విజిల్ వేసినంత వీజీ కాదు...విజయ్ కి ముందుంది శానా ?
దళపతి విజయ్ తమిళనాడులో సృష్టించిన రాజకీయ సునామీ గొప్పది. ఆయన సింగిల్ గా వచ్చి ఏకంగా 108 అసెంబ్లీ సీట్లు సాధించారు.
By: Satya P | 7 May 2026 6:15 PM ISTదళపతి విజయ్ తమిళనాడులో సృష్టించిన రాజకీయ సునామీ గొప్పది. ఆయన సింగిల్ గా వచ్చి ఏకంగా 108 అసెంబ్లీ సీట్లు సాధించారు. ఇక మ్యాజిక్ ఫిగర్ కి 10 సీట్ల తక్కువలో ఉన్నారు అనుకోండి. అఫ్ కోర్స్ కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది, మిగిలిన పార్టీలు కూడా ఓకే అంటాయి. మొత్తానికి 118 సీట్లతోనే విజయ్ ప్రభుత్వాన్ని రేపో మాపో ఏర్పాటు చేయడం ఖాయం. ఎందుకంటే విజయ్ పట్ల తమిళనాడులో జనాలు మరీ ముఖ్యంగా యువత చూపించిన అత్యంత ఆదరాభిమానాలను అడ్డుకోవడానికి డీఎంకే అన్నా డీఎంకే సిద్ధంగా ఉండవు. అవి వెంటనే అధికారం కోరుకోవు, అంతే కాదు తమ యాభై ఏళ్ల వైరాన్ని నిష్ఠని నైతికతను ఫణంగా పెట్టేందుకు సిద్ధంగా లేవు. అంతకంటే మించి వాటికి మరిన్ని ఆశలు ఉన్నాయి. అవే విజయ్ మీదనే
విజయ్ కి కష్టం :
అవును విజయ్ కి చాలా కష్టం. ఆయన ప్రభుత్వాన్ని నడపడం అన్నది కత్తి మీద సాము. విజయ్ తాను ఎన్నికల్లో గెలవడానికి అలవి కాని హామీలు ఇచ్చేశారు. ఏకంగా ఏడాదికి ఆరు ఉచిత గ్యాస్ సిలెండర్లు ఇస్తామని చెప్పారు. యాభై ఏళ్ళు నిండితే చాలు నెలకు 2500 రూపాయలు నగదు పంపిణీతో సహా నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, నవ వధువులకు 8 గ్రాముల బంగారం, పట్టుచీర వంటివి ఉన్నాయి. ఈ హామీలు నెరవేర్చాలంటే అదనంగా రాష్ట్ర ఖజానాపై ఏకంగా 87,900 కోట్ల రూపాయలు భారం పడుతుందని లెక్కేస్తున్నారు. విజయ్ వంటి కొత్త నాయకుడికి అది తలకు మించిన భారం అని అంటున్నారు.
పాలన మీద పట్టు :
ఇక పాలన మీద విజయ్ పట్టు పెంచుకోవాల్సి ఉంది. మెజారిటీ చూస్తే అరకొరగా ఉంటుంది. రానున్న రోజులలో అన్నా డీఎంకే నుంచి కొంత మంది ఈ వైపునకు మళ్ళినా ఎవరైనా అధికారం చూసే వస్తారు కానీ వారేమీ విజయ్ మీద ప్రేమతో రారు అన్నది తెలిసిందే. ఇలా సొంత పార్టీని వీడి వచ్చిన వారు తమకు పదవులు గౌరవాలు దక్కకపోతే అటు నుంచి తిరిగి తన సొంత గూటి వైపు వెళ్ళేందుకు కూడా వెనకాడరు అన్నది తెలుసుకోవాలి. ఇక విజయ్ కి రాజకీయంగా ఈ 118 మార్క్ మెజారిటీని కాపాడుకోవడం పెను సవాల్ గా ఉంటుంది.
కేంద్ర సాయం హుళక్కే :
ఇక స్టాలిన్ టైం లోనే కేంద్ర సాయం పెద్దగా లేదు, ఆయన ఎంతసేపూ మోడీని బీజేపీని గట్టిగా విమర్శిస్తూ వచ్చారు. దాంతో కేంద్ర పెద్దలు కూడా రాష్ట్రానికి రావాల్సినవి లాంచనంగానే ఇచ్చారు తప్పించి ఆర్ధికంగా అదనంగా పెద్దగా ఆదుకోలేదని విమర్శలు ఉన్నాయి. అయితే స్టాలిన్ తనకు ఉన్న అనుభవంతో పాలనలో ఉన్న పట్టులో రాష్ట్రాన్ని లాక్కుని వచ్చారు. కానీ విజయ్ విషయం అలా కాదు, ఆయన ఎన్నో నేర్చుకోవాల్సి ఉంటుంది. హామీలు ఇవ్వడం సులువు నెరవేర్చడం ఎంత కష్టమో పొరుగు రాష్ట్రాలను చూస్తే అర్ధం అవుతోంది కదా. ఖజానాకు ఆదాయం తక్కువ వస్తోంది, కానీ ఖర్చులు పెరిగిపోతున్నాయి. వీటిని బాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుంది.
ఆరు నెలలే టైం :
ఇక విజయ్ పార్టీ ప్రభుత్వానికి ఆరు నెలలు మాత్రమ టైం ఇస్తామని ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు. ఆరు నెలలలోగా ఆయన ఇచ్చిన అన్ని హామీలూ నెరవేర్చాలి, అలాగే డీఎంకే ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పధకాలు కూడా తప్పకుండా కొనసాగించాలని స్టాలిన్ డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు విపక్షంలో నిరంతరం విజయ్ ని రాజకీయంగా సవాల్ చేస్తూంటారు, కేంద్రంలోని బీజేపీ కూడా ఫోకస్ పెడుతూ ఉంటుంది. ప్రజల విషయం చూస్తే ఎన్నో ఆశలతో గెలిపించిన యూత్ వర్గాలు అంతే తొందరగా అసంతృప్తి పెంచుకుంటే ఇబ్బంది అవుతుంది. అలగే సాధారణ జనం కూడా తొందరగానే మార్పు కోరుకుంటారు. ఇవన్నీ చూసినపుడు అరకొర మెజారిటీతో ప్రభుత్వాన్ని విజయ్ ఏర్పాటు చేసినా ఆయనకు ముందున్నవి ముసళ్ళ పండుగ అనే అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
