Begin typing your search above and press return to search.

దక్షిణాదిన బలమైన నేతగా దళపతి విజయ్ ?

అయితే దక్షిణాదిన ఎవరికీ లేని అవకాశాలు అయితే విజయ్ కి ఉన్నాయి. ఆయనకు ఉన్న సినీ గ్లామర్ దళపతి ఇమేజ్ వల్ల సులువుగా దక్షిణాది రాష్ట్రాలలోకి ప్రవేశించగలరు.

By:  Satya P   |   16 Oct 2026 12:20 PM IST
దక్షిణాదిన బలమైన నేతగా దళపతి విజయ్ ?
X

తమిళ సూపర్ స్టార్, దళపతి ఇలా జోసెఫ్ విజయ్ పేరుకు ముందు ఎన్నో విశేషణాలు ఉన్నాయి. అవన్నీ ఆయన సినీ క్రేజ్ కి నిదర్శనాలు. ఇక విజయ్ రెండేళ్ల క్రితం టీవీకే పేరుతో పార్టీ పెట్టారు. ఆ పార్టీని 2026 మేలో జరిగిన ఎన్నికల్లో బరిలోకి దించారు. సొంతంగా పోటీ చేసి 108 సీట్లు సాధించిన కాంగ్రెస్ ఇతర మిత్రులతో కలసి ఆయన ప్రభుత్వాన్ని స్థాపించారు. అలా రాజకీయ ఎంట్రీతోనే తొలి టార్గెట్ లోనే సీఎం సీటుని సాధించిన విజయ్ గ్రేట్ అనిపించుకున్నారు. ఇక ఆయన సీఎం గా అయిదు నెలల పాలన పూర్తి చేశారు. ఆయన పాలన గురించి జనాలు ఇంకా ఏ నిర్ణయానికి రాలేదు, ఒక విధంగా చెప్పాలంటే హానీమూన్ పీరియడ్ కంటిన్యూ అవుతోంది. విజయ్ పట్ల సినీ ఆరాధనాభావం తమిళనాడులో ఈ రోజుకీ ఉంది. అయితే అది రాష్ట్రం వెలుపలకు కూడా విస్తరించడమే విశేషం.

వ్యూహామా లేక :

విజయ్ తమిళనాడుకే పరిమితం అయిన నటుడు కాదు, ఆయన సినిమాలు గతంలో డబ్ అయి మొత్తం దక్షిణాది భాషలన్నింటిలోనూ జనాలను అలరించాయి. అదే సమయంలో ఆయన నటనతో అందరికీ సుపరిచితం అయ్యారు. అందుకే విజయ్ పార్టీ పెట్టి రాజకీయాల్లోకి రావడంతో ఆయన గురించి దక్షిణాది జనాలు కూడా ఎక్కువగా తెలుసుకునేందుకు ఆసక్తి చూపించారు. ఇక విజయ్ తమిళనాడుకు సీఎం అయినా ఆయన పర్యటనకు ఇతర రాష్ట్రాలలో చూస్తే విజయవంతం అవుతున్నాయి. దానికి కారణం ముందే చెప్పుకున్నట్లుగా ఆయన సినీ నటుడు కావడమే. ఆయన తనను తాను ప్రత్యేకంగా పరిచయం చేసుకోవలసి లేకపోవడం ప్లస్ పాయింట్. ఆయన హీరో, దానికి సీఎం పదవి జత చేరింది. దాంతో జనాల ఆసక్తి మరింత పెరుగుతోంది. అలా ఇటీవల విజయ్ ఏపీకి వచ్చారు. విజయవాడలో ఆయన అధికారిక పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆయన ఒక బహిరంగ సభలో ప్రసంగించినపుడు జనాల నుంచి మంచి స్పందన లభించింది. అయితే ఇది రాజకీయ స్పందన అని అపుడే పొరపడరాదు, ఆయన హీరో కాబట్టే ఈ కేరింతలు హుషారు అన్నది అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో ఆయన ఎక్కడికి వెళ్ళినా జనాలు వెంటపడడం కూడా హీరోగా మోజుతోనే అన్నది కూడా అవగాహన చేసుకోవాలి.

కేరళలో పార్టీ :

అయితే విజయ్ విషయానికి వస్తే ఆయన కేవలం తమిళనాడుకే పరిమితం అయి రాజకీయాలు చేస్తారా అంటే ఇపుడే ఎవరూ చెప్పలేరు, ఎందుకంటే హీరోగా దశాబ్దాల ఖ్యాతి ఆయన సొంతం అయినా రాజకీయ నాయకుడిగా ఆయన ఇంకా రెండేళ్ల వయసు మాత్రమే కలిగిన నాయకుడిగా చూడాల్సి వస్తుంది. ఇక కేరళలో అయితే విజయ్ తన పార్టీని ఏర్పాటు చేశారు. అక్కడ ఆయన ఒక నటుడికే రాష్ట పార్టీ పగ్గాలు అప్పగించారని అంటున్నారు. మలయాళ సీనియర్ నటుడు ఎస్. దేవన్ కేరళలో టీవీకే పార్టీ బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధమయ్యారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేరళలో పార్టీని విస్తరించేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో కేరళ పర్యటనను కూడా విజయ్ పెట్టుకున్నారని అంటున్నారు.

