Begin typing your search above and press return to search.

ఇండియా కూటమిలోకి విజయ్ ?

ఇండియా కూటమిలో తాము ఉండడం లేదని ఆ మధ్య ఆప్ ప్రకటించింది. దానికి కారణం గత ఏడాది జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.

By:  A.N.Kumar   |   13 May 2026 11:19 PM IST
ఇండియా కూటమిలోకి విజయ్ ?
X

కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమిని ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ అగ్ర నాయకత్వం భావిస్తోంది. అందులో వామపక్షాలు ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలు కొనసాగుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిలో ఉన్న పార్టీల కంటే కూడా ఎక్కువ పార్టీలే ఇండియా కూటమిలో ఉన్నాయి. ఇక బలమైన నేతలు కూడా ఇండియా కూటమిలో ఉన్నారు. 2023లో ఇండియా కూటమిని ఏర్పాటు చేశారు. ఆనాడు ఇండియా కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన జేడీయూ అధినేత అప్పటి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆ తరువాత తనకు కన్వీనర్ పదవి ఇవ్వలేదని ఆగ్రహించి తప్పుకున్నారు. ఆయన తిరిగి ఎన్డీయే కూటమిలో చేరి సీఎం గా కొనసాగారు. ఇపుడు ఆయన కేంద్ర ప్రభుత్వంలో చేరుతున్నారు.

తప్పుకున్న ఆప్ :

ఇండియా కూటమిలో తాము ఉండడం లేదని ఆ మధ్య ఆప్ ప్రకటించింది. దానికి కారణం గత ఏడాది జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేసి తమ ఓట్లను చీల్చిందని ఫలితంగా బీజేపీ అధికారంలోకి రావడానికి కారణం అయిందని ఆప్ ఆరోపిస్తోంది. ఇక వచ్చే ఏడాది పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పోటీ పడనుంది. అలా ఇండియా కూటమి పార్టీలే పోటీకి వస్తే బీజేపీని నిలువరించేది ఎలా అన్నదే ఆప్ అధినేత కేజ్రీవాల్ ప్రశ్న.అందుకే ఆయన ఆప్ కి దూరంగా ఉంటున్నారు.

స్టాలిన్ దూరం :

మరో వైపు చూస్తే తమిళనాడులో టీవీకే ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం పట్ల తీవ్రంగా ఆగ్రహించిన డీఎంకే ఇండియా కూటమి నుంచి తప్పుకుంది. తమను ఇండియా బ్లాక్ నుంచి వేరు చేసి ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలని లోక్ సభ స్పీకర్ కి డీఎంకే ఇప్పటికే లేఖ రాసింది. దాంతో స్టాలిన్ కూడా తప్పుకున్నట్లు అయింది. ఇక పశ్చిమ బెంగాల్ లో ఓటమి చెందిన మమతా బెనర్జీ ఇండియా కూటమిని బలోపేతం చేస్తామని చెబుతున్నారు. అయితే ఆమె తనకు సారధ్య బాధ్యతలు అప్పగించాలని పట్టుబడుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఇండియా కూటమి సారధ్యం అంటే కాబోయే ప్రధానిగా ట్యాగ్ అన్న మాట. ఇండియా కూటమిలో అతి పెద్ద పార్టీగా ఉన్న జాతీయ పార్టీ కాంగ్రెస్ అందుకు అంగీకరించే సూచనలు లేవని అంటున్నారు. దాంతో మమత ఏమి చేస్తారో చూడాల్సి ఉంది.

విజయ్ లాంటి వారి కోసం :

ఈ నేపధ్యంలో ఇండియా కూటమిలో కొత్త రాజకీయాన్ని యువ నేతలను చేర్చుకుని పరుగులు పెట్టించాలని రాహుల్ గాంధీ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. విజయ్ జెన్ జీ మద్దతుతో అధికారంలోకి వచ్చారు. రానున్న కాలంలో జెన్ జీదే కీలక పాత్ర. దాంతో విజయ్ ని జెన్ జీ కి ఐకాన్ గా భావిస్తున్నారు. రాహుల్ సైతం ఆయనకు పెద్ద పీట వేయడానికి చూస్తున్నారు అని అంటున్నారు. తమిళనాడులో ఎటూ డీఎంకే దూరంగా ఉంటోంది కాబట్టి టీవీకేని చేర్చుకోవడం ద్వారా పటిష్టం చేయాలని చూస్తున్నారు అని చెబుతున్నారు.

ఢిల్లీకి విజయ్ :

ఇక ఈ నెల మూడవ వారంలో విజయ్ ఢిల్లీ పర్యటన ఉంటుందని చెబుతున్నారు. ఆయన సీఎం అయ్యాక కేంద్ర పెద్దలను కలుస్తారు అని అంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ 15 నుంచి అయిదు రోజుల పాటు విదేశీ పర్యటన చేయనున్నారు. దాంతో ఆయన్ వచ్చిన తరువాత విజయ్ ఢిల్లీ టూర్ ఫిక్స్ అవుతుందని అంటున్నారు. ఈ పర్యటనలోనే కాంగ్రెస్ పెద్దలతో విజయ్ భేటీ అవుతారని అంటున్నారు. అపుడే ఆయన ఇండియా కూటమిలోకి చేరిక విషయం పూర్తి స్పష్టత వస్తుందని అంటున్నారు. రానున్న కాలంలో మరిన్ని కొత్త పార్టీలను ఇండియా కూటమిలోకి తేవాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. మరి తెలుగు రాష్ట్రాల నుంచి ఏ పార్టీ అయినా చేరుతుందా అన్నది చూడాల్సి ఉంది. మొత్తం మీద ఇండియా కూటమిలో విజయ్ చేరితే పూర్తిగా యూత్ అట్రాక్షన్ వస్తుందని అంటున్నారు. ఆపైన ఆయన మీద సౌత్ ఇండియా స్టేట్స్ బాధ్యత కూడా అప్పగించే ఆలోచన ఉందని అంటున్నారు.