అన్నా, ఎంజీఆర్, ఎన్టీఆర్ సరసన విజయ్.. కానీ అసలు సవాల్ ఇదే..!
తమిళనాడు రాజకీయాల్లో తాజా పరిణామాలు ముఖ్యమంత్రి దళపతి విజయ్ కి అగ్ని పరీక్షగా మారుతున్నాయా? అనే చర్చ ఎక్కువగా జరుగుతోంది.
By: Tupaki Political Desk | 9 Sept 2026 1:40 PM ISTతమిళనాడు రాజకీయాల్లో తాజా పరిణామాలు ముఖ్యమంత్రి దళపతి విజయ్ కి అగ్ని పరీక్షగా మారుతున్నాయా? అనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. పార్టీని స్థాపించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన విజయ్ ఇప్పుడు ఆ సీటును కాపాడుకోవడంపై ఎక్కువ దృష్టి పెట్టాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. గత ఎన్నికల్లో తాను సాధించిన విజయాన్ని ప్రస్తావిస్తూ ఇటీవల తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ గొప్పగా మాట్లాడారు. 1967, 1977, 1982, 2026 అంటూ గతంలో తమిళనాడు, ఏపీలో జరిగిన ఎన్నికలను గుర్తు చేస్తూ ముఖ్యమంత్రి విజయ్ తనస్థాయి మాజీ ముఖ్యమంత్రులు అన్నా, ఎంజీఆర్, ఎన్టీఆర్ తో సమానం అన్నట్లు మాట్లాడారు. ఆ ముగ్గురు నాయకుల మాదిరిగా పోటీ చేసిన తొలి ఎన్నికల్లో విజయ్ తన పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగారు. అయితే ఆ ముగ్గురికి విజయ్ కి మధ్య చిన్న తేడా కూడా ఉందని, ఈ విషయాన్ని సీఎం విజయ్ మరచిపోతే పరిణామాలు ఇబ్బందికరంగా మారవచ్చని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.
అన్నా, ఎంజీఆర్, ఎన్టీఆర్, విజయ్ అంటూ అసెంబ్లీలో సీఎం చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు దారితీసింది. తమిళనాడులో అన్నాదురై, ఎంజీఆర్, ఏపీలో ఎన్టీఆర్ ఒక చరిత్రను సృష్టించారు. విజయ్ కూడా ఆ ముగ్గురి మాదిరిగా తనకంటూ ఒక రికార్డు నెలకొల్పారు. అయితే ఆ ముగ్గురు రాజకీయాలు చేసిన కాలానికి ఇప్పటికీ ఎంతో తేడా ఉండటమే కాకుండా మిగిలిన ముగ్గురూ సొంతంగా ప్రభుత్వాలను నడిపారని, విజయ్ మాత్రం సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్న విషయాన్ని గుర్తించుకోవాలని పరిశీలకులు సూచిస్తున్నారు. మిత్రపక్షాలను కలుపుకుని వెళ్లడంతోపాటు వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని నడపాల్సివుంటుందని అంటున్నారు. గతంలో అన్నా, ఎంజీఆర్, ఎన్టీఆర్ ప్రభుత్వాలను నడిపిన సమయంలో ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కోలేదని గుర్తు చేస్తున్నారు.
అన్నా, ఎంజీఆర్, ఎన్టీఆర్ తో సమానం అన్నట్లు అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ చేసిన ప్రకటన టీవీకే వర్గాలను విశేషంగా ఆకర్షించింది. దీంతో ఆ ముగ్గురితోపాటు విజయ్ చిత్రాన్ని చేర్చుతూ ప్రత్యేక చిత్రాలను రూపొందిస్తూ తమ అధినేత మనసును మరింత ఉత్తేజ పరిచేలా పనిచేస్తున్నారు. అన్నాదురై, ఎంజీఆర్, ఎన్టీఆర్ వంటి ఉద్ధండుల సరసన తనను తాను నిలుపుకోవడం ముమ్మాటికీ వాస్తవమే అయినప్పటికీ, ఆ మహనీయుల తరహాలో ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోవడం విజయ్ ముందున్న అసలు సిసలైన సవాల్ అంటున్నారు. గతానికి నేటికీ రాజకీయ పరిస్థితుల్లో చాలా తేడా ఉందని అంటున్నారు. నాటి రాజకీయాల్లో హుందాతనం, విలువలతో కూడిన విమర్శలు ఉండేవని, కానీ, ఇప్పుడు డిజిటల్ యుగంలో రాజకీయం నిత్య రణరంగంగా మారిపోయిందని అంటున్నారు.
గతంలో కేవలం సైద్ధాంతిక వైరుధ్యాలకే రాజకీయం పరిమితం అయ్యేది. కానీ, ఇప్పుడు రాజకీయ వైరం కాస్తా వ్యక్తిగత శత్రుత్వంగా రూపాంతరం చెందుతోంది. వ్యక్తిగత అంశాలు కూడా ప్రధాన రాజకీయ అజెండాగా మారిపోతున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. అదేవిధంగా ఒకప్పుడు అభివృద్ధి, సంక్షేమం అనేవి ప్రజల అవసరాలకు అనుగుణంగా రూపుదిద్దుకునేవి. కానీ ప్రస్తుత కాలంలో రాజకీయంగా నిలదొక్కుకోవడానికి, సంక్షేమ పథకాలను అమలు చేయడానికి భారీగా నిధులు వెచ్చించాల్సి వస్తోంది. తొలి ఎన్నికల్లో పెద్దగా డబ్బు ప్రభావం లేకుండానే సోషల్ మీడియాను సమర్థవంతంగా వాడుకుని విజయ్ విజయం సాధించగలిగారు. అయితే, ఎన్నికల్లో గెలవడం వేరు, ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపించడం వేరని అంటున్నారు. అన్నాదురై, ఎంజీఆర్, ఎన్టీఆర్ సమయంలో ఇటువంటి ఇబ్బందులు లేవని అంటున్నారు. ప్రస్తుతం మిత్రపక్షాలను సమన్వయం చేసుకోవడంతోపాటు అభివృద్ధి, సంక్షేమానికి భారీగా నిధులు సమకూర్చుకోవాల్సివుంటుందని, అప్పుడే మిగిలిన ముగ్గురు మాదిరిగా విజయ్ చరిత్రలో చిరస్థాయిగా చెరిగిపోని ఖ్యాతి పొందే అవకాశం ఉంటుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
