Begin typing your search above and press return to search.

అసెంబ్లీలో దళపతి మాస్ ఎంట్రీ.. సీఎం సీట్లో కూర్చున్న విజయ్!

అంతేకాకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తానని విజయ్ హామీ ఇచ్చారు.

By:  A.N.Kumar   |   11 May 2026 11:09 AM IST
అసెంబ్లీలో దళపతి మాస్ ఎంట్రీ.. సీఎం సీట్లో కూర్చున్న విజయ్!
X

తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. వెండితెరపై ‘దళపతి’గా కోట్లాది అభిమానుల మనసులు గెలుచుకున్న జోసెఫ్ విజయ్.. ఇప్పుడు అధికారికంగా తమిళనాడు ముఖ్యమంత్రిగా శాసనసభలో అడుగుపెట్టి రాజకీయ చరిత్రలో తనకంటూ ప్రత్యేక పేజీని రాసుకున్నారు. నిన్న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్.. ఇవాళ తొలిసారిగా అసెంబ్లీకి హాజరై ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవడం రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత చర్చనీయాంశంగా మారింది. ఇన్నాళ్లు సినిమాల్లో “అధ్యక్షా” అంటూ పవర్‌ఫుల్ డైలాగులతో ఆకట్టుకున్న విజయ్.. ఇకపై నిజ జీవితంలో ప్రజల సమస్యలపై సభలో మాట్లాడనుండటం అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.

పెరంబూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన విజయ్..

తమిళనాడు శాసనసభలో ప్రొటెం స్పీకర్ ఎం.వి. కరుప్పయ్య సమక్షంలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన అసెంబ్లీలోకి అడుగుపెట్టిన క్షణం నుంచి సభా ప్రాంగణం ప్రత్యేక ఆకర్షణగా మారింది. తమిళగ వెట్రి కజగం (టీవీకే) ఎమ్మెల్యేలతో పాటు డీఎంకే, అన్నాడీఎంకే, కాంగ్రెస్, వామపక్ష పార్టీల సభ్యులు కూడా కొత్త సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. అసెంబ్లీ బయట విజయ్ అభిమానులు భారీగా చేరుకుని సంబరాలు చేసుకున్నారు. “రీల్ సీఎం నుంచి రియల్ సీఎం వరకు” అంటూ నినాదాలు చేశారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే విజయ్ తన ప్రభుత్వ పనితీరుపై స్పష్టమైన సందేశం ఇచ్చారు. గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన ఆయన.. తమిళనాడు ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. “గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి ఖజానాను ఖాళీ చేసి వెళ్లింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పూర్తి సమీక్ష నిర్వహించి ప్రజల ముందుకు శ్వేతపత్రం తీసుకొస్తాం. నా ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుంది. ప్రజలకు ప్రతి విషయం వెల్లడిస్తాం” అని స్పష్టం చేశారు.

అంతేకాకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తానని విజయ్ హామీ ఇచ్చారు. “నన్ను విమర్శించిన వారైనా, అభిమానించిన వారైనా.. తమిళనాడులోని 8 కోట్ల మంది ప్రజలు నా వారే. ప్రజల డబ్బును పవిత్ర బాధ్యతగా భావిస్తాను. ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాకుండా చూస్తాను. విద్య, తాగునీరు, రహదారులు, మహిళల భద్రత నా ప్రభుత్వ ప్రాధాన్యతలు” అని పేర్కొన్నారు. కొంత సమయం ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తానని ప్రజలను కోరారు.

ఇక సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే విజయ్ తీసుకున్న తొలి నిర్ణయాలు కూడా ప్రజల్లో చర్చనీయాంశమయ్యాయి. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా ఫైలుపై తొలి సంతకం చేసిన ఆయన.. రాష్ట్రంలో పెరుగుతున్న మాదకద్రవ్యాల నియంత్రణ కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. మహిళల భద్రత కోసం కఠిన చర్యలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకే.. కాంగ్రెస్, వామపక్షాలు, ఇతర మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు అసెంబ్లీలో విజయ్ అడుగులు తమిళ రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు దారితీస్తాయో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.