విజయ్ ఫోటో పెట్టుకొని యువ జంట పెళ్లి.. సీఎం స్పందన తెలిస్తే మైండ్ బ్లాక్
ఒకరి మీద అభిమానం సహజం. అయితే.. ఆ అభిమానం ఎంతలా ఉంటుందన్న దానికి సంబంధించి మాత్రం తమిళులకు సాటి వచ్చే వారే ఉండరని చెప్పాలి.
By: Garuda Media | 13 Jun 2026 7:00 PM ISTఒకరి మీద అభిమానం సహజం. అయితే.. ఆ అభిమానం ఎంతలా ఉంటుందన్న దానికి సంబంధించి మాత్రం తమిళులకు సాటి వచ్చే వారే ఉండరని చెప్పాలి. కొన్నిసార్లు వీరి అభిమానం అతిగా మారినా.. వాటిని పట్టించుకోకుండా తాము అనుకున్నది అనుకున్నట్లుగా చేసుకోవటం కనిపిస్తుంది. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పార్టీకి (టీవీకే) చెందిన ఒక నాయకుడు తన కొడుకు పెళ్లి సందర్భంగా చేసిన హడావుడి.. సీఎం మీద తనకున్న అభిమానాన్ని ప్రదర్శించిన వైనం.. దానికి సంబంధించిన వీడియోలు.. ఫోటోలు ఇప్పుడు తమిళనాడులో వైరల్ అవుతున్నాయి.
ఆసక్తికరమైన అంశం ఏమంటే.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ పెళ్లిపై ముఖ్యమంత్రి విజయ్ స్పందించిన తీరు చూసినప్పుడు ఆయన మీద గౌరవం మరింత పెరగటమే కాదు.. ఆయన రాజకీయ సరికొత్తగా ఉందన్న భావన కలుగక మానదు. ఇంతకూ అసలేం జరిగింది? అన్న వివరాల్లోకి వెళితే.. తమిళగ వెట్రి కళగం(టీవీకే) మదురై నార్త్ నియోజకవర్గానికి చెందిన ఒక స్థానిక నేత ప్రభు తన కొడుకు అరుణ్ కుమార్ పెళ్లిని మదురై పరిసరప్రాంతంలో నిర్వహించారు. టీవీకేలో చురుగ్గా ఉండటమే కాదు.. విజయ్ కు వీరాభిమాని అయిన ఆ కుటుంబం.. ముఖ్యమంత్రిని పెళ్లికి ఆహ్వానించారు. అయితే.. సీఎం బిజీ షెడ్యూల్ నేపథ్యంలో ఆయన పెళ్లికి హాజరు కాలేదు.
ఈ పెళ్లి సందర్భంగా ముఖ్యమంత్రిపై తనకున్న అభిమాన్ని సదరు నేత విభిన్నంగా ప్రదర్శించారు. ముఖ్యమంత్రి విజయ్ నిలువెత్తు ఫోటోను పెళ్లి మండపానికి ఎదురుగా ఏర్పాటు చేయటమే కాదు.. హిందూ సంప్రదాయంలో జరిపే పెళ్లిలో.. కొత్త జంటకు ఎదురుగా సీఎం విజయ్ నవ్వుతున్న ఫోటోను ఏర్పాటు చేసుకున్నారు. చివరకు తాళి కట్టే సమయంలోనూ సీఎం విజయ్ వైపు చూస్తూ.. ఆయన ఆశీస్సులు పొందుతున్నట్లుగా వధువు మెడలో తాళి కట్టిన వైనం.. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
పెళ్లి లాంటి పవిత్ర సంప్రదాయ వేడుకల్లో దేవుడి ఫోటో స్థానంలో రాజకీయ నేతల ఫోటోలు పెట్టటం ఏమిటి? అన్న ప్రశ్న తెర మీదకు వచ్చింది. అయితే.. తమిళనాడులో ఇదేం కొత్త అంశం కాదని.. గతంలోనూ ఎంజీఆర్.. జయలలిత..కరుణానిధి కాలంలోనూ ఇలాంటి అభిమానాన్నే ప్రదర్శించిన ఉదంతాలు ఉన్నాయి. ఇంతకాలానికి సీఎం విజయ్ మీద ఉన్న అభిమానాన్ని ఇలా ప్రదర్శించినట్లుగా చెప్పాలి. ఈ వీడియో వైరల్ కావటం.. ఈ పెళ్లి వ్యవహారం సీఎం ద్రష్టికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. సదరు కార్యకర్త తనపై చూపిన అభిమానానికి ముగ్దులైన ముఖ్యమంత్రి విజయ్.. పార్టీ సీనియర్ ప్రతినిధుల ద్వారా కొత్త దంపతులకు తన వ్యక్తిగత అభినందనలు.. శుభాకాంక్షల సందేశాన్ని పంపారు.
ఇక్కడితో విషయం ఆగితే.. ముఖ్యమంత్రి విజయ్ ఇస్పెషల్ ఏముంది? ఇక్కడే ముఖ్యమంత్రి స్పందించిన తీరు ఆయనపై మరింత గౌరవాన్ని పెంచేలా చేసింది. కాకుంటే.. ఈ వివరాలు మీడియాలో పెద్దగా హైలెట్ కాకపోవటం గమనార్హం. తన మీద అభిమానంతో తన ఫోటోను ఎదురుగా పెట్టుకొని పెళ్లి చేసుకున్న కొత్త జంటకు అభినందనలతో పాటు.. సున్నితంగా ఒక సందేశాన్ని పంపారు. పెళ్లి లాంటి సందర్భాల్లో సంప్రదాయ పద్దతులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని.. సాధారణ ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ఉండకూడదన్న విషయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది.
అందుకే.. ఈ వైరల్ వీడియోకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పార్టీ నేతలకు.. పార్టీ సోషల్ మీడియా విభాగానికి సూచన చేసినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే.. ఈ తరహా ఘటనల్ని ప్రోత్సహిస్తే.. ఇదో వేలం వెర్రిగా మారటమే కాదు.. ప్రజల్లోనే ఇలాంటి తీరు ప్రతికూలంగా మారుతుందన్నట్లుగా సీఎం విజయ్ తీరు ఉందన్న మాట వినిపిస్తోంది. ఓవైపు అభిమాని అభిమానంపై సానుకూలంగా స్పందిస్తూనే.. మరోవైపు ఇలాంటివి పదే పదే జరగకుండా జాగ్రత్తలు తీసుకోవటం చూస్తే.. రోటీన్ రాజకీయ అధినేత తీరుకు భిన్నంగా విజయ్ వ్యవహారశైలి ఉందని చెప్పక తప్పదు.
