Begin typing your search above and press return to search.

తమిళనాడు సీఎం విజయ్ కు పరీక్ష పెడుతున్న కామ్రేడ్స్

నీతులు చెప్పటం.. సిద్ధాంతాలు వల్లెవేయటం.. దేశ ప్రయోజనాలకు తమకు మించిన మేధోమదనం మరెవరూ చేయరన్నట్లుగా బిల్డప్ ఇచ్చే రాజకీయ పార్టీల్లో వామపక్షాలు ముందు వరుసలో నిలుస్తాయి.

By:  Garuda Media   |   2 July 2026 12:38 PM IST
తమిళనాడు సీఎం విజయ్ కు పరీక్ష పెడుతున్న కామ్రేడ్స్
X

నీతులు చెప్పటం.. సిద్ధాంతాలు వల్లెవేయటం.. దేశ ప్రయోజనాలకు తమకు మించిన మేధోమదనం మరెవరూ చేయరన్నట్లుగా బిల్డప్ ఇచ్చే రాజకీయ పార్టీల్లో వామపక్షాలు ముందు వరుసలో నిలుస్తాయి. వారు చెప్పే మాటలు.. వినిపించే వాదనల్ని చూసినప్పుడు వారి లాంటి ప్రొగెసివ్ థాట్ ప్రాసెస్ చాలా అవసరమన్న భావనకు గురవుతాం. ఎప్పుడైతే వారి ఏలుబడి సుదీర్ఘకాలం సాగిన రాష్ట్రాల ముఖచిత్రాన్ని.. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే వారి జీవన స్థితిగతులు.. రాష్ట్రాల డెవలప్ మెంట్ విషయంలోనూ.. మౌలిక వసతుల విషయంలోనూ.. ఉపాధి విషయంలోనూ వారెంతలా వెనుకబడి ఉన్నారో అర్థమవుతుంది.

ఒకప్పుడు తమదైన ఉనికితో భారత రాజకీయాల్లో కీలకభూమిక పోషించిన వారు.. ఇప్పుడు ఉనికి కోసం పోరు చేయాల్సిన దుస్థితి. ఇక.. జెన్ జీలు అయితే.. వారినో రాజకీయ పక్షంగా చూసేందుకు.. గుర్తించేందుకు సైతం నో చెప్పేస్తున్నారు. ఇక.. వారి లిటరేచర్ ను చూస్తే.. వారు చెప్పే నీతులు ఆకాశంలో అన్నట్లుగా ఉంటే.. వాస్తవం మాత్రం పాత రాతి యుగాన్ని ఇప్పటికి దాటలేదు. అంతేనా.. మంచి బుద్ధులు రాకున్నా.. అర్థం లేని మాటలతో చేస్తున్న రాజకీయ తీరు కాస్త భిన్నంగానూ..మరింత కన్యూజ్ చేసేలా ఉంటున్న పరిస్థితి. తమను తాము అప్డేట్ చేసుకునే విషయంలో ఇప్పుడే కాదు.. గడిచిన పాతికేళ్లలో ప్రత్యర్థుల ఆలోచనకు భిన్నంగా తమ ఇమేజ్ పెంచే అవకాశాల్ని వదిలేసి.. అర్థం పర్థం లేని కట్టుబాట్ల పేరుతో తమను తాము నియంత్రించుకుంటున్న పరిస్థితి. అందుకు తమిళనాడులో వామపక్షాలు వ్యవహరిస్తున్న తీరే అందుకు నిదర్శనంగా చెప్పాలి.

తమిళనాడులో విజయ్ సర్కారు కొలువు తీరిన తర్వాత ఏర్పాటు చేసిన కూటమి మిత్రుల తొలి భేటీకి వామపక్షాలు హాజరుకాకుండా అందరిని ఆశ్చర్యానికి గురి చేశాయి. మొత్తం తమిళనాడు అసెంబ్లీలో 234 స్థానాలకు అధికార కూటమికి సభలో 126 మంది సభ్యులు ఉన్న సంగతి తెలిసిందే. అంటే.. అధికారంలో ఉండేందుకు 118 సీట్లు అవసరమైతే.. వామపక్షాలకు నాలుగు సీట్లు మాత్రమే ఉన్నాయి. ఒకవేళ ఇప్పటికిప్పుడు అధికార కూటమి నుంచి వైదొలిగినా.. ప్రభుత్వానికి ముంచుకొచ్చే ముప్పే లేదు. అలాంటప్పుడు కూటమి మిత్రుల తొలి భేటీకి ఎందుకు హాజరు కాలేదు? అన్నది ప్రశ్నగామారింది.

