పరామర్శ లేదు.. వివరణ లేదు.. ఇట్లైతే తళపతి కాలేవు విజయ్
అంత ప్రమాదం జరిగి.. అభిమానులు, సాధారణ ప్రజలు చనిపోతే ఆయన ప్రైవేట్ జెట్ లో రూ.కోట్ల విలువ చేసే తన ఖరీదైన కారులో అత్యంత విలాసవంతమైన బంగ్లాకు వెళ్లిపోయాడు...!
By: Tupaki Political Desk | 30 Sept 2025 3:35 PM ISTముందుగా ఓ చిన్న ట్వీట్ గురించి చెప్పుకొందాం...!
అంత ప్రమాదం జరిగి.. అభిమానులు, సాధారణ ప్రజలు చనిపోతే ఆయన ప్రైవేట్ జెట్ లో రూ.కోట్ల విలువ చేసే తన ఖరీదైన కారులో అత్యంత విలాసవంతమైన బంగ్లాకు వెళ్లిపోయాడు...!
-ఇదీ తమిళనాడు కరూర్ లో టీవీకే విజయ్ బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి 30 మంది (అప్పటికి) పైగా చనిపోయాక మరుసటి రోజు ఆదివారం ఉదయం ఓ నెటిజన్ ఎక్స్ లో పెట్టిన పోస్ట్..! ఇది నిజమేనా? అని ఎక్స్ లో అత్యంత చురుగ్గా ఉండే ఓ జర్నలిస్టు ప్రశ్నించారు..! ఆ ట్వీట్ లో ఎంత వాస్తవం ఉందో తెలియదు..! బహుశా విజయ్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే ప్రత్యర్థి సోషల్ మీడియానే ఇలా బ్యాడ్ చేసింది అనుకుందాం..?
విజయ్ చేసింది ఏముంది..?
కరూర్ బహిరంగ సభలో తొక్కిసలాటకు విజయ్ బాధ్యుడా..? అంటే, ఆయన ఆలస్యంగా రావడమే కారణం అని అంటున్నారు. అయితే, దుర్ఘటనకు ప్రత్యక్షంగా కాకున్నా పరోక్షంగా విజయ్ బాధ్యత వహించాల్సిందే. అయితే, ఆయన తీరు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. శనివారం రాత్రి ఘటన జరిగితే మంగళవారం వరకు కూడా చనిపోయినవారి కుటుంబాలకు ఆయన పరామర్శ లేదు. దుర్ఘటనపై వివరణ కూడా ఇవ్వలేదు. ఆదివారం విజయ్ పరిహరం ప్రకటించారు. ఇది ఎంత మొత్తం అనేది పక్కనపెడితే.. ఆయన ఎంత ఇచ్చినా, పరామర్శకు వెళ్లకపోవడం ద్వారా అంతా దుష్ప్రచారం జరుగుతోంది.
మిగతా పార్టీలు పరామర్శకు వెళ్తుంటే...
విజయ్ కు రాజకీయాలు కొత్త. అటుచూస్తే కాకలు తీరిన డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ ఉన్నాయి. అధికారంలో ఉన్న డీఎంకేనే నేరుగా విజయ్ కు ప్రత్యర్థి అనుకుంటే.. ఆ పార్టీ, ప్రభుత్వం తమ వంతు స్పందన కనబరిచాయి. ఇక బీజేపీ తరఫున కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పరామర్శకు వెళ్లారు. మరోవైపు కరూర్ తొక్కిసలాట ఘటనలో చనిపోయినవారి సంఖ్య పెరుగుతోంది. శనివారం రాత్రి 38 అనుకుంటే.. సోమవారం రాత్రికి 41కి చేరింది. మరో 11 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందనే కథనాలు వస్తున్నాయి.
రాజకీయాలు నేర్చుకోవాలి విజయ్...
తొక్కిసలాట ఘటన విజయ్ పార్టీకి మచ్చ. దానిని సాధ్యమైనంత చెరిపేసుకోవాల్సి బాధ్యత విజయ్ దే. కానీ, అది మరింత పెద్దదయ్యేలా చేస్తున్నాడు. మరోవైపు తొక్కిసలాట ఘటనపై కుట్ర కోణాలనూ కొట్టివేయలేమనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, జరిగిన నష్టాన్ని వెంటనే స్పందించి పూడ్చుకోవాలి. తద్వారా ప్రత్యర్థి ఎత్తులను చిత్తు చేయాలి. అదే రాజకీయం.. నేర్చుకోవాల్సి ఉంది మిస్టర్ విజయ్..! లేదంటే నాయకుడివి (తళపతి) కాలేవు.
