Begin typing your search above and press return to search.

ఆటో డ్రైవర్ గా ప్రచారం చేసుకున్న దాముకు ఒక్క ఆటో లేదు.. టీవీకే ఎమ్మెల్యే గెలుపుపై సంచలన విషయాలు..

సోషల్ మీడియా అంతగా లేని కాలంలో ఇది సాగింది.. కానీ ప్రస్తుత డిజిటల్ యుగంలో అఫిడవిట్లు, ఆస్తుల వివరాలు క్షణాల్లో బయటపడుతున్నాయి.

By:  Tupaki Political Desk   |   8 May 2026 12:29 PM IST
ఆటో డ్రైవర్ గా ప్రచారం చేసుకున్న దాముకు ఒక్క ఆటో లేదు.. టీవీకే ఎమ్మెల్యే గెలుపుపై సంచలన విషయాలు..
X

రాజకీయాల్లో ఎక్కువ సార్లు ట్విస్టులు టర్న్ లు ఉంటాయి. ఒక నాయకుడు నాకు ఉండేందుకు సొంత ఇల్లు లేదని అఫిడవిట్ లో నమోదు చేస్తాడు.. కానీ బయట మాత్ర ఆయన కుటుంబ సభ్యుల పేరుమీద కోట్లాది రూపాయల ఆస్తులు ఉంటాయి. ఎన్నికల సమయంలో ఒక అభ్యర్థిని సామాన్యుడిగా, పేదవాడిగా చూపించడం ద్వారా ఓటర్ల సానుభూతిని పొందడం ఒక ఎత్తుగడ. సోషల్ మీడియా అంతగా లేని కాలంలో ఇది సాగింది.. కానీ ప్రస్తుత డిజిటల్ యుగంలో అఫిడవిట్లు, ఆస్తుల వివరాలు క్షణాల్లో బయటపడుతున్నాయి. తమిళనాడులో నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ తరపున రాయపురం నుంచి గెలిచిన విజయ్ దాము విషయంలో కూడా ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో (4 మే, 2026) రాయపురం నియోజకవర్గం నుంచి టీవీకే అభ్యర్థి కేవీ విజయ్ దాము సంచలన విజయం సాధించారు. అన్నాడీఎంకే దిగ్గజం డీ జయకుమార్ వంటి నేతలను ఓడించి ఆయన ‘జెయింట్ కిల్లర్’గా నిలిచారు. అయితే ఆయన గెలుపు కంటే, ఆయన ప్రచారం చేసుకున్న ‘ఆటో డ్రైవర్’ ఇమేజ్ ఇప్పుడు వివాదాస్పదమైంది.

ప్రచారంలో ‘ఆటో డ్రైవర్’ ఇమేజ్

ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ దామును ఒక సాధారణ ఆటో డ్రైవర్‌గా చిత్రించారు. ఒక సామాన్య ఆటో డ్రైవర్ రాజకీయ ఉద్దండులతో పోటీ పడుతున్నాడని సోషల్ మీడియాలో, ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సామాన్యుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ఆయనకు ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. ఇది ఆయన విజయానికి ప్రధాన కారణమైంది.

అఫిడవిట్ ఇచ్చిన షాక్ – ఆస్తుల చిట్టా

ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన సమర్పించిన అఫిడవిట్ వైరల్ కావడంతో అసలు విషయం బయటపడింది. ఆయన పేరుపై ఒక్క ఆటో కూడా లేదు. కానీ, 2025లో కొనుగోలు చేసిన దాదాపు రూ. 20 లక్షల విలువైన ఇన్నోవా క్రిస్టా, రెండు హోండా బైకులు ఉన్నట్లు వెల్లడైంది. ఆయన వృత్తిని ‘ఆటో కన్సల్టెన్సీ వ్యాపారం’గా పేర్కొన్నారు. అంటే ఆయన ఆటో డ్రైవర్ కాదు, ఆటోలను కొనుగోలు చేసే లేదా మధ్యవర్తిత్వం చేసే వ్యాపారవేత్త. ఆయనకు దాదాపు రూ. 28.9 లక్షల విలువైన చరాస్తులు ఉన్నాయని, ఎటువంటి అప్పులు లేవని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

గతం vs వర్తమానం

విజయ్ దాము తనపై వస్తున్న విమర్శలకు స్పందిస్తూ కొన్ని వివరణలు ఇస్తున్నారు. తాను గతంలో ఆటో నడిపి జీవనం సాగించిన మాట వాస్తవమేనని, ఆ మూలాలను గౌరవించే ‘ఆటో డ్రైవర్’ అని పిలుచుకున్నానని ఆయన అనుచరులు వాదిస్తున్నారు. అఫిడవిట్‌లో తాను ఏదీ దాచలేదని, సంపాదించిన ఆస్తులను స్పష్టంగానే చూపాడని వారు చెబుతున్నారు.

ప్రజలకు కనెక్ట్ అవ్వడానికి నాయకులు తమ పాత కష్టాలను ప్రచార ఆయుధాలుగా వాడుకోవడం కొత్తేమీ కాదు. అయితే, ప్రస్తుత స్థితికి మరియు ప్రచారానికి మధ్య అంతరం మరీ ఎక్కువగా ఉన్నప్పుడు ప్రజల్లో నమ్మకం తగ్గే అవకాశం ఉంది. ఏది ఏమైనా, ఒక సామాన్య స్థాయి నుండి వచ్చి రాజకీయ దిగ్గజాలను ఓడించడం మాత్రం ఒక గొప్ప విషయమే.