కింగ్ ఫిషర్ మాల్యా.. పారిపోయి 'బాధితుడి' కార్డ్ వాడటం కరెక్టేనా! ప్రజలు ఏమంటున్నారు?
ప్రముఖ వ్యాపారవేత్త, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా లండన్ వదిలి ఇండియాకు రాకపోవడం.. ఆయనపై ఉన్న చట్టపరమైన కేసులకు సంబంధించి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా నెటిజన్ల మధ్య తీవ్రస్థాయిలో చర్చ నడుస్తోంది.
By: Sivaji Kontham | 9 Sept 2026 9:32 AM ISTప్రముఖ వ్యాపారవేత్త, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా లండన్ వదిలి ఇండియాకు రాకపోవడం.. ఆయనపై ఉన్న చట్టపరమైన కేసులకు సంబంధించి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా నెటిజన్ల మధ్య తీవ్రస్థాయిలో చర్చ నడుస్తోంది. అయితే మాల్యాను సమర్థిస్తూ కొందరు పోస్టులు పెడుతుండగా.. బ్యాంకులను, భారతీయ పన్ను చెల్లింపుదారుల సొమ్మును ముంచిన వ్యక్తిగా అభివర్ణిస్తూ మెజారిటీ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆయన సోషల్ మీడియా పోస్ట్ సెన్సేషన్‌గా మారింది.
బ్యాంకు రుణాల ఎగవేత వ్యవహారంలో తనపై జరుగుతున్న ప్రచారమంతా దుష్ప్రచారమేనని.. తాను ఎలాంటి మోసగాడిని కాదని బిజినెస్ మెన్ విజయ్ మాల్యా క్లారిటీ ఇచ్చారు. డెట్ రికవరీ ట్రిబ్యునల్ (DRT) ప్రకారం తాను చెల్లించాల్సిన అసలు- వడ్డీ కలిపి మొత్తం 10,230 కోట్లు కాగా.. బ్యాంకులు ఏకంగా 14,131 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసుకున్నాయని.. లెక్కల ప్రకారం బ్యాంకుల నుంచే తనకి ఇంకా 6,722 కోట్లు రిఫండ్ రావాల్సి ఉందంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సంచలన వాదనను తెరపైకి తెచ్చారు. ఈ వాస్తవాలను మీడియా ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీసిన ఆయన.. తాను భారత్‌కు రాకపోవడానికి భయం కారణం కాదని స్పష్టం చేశారు. 1992 నుంచే యుకే పర్మినెంట్ రెసిడెంట్‌గా ఉంటున్న తనపై అక్కడి చట్టపరమైన నిబంధనల వల్ల దేశం దాటకూడదనే నిషేధం ఉందనడం వల్లే భారత్‌కు రాలేకపోతున్నానని చెబుతూ.. తనపై వస్తున్న పారిపోయాడనే ముద్రను పూర్తిగా ఖండించారు.
అయితే సోషల్ మీడియాలో డిబేట్లు భిన్నంగా ఉన్నాయి. కొందరు అతడికి మద్ధతునిస్తుంటే, చాలా మంది మోసగాడు అంటూ తిట్టి పోస్తున్నారు. మద్ధతుదారుల ప్రకారం.. విజయ్ మాల్యా ఒక విజనరీ వ్యాపారవేత్త అని.. భారత ప్రభుత్వం ఆయన విషయంలో అన్యాయంగా వ్యవహరించిందని కొందరు అభిప్రాయపడ్డారు. భారతదేశం ఒక మంచి వ్యాపారవేత్తను కోల్పోయిందని.. లండన్‌లో ఉండటం వల్ల భారత్‌కే నష్టమని వ్యాఖ్యానించారు. తిరుపతి బాలాజీపై ఆయన కుటుంబానికి ఉన్న భక్తి ఆయనను కాపాడుతుందని... చట్టపరమైన ప్రక్రియలపై నమ్మకం ఉంచాలని మరికొందరు ఆశాభావం వ్యక్తం చేశారు.
మరోవైపు.. వ్యాపారం పేరిట బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణాలు తీసుకుని దేశం దాటిపోవడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. సామాన్యులకు చిన్న రుణం దక్కడం కష్టంగా ఉన్న రోజుల్లో బ్యాంక్ అధికారులతో కలిసి ప్రజాధనాన్ని మాల్యా లూటీ చేశారని విమర్శించారు. మద్యం వ్యాపారం చేయడం వేరు.. ఎయిర్‌లైన్స్ నడపడం వేరని.. కేవలం మాల్యా నిర్లక్ష్యం వల్లే వేలాది మంది ఉద్యోగులు, వాటాదారులతో పాటు బ్యాంకులు రోడ్డున పడ్డాయని గుర్తుచేశారు.
రుణాలు ఎగవేసి దేశం విడిచి వెళ్లిన వ్యక్తి `బాధితుడిలా` మాట్లాడటం సరికాదని.. బాధ్యతరాహిత్యంగా ప్రవర్తించి ఇప్పుడు సానుభూతి పొందాలని చూడటం విడ్డూరంగా ఉందని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. ప్రిన్సిపల్ అమౌంట్ చెల్లించి వివాదాన్ని పరిష్కరించుకోకుండా పారిపోవడం తీవ్ర నేరమని .. భారతీయ చట్టాలకు సమాధానం చెప్పకుండా ఎంతకాలం బయట ఉంటారు? అని ప్రశ్నిస్తున్నారు.