అక్కడ కూడా క్రేజ్ :

వాస్తవంగా చెప్పాలంటే సినీ నటుడిగానే విజయ్ కి దక్షిణాది రాష్ట్రాలలో ఆదరణ లభిస్తోంది. ఆయన కేరళలో పర్యటిస్తే కచ్చితంగా జనాలు పెద్ద సంఖ్యలో వస్తారు. ఈ క్రమంలో త్రిస్సూర్‌లో విజయ్ ప్రతిపాదిత పర్యటన సైతం సక్సెస్ అవుతుందని అంచనా ఉంది. అంత మాత్రం చేత కేరళలో టీవీకేకు బ్రహ్మరథం జనాలు పడతారని అనుకుంటే అపోహ అవుతుందని అంటున్నారు. కేరళకు ఒక సొంత రాజకీయ సంప్రదాయం ఉంది. అలాగే అక్కడ ఇప్పటికే బాగా పాతుకుపోయిన పార్టీలు వాటికి కట్టుబడిపోయిన ఓటర్లు ఉన్నారు. ఈ క్రమంలో విజయ్ త్రిస్సూర్‌లో పర్యటన వల్ల పెద్దగా పార్టీకి రాజకీయ లాభం వస్తుందని ఇప్పటికిపుడు అంచనా వేస్తే తప్పు అవుతుంది. అది కాలగమనంలో తేలాల్సిన విషయం.

ఏపీలోనూ మోజు వెనక :

అదే సూత్రం ఏపీకి కూడా వరిస్తుంది. ఏపీలో దసరా ఉత్సవాలకు విజయ్ హాజరు కావడాన్ని కేవలం ఒక నటుడుగా పొరుగు రాష్ట్రం సీఎం గా జనాల ఆదరించినదిగానే చూస్తారు. అంతే తప్ప టీవీకే సిద్ధాంతాలు విజయ్ ని రాజకీయ నేతగా అభిమానించే క్రమంలో అంత పెద్ద ఎత్తున జనాలు పోగు అయి నీరాజనాలు పలికారు అనుకోవడం పొరపాటు అవుతుంది. ఏపీలోనూ మూడు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. బలమైన రాజకీయ నేపథ్యంతో కూడిన ఈ పార్టీలకు పెద్ద ఎత్తున ఓటర్లు ఉన్నారు. ఈ క్రమంలో అందులో చీలిక వచ్చి టీవీకేను ఆకర్షిస్తారు అనుకోవడం కూడా తప్పే అవుతుంది. ఇక సీఎం అయిన తరువాత విజయ్ కర్ణాటకకు వెళ్ళి అక్కడ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అలా ఆయన జూన్ 12న కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం కొల్లూరు శ్రీ మూకాంబికా దేవి ఆలయాన్ని దర్శించుకున్నపుడు కూడా పెద్ద ఎత్తున జనాలు హాజరై స్వాగతం పలికారు. ఇవన్నీ ఆయన మీద వ్యక్తిగత అభిమానానికి నిదర్శనాలుగానే చూడాలని అంటున్నారు.

కేంద్ర బిందువుగా :

అయితే దక్షిణాదిన ఎవరికీ లేని అవకాశాలు అయితే విజయ్ కి ఉన్నాయి. ఆయనకు ఉన్న సినీ గ్లామర్ దళపతి ఇమేజ్ వల్ల సులువుగా దక్షిణాది రాష్ట్రాలలోకి ప్రవేశించగలరు. కానీ ఆయన రాజకీయ ఆకాంక్షలు నెగ్గాలి అన్నా టీవీకే మరింతగా విస్తరించాలి అన్నా లేక ఆయన సౌత్ ఇండియా ఫేస్ గా బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలి అన్నా మూల కేంద్రంగా తమిళనాడు మాత్రమే ఉంటుంది. అక్కడ ఆయన ఎంత బలపడితే అంతగా ఆ ప్రభావం ఇతర రాష్ట్రాల మీద పడవచ్చు. ఆయన ముందు ఇంట గెలవాలి. అంటే తమిళనాడులో ఆయన టీవీకే ప్రభుత్వం ప్రజల మన్ననలు పొంది మంచి పనులు చేసినపుడు ఆటోమేటిక్ గా అది ఆయన దక్షిణాది రాష్ట్రాలలో పార్టీ విస్తరణకు ఉపయోగపడవచ్చు. అయితే అది ఇపుడే జరిగేది కాదు, దీనిని చాలా సమయం ఉంది. విజయ్ తమిళనాడులో తన రాజకీయాన్ని బలోపేతం చేసుకోవాలి. ఆ మీదట ఆయన దక్షిణాది రాష్ట్రాల రాజకీయ దండయాత్రకు అది అనుకూలిస్తుంది అన్నదే అసలైన విశ్లేషణ.