Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ కి బంపర్ గిఫ్ట్ ఇచ్చిన సీఎం విజయ్

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ సీ విజయ్ కాంగ్రెస్ తో తన బంధాన్ని మరింత పటిష్టం చేసుకున్నారు.

By:  Satya P   |   4 Jun 2026 9:01 AM IST
కాంగ్రెస్ కి బంపర్ గిఫ్ట్ ఇచ్చిన సీఎం విజయ్
X

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ సీ విజయ్ కాంగ్రెస్ తో తన బంధాన్ని మరింత పటిష్టం చేసుకున్నారు. కేవలం అసెంబ్లీలో బలాన్ని సమకూర్చుకోవడం కోసం ఆపద్ధర్మంగా సాగిన దోస్తీ కాదని ఇది శాశ్వతమైన అనుబంధానికి పునాది అని నిరూపించే ప్రయత్నంలో మరో కీలక అడుగు వేశారు. ఇప్పటికే తన మంత్రివర్గంలో కేవలం అయిదురుగు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న కాంగ్రెస్ కి రెండు మంత్రి పదవులు ఇచ్చిన విజయ్ ఆరు దశాబ్దాల తరువాత కాంగ్రెస్ మంత్రులను తమిళనాడు ప్రభుత్వంలో చూసేలా చేయగలిగారు ఇపుడు దానికి అదనంగా మరో బంపర్ గిఫ్ట్ ని ఇస్తూ కాంగ్రెస్ అధినాయకత్వం మనసు గెలుచుకున్నారు.

ఒకే ఒక్క సీటు వారికే :

తమిళనాడులో రాజ్యసభ సీటు ఒకటి ఖాళీ యింది. అన్నా డీఎంకే నేత షణ్ముగం ఎమ్మెల్యేగా గెలవడంతో ఆ సీటుకి రాజీనామా చేశారు. దాంతో ఉప ఎన్నిక వచ్చింది. ఆ సీటుని టీవీకే అభ్యర్ధితో నింపుతారు అని అంతా అనుకుంటున్న తరుణంలో విజయ్ వ్యూహాత్మకంగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ కి ఆ సీటు ఇస్తూ తమ మిత్ర ధర్మాన్ని గట్టిగా చాటుకున్నారు. దాంతో ఏకైక ఈ సీటు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రాజ్యసభకు వెళ్లనున్నారు అని అంటున్నారు ఈ విషయాన్ని విజయ్ తాజాగా ప్రకటించడం ద్వారా తమిళ రాజకీయాల్లో కొత్త ఒరవడికి నాంది పలికారు.అంతే కాదు లేటెస్ట్ గా చూస్తే కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం సీఎం విజయ్‌ భేటీ కావడం ద్వారా కాంగ్రెస్ కి ఈ ఎంపీ సీటు ఖరారు అయింది అని చెబుతున్నారు.

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధిగా :

దీంతో ఈ సీటు నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా ఎవరు రాజ్యసభకు వెళ్తారు అన్నది చర్చగా ముందుకు వస్తోంది. అయితే కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా ఆ పార్టీ డేటా అనలిటిక్స్ విభాగానికి ఛైర్మన్‌గా ఉన్న ప్రవీణ్ చక్రవర్తి పేరు గట్టిగా వినబడుతోంది.ఈయన కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడని చెబుతున్నారు. ఇక ఈ సీటు కోసం వేరే పేర్లు వినిపిస్తున్నా ప్రవీణ్ చక్రవర్తినే ఖరారు చేస్తారు అని అంటున్నారు. దీనికి సంబంధించి రెండు మూడు రోజులలోనే కీలక ప్రకటన కాంగ్రెస్ అధినాయకత్వం నుంచి రావచ్చు అని అంటున్నారు.

గెలుపు లాంచనమే :

ఇక తమిళనాడు అసెంబ్లీలో చూస్తే టీవీకేకు 106 సీట్లు కాంగ్రెస్ కి అయిదు, ఉభయ వామపక్షాలు వీసీకే వంటి పార్టీల మద్దతుతో సాధారణ మెజారిటీతో విజయ్ ప్రభుత్వం ఏర్పడింది. ఈ మెజారిటీ చాలు రాజ్యసభ ఎంపీ అభ్యర్ధి గెలవడానికి అని అంటున్నారు. మరో వైపు కాంగ్రెస్ కి ఎంపీ సీటు ఇవ్వడం ద్వారా విజయ్ భవిష్యత్తులో సైతం డీఎంకే స్టాలిన్ వైపు ఆ పార్టీ చూడకుండా తనతోనే పూర్తిగా ఉండేలా చేసుకోగలిగారు అని అంటున్నారు. కాంగ్రెస్ కి ముందు ముందు తమిళనాడులో ఈ తరహా రాజకీయ అవకాశాలు మరిన్ని ఇచ్చేందుకు టీవీకే సిద్ధంగా ఉంది అని అంటున్నారు.