దీనికి కామ్రేడ్స్ సమాధానం ఏమంటే.. తాము విజయ్ ప్రభుత్వానికి బయట నుంచే మద్దతు ఇస్తున్నాం, కాబట్టి బయట నుంచే మద్దతు పలుకుదామన్న మాటలకు తగ్గట్లే తమ చేతలు ఉంటాయన్న విషయాన్ని కామ్రేడ్స్ స్పష్టం చేశారని చెప్పాలి. ఈ తీరుతో కామ్రేడ్లు సాధించిందేంటి? అన్నది ప్రశ్న.ఇప్పుడు విజయ్ ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు ఇస్తున్నామని చెప్పిన దానికి తగ్గట్లే.. ఆ విషయాన్ని అందరికి అర్థమయ్యేలా చేయాలన్నదే వామపక్షాల ఆలోచనగా చెబుతున్నారు. కూటమి ప్రభుత్వంలో బయట నుంచి మద్దతు ఇచ్చినా.. లోపల నుంచి మద్దతు ఇచ్చినా పెద్దగా వ్యత్యాసం లేదు. నిజానికి.. ప్రభుత్వపరంగా తప్పులు చేసినప్పుడు ఆ విషయాన్ని ఎత్తి చూపి ప్రభుత్వం నుంచి బయటకు రావటం వల్ల ప్రయోజనం ఉంటుంది. కానీ.. అలాంటిదేమీ చేయట్లేదు కామ్రేడ్లు.

తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి మిత్రపక్షాలతో కలిసి ముఖ్యమంత్రి విజయ్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. దాదాపు గంట పాటు సాగిన ఈ భేటీలో పలు ఉమ్మడి నిర్ణయాలు తీసుకున్నారు. అన్నింటికంటే.. ముఖ్యమైనది స్థిరమైన ప్రభుత్వంగా వారు పేర్కొన్నారు. అదే సమయంలో ప్రభుత్వం చేపట్టాల్సిన అంశాలకు సంబంధించిన ప్రాధాన్యతల మీద చర్చ జరిగినట్లు చెబుతున్నారు. తమ కూటమి ప్రభుత్వానికి ఒక పేరు పెట్టుకోవాలని.. అధికార పార్టీకి.. మిత్రపక్షాలకు మధ్య సమన్వయం చేసేందుకు ఒకరిని నియమించుకోవాలన్న అంశంపైనా ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

ఇలాంటి కీలక భేటీల్లో పాల్గొనటం ద్వారా వామపక్షాలు ప్రభుత్వాన్ని సరైన దారిలో నడిపే ప్రయత్నం చేయొచ్చు. కానీ.. బయట నుంచి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న కారణంగా ఈ తరహా మీటింగ్ లకు తాము హాజరు కాలేమన్న మాట వారి నోట వినిపిస్తోంది. ఆసక్తికర అంశం ఏమంటే.. సమావేశం జరగటానికి కొన్ని గంటల ముందు ముఖ్యమంత్రి విజయ్ తో భేటీ అయిన పార్టీ రాష్ట్ర నేతలు.. పలు అంశాల మీద చర్చలు జరిపినట్లు చెబుతున్నారు. కీలక భేటీల్లో మిత్రపక్ష హోదాలో హాజరుకాని వామపక్ష పార్టీలు.. మీటింగ్ కు ముందు మాత్రం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవటం గమనార్హం. కీలకమైన భేటీల్లో వామపక్షాల పాత్ర లేని లోటు.. రాబోయే రోజుల్లో వారికే నష్టం వాటిల్లేలా చేస్తుందన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.