాస్తా, అతివిశ్వాసంగా మారితే రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలే ప్రమాదం ఉందని రాజకీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. "రాకెట్ తయారవ్వకముందే చంద్రుడిని అందుకోవడానికి ప్రయత్నించినట్లుగా" విజయ్ విషయంలో టీవీకే నేతల ముందస్తు ప్రచారం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సర్వేలు అనేవి తాత్కాలికమని, ప్రజాస్వామ్యంలో శాశ్వత విశ్వసనీయత అనేది పటిష్టమైన పాలన, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం ద్వారానే వస్తుందని గుర్తించాలని వ్యాఖ్యానిస్తున్నారు. జాతీయ రాజకీయాల గురించి ఆలోచించేకంటే ముందు, తమిళనాడులో విజయవంతమైన సీఎంగా నిరూపించుకోవడానికి విజయ్, టీవీకే పార్టీ నేతలు ప్రాధాన్యం ఇవ్వాలని అభిప్రాయపడుతున్నారు.