ఏసుక్రీస్తు ఫోటోతో విజయ్ ప్రచారం.. నిజమెంత? తలనొప్పులెన్ని?
ఆయన ఏసుక్రీస్తు ఫోటోతో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారని.. ఆయన ఇలా చేయటం ఏమిటి? అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు.
By: Garuda Media | 13 April 2026 4:31 PM ISTతమిళ సినీ నటుడు విజయ్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఒక వీడియో ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఆయన ఏసుక్రీస్తు ఫోటోతో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారని.. ఆయన ఇలా చేయటం ఏమిటి? అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇంతకూ ఆయన ఏసుక్రీస్తు ఫోటోను పట్టుకోవటం ఎంతవరకు నిజం? వైరల్ అవుతున్న వీడియో ఎప్పుడు ఎక్కడ జరిగింది? ఈ పరిణామంతో విజయ్ కు ఇప్పటివరకు ఎదురైన ఇబ్బందులేంటి? వాటిపై ఆయన పార్టీ స్పందన ఏంటి? ఎన్నికల కమిషన్ ఈ అంశంపై తీసుకునే చర్యల తీవ్రత ఎంతవరకు ఉండే వీలుంది? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే.. ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.
తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఏప్రిల్ 8న ఆయన తూత్తుకుడి.. తిరునెల్వేలి జిల్లాల్లో రోడ్ షో నిర్వహించారు. విజయ్ ప్రయాణిస్తున్న వాహనం నెమ్మదిగా ముందుకు సాగుతున్న సమయంలో.. ఒక అభిమాని భారీ ఏసు క్రీస్తు ఫోటోను విజయ్ కు అందించారు. దాన్ని ఆయన గౌరవంతో స్వీకరించారు. అభిమాని చేతికి ఇచ్చిన ఏసుక్రీస్తు పెద్ద ఫోటోను పట్టుకున్న విజయ్.. దాన్ని చేతిలోనే ఉంచుకొని ముందుకు సాగారు.
ఈ వ్యవహారం ఆయన రాజకీయప్రత్యర్థులు విమర్శించే వరకు వెళ్లింది. అదే సమయంలో ఎన్నికల అధికారి ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో ఏప్రిల్ 9-11 మధ్యలో ఈసీ ఈ అంశాన్ని పరిశీలించి నోటీసు జారీ చేశారు. అదే సమయంలో చెన్నైలోని పెరవల్లూరు పోలీసులు విజయ్ పైనా.. ఆయన పార్టీ పైనా ఐదు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎన్నికల సంఘం అధికారి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసును నమోదు చేశారు. ఈ అంశంపై విజయ్ పార్టీ స్పందించింది.
అభిమాని ఇచ్చిన బహుమతిని విజయ్ గౌరవంతో స్వీకరించారే తప్పించి.. ఇంకేం లేదని స్పష్టం చేశారు. అయినప్పటికి ఈ వివాదం కొనసా..గుతూనే ఉంది. దీనిపై ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుంది? దీన్ని ఏ కోణంలో చూస్తుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. ఈ ఉదంతంలో విజయ్ మీద చేపట్టే చర్యలు కనిష్ఠంగా మొదలుకొని గరిష్ఠంగా ఉండే ప్రమాదం పొంచి ఉంది.
ఒకవేళ.. విజయ్ మీద వచ్చిన ఆరోపణలను ఈసీ ఎలా చూస్తుంది? అన్నది చూస్తే.. మూడు స్థాయిల్లో దీన్ని పరిగణలోకి తీసుకునే వీలుంది. అదే జరిగితే..
సాధారణ స్థాయి
- తొలి తప్పుగా ఎన్నికల కమిషన్ కేవలం హెచ్చరించి వదిలేయొచ్చు
- ఒక్రటెండు రోజులు విజయ్ ఎన్నికల ప్రచారంపై నిషేధం విధించే వీలుంది. చాలామంది నేతలు ఈ తరహా హెచ్చరికల్ని ఇవ్వటం తెలిసిందే.
మధ్యస్థ స్థాయిలో చర్యలు ఎలా ఉంటాయంటే?
- పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా విచారణ. కోర్టులో జరిమానాకు అవకాశం
- పోటీకి ఎలాంటి అడ్డంకులు ఎదురు కాకున్నా.. ఫైన్ వేయటం ద్వారా ఇబ్బంది తప్పు
అసాధారణ స్థాయిలో ఎలాంటి చర్యలకు అవకాశం ఉంది?
- ఓటర్లను మతపరంగా ప్రభావితం చేస్తున్నారన్న వాదన నిజమని నిరూపిస్తే ప్రజాప్రాతినిధ్యం చట్టం కింద విజయ్ ఎన్నికను రద్దు చేసే ముప్పు పొంచి ఉంది
- అంతేకాదు భవిష్యత్తులో పోటీ చేయకుండా కొంతకాలం అనర్హత వేటు పడే అవకాశం ఉంది. అదే జరిగితే.. పార్టీకి పెద్ద ప్రమాదమే. మరి.. ఈసీ నుంచి ఆదేశాలు ఎప్పుడు వెల్లడయ్యే వీలుందన్న విషయానికి వస్తే మరో రెండు వారాల లోపు వారు తమ నిర్ణయాన్ని వెల్లడిస్తారని ఆశిస్తున్నారు.
