Begin typing your search above and press return to search.

బ్యాంకుల రికవరీకి గ్రీన్ సిగ్నల్? మాల్యా కేసులో బిగ్ టర్న్!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం తన ఆస్తులను వేలం వేసి రుణాలను రికవరీ చేసుకునేందుకు ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టు గతంలో అనుమతి ఇచ్చింది.

By:  Madhu Reddy   |   14 Aug 2026 11:52 AM IST
బ్యాంకుల రికవరీకి గ్రీన్ సిగ్నల్? మాల్యా కేసులో బిగ్ టర్న్!
X

భారతదేశంలో వేల కోట్ల రూపాయల రుణాలను ఎగొట్టి లండన్‌కు పారిపోయిన ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా కేసులో ఒక ఆసక్తికరమైన మలుపు తిరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం, విజయ్ మాల్యా మధ్య గత పదేళ్లుగా నడుస్తున్న ఆస్తుల రికవరీ వివాదానికి ఇక ముగింపు పలకాలంటూ బాంబే హైకోర్టు కీలక సూచనలు చేసింది. ఈ కేసు సుదీర్ఘంగా సాగితే దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని కోర్టు అభిప్రాయపడింది.

బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు:

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం తన ఆస్తులను వేలం వేసి రుణాలను రికవరీ చేసుకునేందుకు ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టు గతంలో అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని తప్పుబడుతూ విజయ్ మాల్యా 2020లో సవాలు పిటిషన్ దాఖలు చేశారు. ఇక జస్టిస్ మిలింద్ జాదవ్ ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసిన ఆస్తుల ప్రస్తుత పరిస్థితి, కేసు దర్యాప్తు పురోగతిపై స్పష్టమైన వివరాలు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

వివాదానికి ముగింపు పలకాలన్న న్యాయస్థానం:

ఈ విషయాన్ని ఇంకా పట్టుకుని కూర్చోకుండా త్వరితగతిన ముందుకు సాగాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. బ్యాంకులు, ఈడీ మరియు ఇతర సంబంధిత వర్గాలు కలిసి కూర్చుని ఒక ఆచరణాత్మకమైన పరిష్కారం వైపు అడుగులు వేయాలని సూచించారు. ఇక కమర్షియల్ వివాదాన్ని ఏదో ఒక రకంగా త్వరగా ముగించాలని, తద్వారా బ్యాంకులు తమకు రావలసిన నిధులను మాల్యా ఆస్తులను విక్రయించి రికవరీ చేసుకునే దిశగా అడుగులు వేయవచ్చని కోర్టు అభిప్రాయపడింది.

రూ.9,000 కోట్ల రుణాలు.. విదేశాలకు పరారీ:

కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ వ్యాపారం కోసం విజయ్ మాల్యా వివిధ భారతీయ బ్యాంకుల నుంచి దాదాపు రూ.9,000 కోట్ల వరకు రుణాలు తీసుకున్నారు. ఆ రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో ఆయనపై చట్టపరమైన కేసులు నమోదయ్యాయి. 2016 మార్చిలో ఆయన భారత్ నుంచి లండన్‌కు పారిపోయారు. దీంతో 2019లో భారత ప్రభుత్వం ఆయనను 'పరారైన ఆర్థిక నేరస్థుడిగా' ప్రకటించింది. చట్టం ప్రకారం ఆయన ఆస్తులను జప్తు చేసి, రుణాల రికవరీకి అధికారులు చర్యలు చేపట్టారు.

భారత్‌కు రాకపై లండన్ కోర్టుల ఆంక్షలు:

భారత్‌లో తనను ఆర్థిక నేరస్థుడిగా ప్రకటించడాన్ని, అలాగే 2018 ఎఫ్‌ఈఓ చట్టం రాజ్యాంగ చెల్లుబాటును ప్రశ్నిస్తూ మాల్యా హైకోర్టులో పిటిషన్లు వేశారు. అయితే ఈ పిటిషన్లపై విచారణ జరగాలంటే మాల్యా ముందుగా భారత న్యాయవ్యవస్థ పరిధిలోకి రావాలని హైకోర్టు స్పష్టం చేసింది. బ్రిటన్ కోర్టుల ఆంక్షల కారణంగా మాల్యా ప్రస్తుతం భారత్‌కు ఎప్పుడు వస్తారో చెప్పలేమని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. మరోవైపు ఆయనను భారత్‌కు రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం లండన్ అధికార వర్గాలతో సంప్రదింపులు జరుపుతోంది.

మొత్తానికి పదేళ్లుగా ఊగిసలాడుతున్న విజయ్ మాల్యా ఆస్తుల జప్తు మరియు బ్యాంకుల రికవరీ వ్యవహారం ఇప్పుడు చివరి ఘట్టానికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. ఇక బాంబే హైకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలతో బ్యాంకులు తమకు రావలసిన వేల కోట్ల రుణాలను మాల్యా జప్తు చేసిన ఆస్తుల ద్వారా వేగంగా రికవరీ చేసుకునే అవకాశం లభించనుంది. రాబోయే రోజుల్లో ఈ రికవరీ ప్రక్రియ ఏ విధంగా ముగింపుకు వస్తుందో వేచి చూడాలి.