దళపతికి తొలి ఎదురుదెబ్బ! అఖిలపక్ష సమావేశంలో షాకిచ్చిన విపక్ష ఎంపీలు
తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి జోసెఫ్ విజయ్ రాజకీయంగా తొలి సవాల్ ఎదుర్కొంటున్నారు.
By: Tupaki Political Desk | 10 Aug 2026 9:15 AM ISTతమిళనాడు ముఖ్యమంత్రి దళపతి జోసెఫ్ విజయ్ రాజకీయంగా తొలి సవాల్ ఎదుర్కొంటున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సహజంగా తమిళ రాజకీయాలు ఎప్పుడూ అత్యంత క్లిష్టంగా ఉంటాయి. అక్కడ రాజకీయంగా రాణించాలంటే ఎన్నో సవాళ్లను ఎదుర్కొనవలసి ఉంటుంది. దశాబ్దాలుగా పాతుకుపోయిన ప్రాంతీయ పార్టీలు, భిన్నమైన సిద్ధాంతాలు, నాయకత్వ పోకడల మధ్య రాజకీయంగా మనుగడ సాగించడం సాధారణ విషయం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి విజయ్ ఈ సవాల్ ను అధిగమించే పరిస్థితి ఉందా? అనే ప్రశ్నే తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తోంది. తమిళనాడు రాజకీయ పక్షాలు అన్నీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న డీలిమిటేషన్ బిల్లు అంశంపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో స్పష్టమైందని చెబుతున్నారు. ఈ పరిణామం భవిష్యత్తులో తమిళ రాజకీయాల్లో ఆయన ప్రయాణం ఎంత కఠినంగా ఉండబోతుందో స్పష్టం చేసింది.
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ బిల్లు తమిళనాడుకు తీవ్ర నష్టం కలిగిస్తుందనే ఆందోళన రాష్ట్రవ్యాప్తంగా ఉంది. ఈ బిల్లు ప్రభావంపై చర్చించడానికి, తమిళనాడు ఎంపీలందరినీ ఏకం చేయాలని ముఖ్యమంత్రి విజయ్ తీసుకున్న రాజకీయంగా ఆసక్తి రేపింది. ఒక్క పార్లమెంటు సభ్యుడు లేకపోయినప్పటికీ ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న విజయ్ అన్ని పార్టీలను సంఘటితం చేయాలని భావించారు. దీంతో ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి రాజకీయంగా ప్రాధాన్యం ఏర్పడింది.
అయితే, ఈ ప్రయత్నంలో విజయ్‌కు ఊహించని సవాళ్లు ఎదురవడమే ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది. సీఎం పిలుపు మేరకు జరిగిన సమావేశానికి 19 మంది ఎంపీలు హాజరైనప్పటికీ, రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ శక్తులైన డీఎంకే, ఏఐఏడీఎంకే, పీఎంకే ఎంపీలు ఈ సమావేశానికి దూరంగా ఉండిపోయారు. డీఎంకేకు చెందిన 22 మంది లోక్‌సభ ఎంపీలు, 8 మంది రాజ్యసభ ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొనలేదు. ఆయా పార్టీల అధిష్టానాలు తమ ఎంపీలను విజయ్ నిర్వహించిన సమావేశానికి హాజరుకాకుండా కట్టడి చేయడమే దీనికి ప్రధాన కారణమని స్పష్టమవుతోంది.
రాష్ట్రంలోని అన్ని పార్టీలు డీలిమిటేషన్ బిల్లును ప్రాథమిక స్థాయిలో వ్యతిరేకిస్తున్నప్పటికీ, విజయ్ పిలుపునిచ్చిన వేదికపైకి మాత్రం రాకపోవడమే చర్చనీయాంశం అవుతోంది. ఇది తమిళనాడు రాజకీయాల్లో ఉన్న సంక్లిష్టతను ప్రతిబింబిస్తోందని అంటున్నారు. ప్రత్యర్థి పక్షాలను ఒకే తాటిపైకి తీసుకురావడంలో విజయ్ ఎదుర్కొంటున్న కష్టం, ఆయనకు రాజకీయాల్లో ఎంతటి 'రఫ్ బ్యాటిల్' ఎదురుకానుందో తేటతెల్లం చేస్తోందని అంటున్నారు. రాజకీయ అస్థిరత లేదా పాత పార్టీల రాజకీయ వ్యూహాల వల్ల విజయ్ వంటి కొత్త నాయకుడు అందరినీ కలుపుకుపోవడం ఇప్పుడు ఒక పెద్ద సవాలుగా చెబుతున్నారు.
ఈ పరిణామాలు గమనిస్తుంటే, తమిళనాడు రాజకీయాల్లో విజయ్ ప్రస్థానం సులభం కాదని అర్థమవుతోందని అంటున్నారు. నటుడిగా ఆయనకు ఉన్న ప్రజాదరణ ఎంత ఉన్నా, రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే పాత పార్టీలతో పోరాడటమే కాకుండా, విపక్షాలను ఒప్పించి తన వ్యూహాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా, డీలిమిటేషన్ బిల్లు అంశం విజయ్ రాజకీయ జీవితంలో ఒక కీలకమైన 'అగ్నిపరీక్ష'గా మిగిలిపోనుందని అంటున్నారు. రాబోయే రోజుల్లో ఆయన వ్యూహాలు, తమిళనాడు రాజకీయాల్లో ఆయన పార్టీ ఏ మేరకు ప్రభావం చూపుతుందనేది వేచి చూడాలి.
