గేమింగ్ యాప్ ప్రమోషన్ వివాదంపై హీరో విజయ్ దేవరకొండ స్పందన
టాలీవుడ్ యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ ఇటీవల బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఆరోపణలపై తన మీద వచ్చిన విమర్శలకు గట్టిగా స్పందించారు.
By: A.N.Kumar | 6 Aug 2025 5:42 PM ISTటాలీవుడ్ యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ ఇటీవల బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఆరోపణలపై తన మీద వచ్చిన విమర్శలకు గట్టిగా స్పందించారు. A23 అనే గేమింగ్ యాప్‌కు మాత్రమే తాను ప్రచారం చేశానని, అది పూర్తిగా చట్టబద్ధమైన యాప్ అని ఆయన స్పష్టం చేశారు. గేమింగ్ యాప్‌లు, బెట్టింగ్ యాప్‌లు ఒకటే కాదని, రెండూ వేర్వేరు అని ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన కోరారు.
ఈడీ విచారణకు పూర్తి సహకారం
ఇటీవల ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) విచారణకు హాజరైన సందర్భంగా ఆయన తన బ్యాంక్ లావాదేవీలు, తీసుకున్న మొత్తం, కాంట్రాక్టు వివరాలు వంటి అన్ని పత్రాలను సమర్పించారు. "నేను ఎప్పుడూ చట్టానికి లోబడి ఉండే సంస్థలకే ప్రమోషన్ చేశాను. తెలంగాణలో A23 యాప్ అందుబాటులో కూడా లేదు. నేను తీసుకున్న డబ్బులు కాంట్రాక్టు ఆధారంగానే తీసుకున్నాను. ఈ వివరాలన్నీ ఈడీకి ఇచ్చాను" అని విజయ్ వివరించారు.
మీడియాపై ఆగ్రహం
కొన్ని మీడియా ఛానెళ్లు తనను బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విజయ్ దేవరకొండ ఆవేదన వ్యక్తం చేశారు. "నేను ప్రమోట్ చేసింది గేమింగ్ యాప్ మాత్రమే. దాన్ని బెట్టింగ్ యాప్‌గా చూపించడం అన్యాయం. ఆ మీడియా సంస్థలు వెంటనే తమ వార్తలను తొలగించాలి" అని ఆయన డిమాండ్ చేశారు.
ఈ వివాదంపై విజయ్ దేవరకొండ మాట్లాడుతూ తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని అని, తనపై వస్తున్న తప్పుడు ప్రచారాలు ఆపాలని కోరారు. నిజాలు ప్రజల ముందుకు రావాలని, న్యాయబద్ధంగా, పారదర్శకంగా పనిచేసేవారు ఎల్లప్పుడూ నిలబడతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
